ఏ కళారూపానికైనా రాణింపు… నవ్యత, నాణ్యతే. నాటక కళ ఇందుకు మినహాయింపు కాదు. అది పౌరాణికం, జానపదం, సాంఘికం.. ఏదైనా కావొచ్చు! మనకు సాంఘిక, పౌరాణిక నాటకాలు ఉన్నంత విరివిగా జానపద నాటకాలు లేవు. అందునా ఆధునిక జానపద నాటకాలు బహు అరుదు. ఆ కోవకు చెందినదే ‘చరణదాసు’. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఇటీవల (ఫిబ్రవరి 27న) ప్రదర్శితమైంది. మూస నాటక పద్ధతుల్లో విసిగి వేసారిపోయిన ప్రేక్షకులకు కొత్త రుచి చూపించింది.
చరణదాసు అనే యువకుడు దొంగతనం వృత్తిగా చేసుకుని జీవిస్తుంటాడు. అయితే అతని మనసు మంచిది. మహిళల దగ్గర దొంగతనం చేయడు. అలాగే ధనవంతుల గోదాములు దోచి ఆకలిగొన్న బీదలకు పంచుతుంటాడు. ఇలా చేస్తుండగా.. ఒకనాడు హవాల్దార్ నుంచి తప్పించుకునేందుకు చరణదాసు ఓ సాధువును ఆశ్రయిస్తాడు. తనను శిష్యునిగా చేసుకోమని సాధువుని కోరుతాడు. ‘ఏదేని ఒక మాట ఇస్తేనే శిష్యరికం, లేకపోతే కుదరద’ని సాదువు కరాఖండీగా చెప్తాడు. ‘ఒకటికాదు, నాలుగు మాటలు ఇస్తాను. నేను ఈ రోజు నుంచి బంగారు పళ్లెంలో అన్నం తినను, ఏనుగు అంబారీ అసలే ఎక్కను, మహారాణి కోరి పెండ్లాడమన్నా పెళ్లి చేసుకోను, ఈ రాజ్యానికి రాజు అవ్వమన్నా కాను’ అంటూ చరణదాసు హేళనగా మాట్లాడుతూ మాట ఇస్తాడు.
‘జరగని వాటి గురించి ఎవరైనా మాటిస్తారు. జరిగేవి ఇవ్వాలి. దొంగతనం మానేస్తానని మాట ఇస్తావా?’ అని సాధువు అడుగుతాడు. ‘అదెలా?… అది నా వృత్తి కదా! నేనివ్వను’ అన్నాడు చరణదాసు. ‘అయితే అబద్ధం ఆడనని మాట ఇవ్వు, అదే నీ చేత దొంగతనం మాన్పిస్తుంది’ అంటాడు సాధువు. అందుకు అంగీకరిస్తున్నట్టుగా ‘సర్లే!’ అని చరణదాసు వెంటనే బదులిస్తాడు. అప్పటినుంచి చరణదాసు పేరు రాజ్యమంతా మార్మోగిపోతుంది. అబద్ధం ఆడకుండా… చెప్పి మరీ దొంగతనాలు చేసేవాడు. దాంతో ‘దొంగ చరణదాసు’గా అతనిపై ముద్రపడింది.
చరణదాసు రాజ్య ఖజానా నుంచి ఐదు మొహరీలు దొంగతనం చేస్తాడు. కాపలాదారుగా ఉన్న కొత్వాల్, పనిలో పనిగా మరో ఐదు మొహరీలు దొంగిలిస్తాడు. మొత్తం పది మొహరీలు చరణదాసే దొంగిలించినట్టు నెపం వేస్తాడు. రాణి సమక్షంలో విచారణ జరుగుతుంది. ఈ విచారణలో తాను ఐదు మొహరీలు మాత్రమే దొంగిలించినట్టు చెబుతాడు చరణదాసు. తన శిష్యుడు అబద్ధం చెప్పడని అంటాడు సాధువు. పరీక్షిస్తే కొత్వాలు దొంగతనం బయటపడుతుంది.
