బిడ్డ ఏడ్చినా, అన్నం తినకపోయినా.. అమ్మకు ఫోన్ చేయకుండా, పేరెంటింగ్ పుస్తకం తెరవకుండా ఇన్స్టాగ్రామ్చూస్తున్నారా? చాలామంది తల్లులు తమకు తెలియకుండానే ‘ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్’ అనే ప్రమాదంలో చిక్కుకున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు వాళ్ల బిడ్డల పోషణ కోసం ఇంట్లో పెద్దల సలహాలు పాటించేవారు. కొన్ని సందర్భాల్లో వైద్యులను సంప్రదించేవారు. కానీ, ఇప్పుడు ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ల రీల్స్‌నే పేరెంటింగ్ పాఠాలుగా భావిస్తున్నారు.
‘పేరెంటింగ్ ఇప్పుడు ప్రైవేట్ వ్యవహారం కాదు. ఓ ప్రదర్శనలా మారిందం’టున్నారు సైకాలజిస్ట్‌లు. ఎవరో ఆటవిడుపుగా చేసే రీల్స్ ఫాలో అవుతూ.. చాలామంది పేరెంట్స్ పిల్లల పెంపకాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. తరాలుగా వస్తున్న పేరెంటింగ్ సూత్రాలు కాదని, ఏ విధమైన ధ్రువీకరణలు లేని విధానాలను అవలంబిస్తూ పసివారితో ప్రయోగాలకు పాల్పడుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో రంగుల ప్యాన్‌కేక్‌లు, చక్కెర లేని డెజర్ట్‌లు ఉన్న హై ఎండ్ ఫుడ్ ప్లేట్లను చూపిస్తున్నారు. పేరెంట్స్ వాటికి ఆకర్షితులు అవుతున్నారు. అవి ఆరోగ్యంగా కనిపించడమే కాదు.. అవే హెల్తీ అని నమ్ముతున్నారు. దీంతో తమ పిల్లలకు సాధారణంగా పప్పు.. అన్నం.. రసం లాంటివి ఫీడ్ చేసే తల్లిదండ్రులు గిల్టీగా ఫీల్ అవుతున్నారట. అలాంటి హై ఎండ్ చిరుతిళ్లు పెట్టలేకపోతున్నామే అని పోల్చుకుంటూ ఒత్తిడికి లోనవుతున్నారట.
శిశుపోషణ కత్తి మీద సాములా ఉంటుంది. ఇక ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు నిత్యం అష్టావధానం చేయాల్సిందే! కానీ, ఇన్‌స్టా పేరెంటింగ్ దీనికి పూర్తి విరుద్ధం. ఇక్కడి ఇన్ఫ్లూయెన్సర్లు పర్ఫెక్షన్ను మాత్రమే చూపిస్తుంటారు. ఇది నార్మల్ పేరెంట్స్‌లో పోటీని సృష్టిస్తున్నది. తమ పిల్లల్నీ అలాగే చూసుకోవాలని తాపత్రయపడేలా చేస్తున్నది.
సామాజిక మాధ్యమాల్లో కంటెంట్ జనరలైజ్డ్ స్టేట్‌మెంట్స్‌గా ఉంటుంది. ఈ సూచనలు.. ఇంట్లో పెద్దలు, వ్యక్తిగత వైద్యుల సలహాలకు ప్రత్యామ్నాయంగా భావించొద్దు.

ప్రతి తల్లికీ తన బిడ్డతో సహజసిద్ధమైన కనెక్టివిటీ ఉంటుంది. దాన్ని కాదని ఇన్‌స్టా టిప్స్ విపరీతంగా పాటిస్తూ… ప్రకృతి ధర్మంగా బిడ్డతో ఉండే బంధాన్ని చాలామంది తల్లులు కోల్పోతున్నారు. అంటే, ప్రతిదానికీ సోషల్ మీడియా చూస్తూ, సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఇది తల్లీబిడ్డల బంధానికి అత్యంత ప్రమాదకరం.
ఒత్తిడి: నిరంతరం పర్ఫెక్ట్గా ఉండాలనే తపనతో.. చాలామంది సహజత్వానికి దూరమవుతున్నారు. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు.
సమయం వృథా: ప్రతి దానికి స్క్రోల్ చేయడం వల్ల బిడ్డతో గడపాల్సిన క్వాలిటీ టైమ్ కోల్పోతున్నారు. దీంతో ఈ ఒత్తిడి కేవలం తల్లిదండ్రులపైనే కాదు, పిల్లలపైనా పడుతున్నది.
పిల్లలతో డిస్కనెక్ట్: తల్లిదండ్రులు ఫోన్‌తో అతిగా ఇంటరాక్ట్ కావడం వల్ల.. బిడ్డతో నాణ్యమైన నేచురల్ కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు. ఈ మార్పు తల్లీబిడ్డల మధ్య ఉండే సృజనాత్మక, భావోద్వేగ పూరితమైన రిలేషన్‌ని తగ్గిస్తుంది.
ప్రైవసీ కోల్పోవడం: తమ వ్యక్తిగత విషయాలను అతిగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడం వల్ల బిడ్డ ప్రైవసీని తెలియకుండానే బహిర్గతం చేస్తున్నారు.
సింపుల్‌గా చెప్పాలంటే.. పిల్లల పెంపకం అంటే ఒక రీల్ చేయడం కాదు, అది ఒక రియల్ జర్నీ. బాధ్యతతో కూడిన పేరెంటింగే మీ బిడ్డలకు శ్రీరామరక్ష.