చరణదాసు గుండె ధైర్యాన్ని, తెగువను మహారాణి మెచ్చుకుంటుంది. అతనిపై మనసుపడుతుంది. ఇంటి దొంగలను పట్టుకునేందుకు చరణదాసు అండకావాలని ఆమె భావిస్తుంది. చరణదాసును ఏనుగు అంబారీపై ఊరేగిస్తూ తీసుకురమ్మని సైన్యాన్ని పంపుతుంది. సాధువుకు మాట ఇచ్చానని అంగీకరించక నడిచి వస్తాడు చరణదాసు. అంతఃపురంలో బంగారు పళ్లెంలో పళ్లు, ఫలహారాలు పెట్టి సేవించమంటారు. అదీ మాట ఇచ్చానని వద్దంటాడు. ‘మనసుపడ్డాను పెళ్లి చేసుకో.. మహారాజై రాజ్యాన్ని పాలించు’ అని రాణి ప్రేమను వ్యక్తపరుస్తుంది. అది కూడా మాటిచ్చానని చెప్పి తిరస్కరిస్తాడు.
ఏవైతే జరగవనుకుని హేళనగా మాటిస్తే.. అవి ఒక్కొక్కటీ జరగడంతో చరణదాసు హతాశుడవుతాడు. రాణి బిత్తరపోతుంది. ‘అయిందేదో అయింది. మన మధ్య జరిగిన ఈ ముచ్చట ఎక్కడా బయటపెట్టవద్దు. అది నా గౌరవానికి భంగం’ అని మహారాణి ప్రాధేయపడుతుంది. ‘అదెలా..? నేను సత్యమే చెబుతాను’ అని మాటిచ్చానుగా అంటే… కోపాగ్నితో రగిలిపోతూ చరణదాసుకు మరణశిక్ష విధిస్తుంది. ‘సత్యమే దైవం. సత్యమే జ్ఞానం. సత్యమే వెలుగు’ పాట ఈ నాటకంలో ఆద్యంతమూ సత్యాన్ని శిఖరాగ్రాన నిలుపుతుంది. చరణదాసును సత్యానికి ప్రతీకగా చూపుతుంది ఈ నాటకం. చీకటి-వెలుగుల లోకంలో దొరల్లా మసులుతున్న అసలైన దొంగల్ని వెతికి పట్టుకోమని ప్రబోధిస్తుంది. అలతి అలతి పదాలు, పాటలు, ఆటలు, చక్కటి విన్యాసాలు, హాస్యంతోపాటు పదునైన వ్యంగ్యంతో నాటకం ఆద్యంతం మనోహరంగా సాగుతుంది. భారత రంగస్థల ప్రయోక్త, దిగ్దర్శకులు హబీబ్ తన్వీర్ రూపొందించిన ‘చరణ్‌దాస్ చోర్’ కళారూపాన్ని ఉదయభాను అంతే అద్భుతంగా తెనుగీకరించారు. భూమిక థియేటర్ గ్రూప్ పేరుతో ఉదయభాను యువతీ యువకులకు నాటక శిక్షణ ఇస్తున్నాడు. ఆ శిక్షణలో భాగమే ఈ ప్రదర్శన. యాభై ఏండ్లుగా దేశమంతటా, పాతికేండ్లుగా తెలుగునాట ఈ నాటకం ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల్ని రంజింపచేస్తున్నది.
నాటిక: చరణదాసు
రచయిత: హబీబ్ తన్వీర్
తెలుగు అనుసరణ, దర్శకత్వం: ఉదయభాను గరికపాటి
పాత్రధారులు: బబ్లూ, కళ్యాణ్, యతీశ్, వినోద్, మణి, భావన, వేదమయి, స్వామి, ఉదయ్
హార్మోనియం: విక్కీ, డోలక్: వేణు
ప్రదర్శన: భూమిక థియేటర్ గ్రూప్, హైదరాబాద్
…? కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు