Quick Commerce | ‘సరుకులు కావాలి… మార్కెట్‌కి ఎప్పుడు వెళ్తారు’ గోపాలం భార్య పదోసారి అడిగింది. గోపాలం మాత్రం మూడు రోజుల నుంచీ ‘ఇదిగో తెస్తా, అదిగో వెళ్తా’ అంటూ మాట దాటేస్తున్నాడు. ఇంట్లో ఒక్కొక్కటిగా అయిపోతున్న కందిపప్పు, చక్కెర కోసం గోపాలం కొడుకు గ్లాసు పట్టుకుని పక్కింటికీ ఎదురింటికీ తిరుగుతున్నాడు. ఇలాంటి సందర్భాలన్నీ ఇప్పుడు కథల్లో చదువుకోవాల్సిందే! ఇప్పటి పరిస్థితులు వేరు. ఇంట్లో ఏం నిండుకున్నా సరే… పది నిమిషాల్లోనే వాటిని అందించే సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. అవి కూడా అత్యుత్తమ నాణ్యతతో, తక్కువ ధరలో! క్విక్ కామర్స్ పేరుతో విస్తరిస్తున్న ఈ సేవలు ఓ దశాబ్ద కాలం నుంచే అందుబాటులోకి వచ్చాయి. కానీ, వాటిని ప్రజలు అంతగా ఆదరించలేదు.
నిరంతరం గిరాకీ లేకపోతే కానీ గిట్టుబాటు ఉండని ఆ రంగంలో చాలా కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. కానీ, కొవిడ్ రాకతో బండ్లు ఓడలయ్యాయి. ఇంటి నుంచి కదల్లేని పరిస్థితిలో అందరూ ఆన్లైన్ సేవలను ఉపయోగించుకున్నారు. నట్టింట్లో సినిమాల నుంచి వంటింటి భోజనం వరకూ… ఇంటి బాధ్యతలన్నీ ఆన్లైన్ కంపెనీలు తీసుకున్నాయి. అది కాస్తా ఇప్పుడు అలవాటుగా మారింది. కానీ, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఈ క్విక్ కామర్స్ వల్ల మన జీవనశైలి ఎలా మారబోతున్నది. వీటితో అవసరమైన వస్తువులు అందుబాటులోకి రావడంసరే… ఆర్థిక రంగం నుంచి సామాజిక బంధాల వరకూ వీటి ప్రభావం ఎలా ఉండబోతున్నది? వీటి దెబ్బకు కిరాణా షాపులు మూతబడిపోతాయా?
ఆర్డర్ చేసిన గంట లోపలే డెలివరీ. రోజువారీ అవసరాలకు కావాల్సిన సరుకులు ఏవైనా తెప్పించుకునే సౌలభ్యం. ఇంట్లోంచి తెప్పించుకున్నా ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకపోవడం… ఇదే క్విక్ కామర్స్! దీన్ని కొనుగోలు రంగంలో మూడో తరంగా భావిస్తున్నారు. మొదటి తరంలో ఎవరికి కావాల్సిన వస్తువులు వారే తెచ్చుకునేవారు. ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ దొరికేలా ఏదన్నా సూపర్ మార్కెట్‌కి వెళ్లడం… అక్కడ నచ్చినవి, కావల్సినవి తీసుకోవడం ఇది తొలి తరం కొనుగోలు. ఇక రెండో తరంలో, ఏదన్నా కంపెనీ వినియోగదారుడి దగ్గర ఆర్డర్ తీసుకుని ఒక రెండుమూడు రోజులలో తను కోరిన సరుకులను అందించేవాళ్లు.
మొదటి రెండు తరాల్లోనూ వినియోగదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు బాగా ఉపయోగపడ్డాయి. డీమార్ట్ దగ్గర నుంచి ఫ్లిప్‌కార్ట్ వరకూ విజయవంతం అయ్యింది ఇక్కడే. ఇక మూడో తరానికి వచ్చేసరికి వేగానిదే ప్రాధాన్యం. ఇందులో దొరికే వస్తువులు, రాయితీలు తక్కువగానే ఉంటాయి కానీ… ఎంత త్వరగా వస్తుందనేదే ఎంపికను ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ క్విక్ కామర్స్ సంస్థలు వచ్చిన మొదట్లో వస్తువును అందించేందుకు 90 నిమిషాలు పడితే దాన్ని రానురానూ పది నిమిషాలకు తగ్గించాల్సి వచ్చింది. ఇంతకీ వీటి ప్రభావం ఏమిటి? పనిలో తీరుతెన్నులెలా ఉన్నాయి? లాభనష్టాల సంగతేంటి? చూద్దాం రండి!
‘అప్పిచ్చువాడు వైద్యుడు’ అన్న పదబంధం సామెతగా బలపడిపోయింది కానీ, అప్పిచ్చువాడు, వైద్యుడు, పారే నది లేని ఊరికి వెళ్లొద్దు అని సుమతీ శతకం. ఇందులో అప్పిచ్చు షావుకారు మరెవరో కాదు.. ఆ ఊరి కిరాణ కొట్టు యజమానే! కొన్ని వందల ఏళ్లుగా ఊళ్లోని కిరాణా దుకాణాలే, ఇంటి అవసరాలను ఆదుకుంటూ వస్తున్నాయి. ఊహ తెలిసినప్పటి నుంచీ అలవాటయ్యే కిరాణా, కేవలం కొట్టు మాత్రమే కాదు. తర్వాత నెలలో బిల్లు చెల్లించే క్రెడిట్ కార్డు, అవసరంలో అప్పిచ్చి ఆదుకునే ఆప్తమిత్రుడు, ఇంటిల్లిపాదీ మంచిచెడులను పరామర్శించే శ్రేయోభిలాషి. కొవిడ్ సమయంలో పెద్దపెద్ద సూపర్ మార్కెట్లు మూతపడితే ఆదుకున్నది ఆ కిరాణాలే. కానీ, అవే ఇప్పుడు అంపశయ్య మీద ఉన్నాయి. AICPDF సంస్థ ప్రకారం గడిచిన సంవత్సరంలో రెండు లక్షల కిరాణా దుకాణాలు మూతపడ్డాయి. వీటిలో దాదాపు సగం పెద్ద నగరాలకు చెందినవే. క్విక్ కామర్స్ అందుబాటులోకి రావడమే ఈ పరిణామానికి కారణం. వినియోగదారులు కిరాణా దుకాణాలకు వెళ్లడాన్ని సగానికి సగం తగ్గించేశారని మరో నివేదిక చెబుతోంది. సాధారణంగా దీపావళికి కొట్లన్నీ కిటికిటలాడిపోతాయి. కానీ ఈసారి మాత్రం చీకట్లు రాజ్యమేలాయి. అదే సమయంలో క్విక్ కామర్స్ సేవలు గతంతో పోలిస్తే ఏకంగా 250 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేశాయి.
పది నిమిషాల్లో వస్తువును అందించడం వినియోగదారులకు వరమే కావచ్చు. కానీ, దాన్ని అందించేవారి మీద ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఊహించుకోవచ్చు? పట్టణాల్లో రద్దీ చాలా ఎక్కువ… దాన్ని తట్టుకుని పది నిమిషాల్లో డెలివరీ చేయడం అంటే ప్రతీసారీ పోరాటమే. పోనీ అందుకు అందే పారితోషికం నగరంలోని జీవనవ్యయానికి సరిపోతుందా అంటే… పెట్రోలు ఖర్చులు, బండి మీద పెట్టుబడి పోను మిగిలేది అరకొరే! అందుకే క్విక్ కామర్స్ సేవలను కొంతమంది ‘టెన్ మినిట్ మర్డర్’గా విమర్శిస్తారు. అటు వినియోగదారుడూ, ఇటు పెట్టబడిదారుడూ సంతృప్తి పడుతున్న ఈ రంగంలో నష్టపోతున్నది కార్మికులే అన్నది మరికొందరి భావన.
‘మన జీవితంలో చాలా వస్తువుల కోసం రెండు నుంచి ఆరు గంటల వరకూ ఎదురుచూడటంలో తప్పులేదు. వాటిని కేవలం పది నిమిషాల్లో అందించే సేవల వల్ల శ్రామికుల మీద తీవ్ర ఒత్తిడి పడుతుంది’ అనే ట్వీట్ ఆమధ్య సంచలనంగా మారింది. ఆ అభిప్రాయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం బలపరిచారు. ఇలాంటి పరిస్థితులున్నాయని తెలిసినా కూడా నిరుద్యోగలకు ఇదే అవకాశం మిగులుతున్నది. చదువుకు తగిన ఉద్యోగం దొరకక, చాలారోజులు నిరుద్యోగంతో విసిగి వేసారేవారికి ఇదే ఆఖరి ఆశగా మారుతున్నది. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోవడం, చాలా ఉద్యోగాలను కృత్రిమ మేధ కబళించడం కూడా ఈ రంగం వైపు అడుగులు వేయిస్తున్నది. ఇలా ప్రత్యేకమైన పనివేళలు, వేతనం, సౌకర్యాలు లేకుండా పనిచేసే ఇలాంటి రంగాలలో ఉద్యోగులను ‘గిగ్ వర్కర్స్’ అంటారు.
క్విక్ కామర్స్‌లో ఉండే గిగ్ వర్కర్స్‌కి మరిన్ని సమస్యలు ఉంటాయి. డెలివరీ సమయం ఎక్కువ ఉంటే వారి రేటింగ్ తగ్గుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. పైగా కాలుష్యంలో తిరుగుతూ అనారోగ్యాల మధ్య ఎదురీదుతూ కూడా సంస్థల నుంచి ఎలాంటి సహకారం లభించదు. డెలివరీ చేస్తూ ప్రమాదానికి గురైనా, సమస్యలతో సెలవలు పెట్టినా… సానుభూతి లభించదు సరికదా డ్యూటీ సరిగా చేయడం లేదనే చివాట్లు తప్పకపోవచ్చు. ఇక జీతానిది మరో ముఖ్యమైన సమస్య. నలభై వేల వరకూ, యాభై వేల వరకూ సంపాదించవచ్చని ఊరిస్తూ ఉద్యోగాలిచ్చే కంపెనీల్లో అందులో సగం రావడం కూడ గగనంగా మారుతున్నది. న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు సైతం భారతీయ క్విక్ కామర్స్ రంగంలోని కార్మికుల కష్టాల గురించి కథనాలు రాశాయి. కానీ, వాటికి పరిష్కారాలు మాత్రం లభించే పరిస్థితులు లేవు. గిగ్ వర్కర్స్ అసంఘటిత కార్మిక రంగంలోకి వస్తారు కాబట్టి… వారికంటూ సంఘాలు కానీ, సమాజం నుంచి మద్దతు కానీ శూన్యమే.
1 క్రిసియం అనే సంస్థ నివేదిక ప్రకారం గత రెండేళ్లలోనే క్విక్ కామర్స్ అమ్మకాలలో 280 శాతం వృద్ధి కనిపించింది. 2029 నాటికి క్విక్ కామర్స్ వ్యాపారం ఏకంగా రూ.80 వేల కోట్లకు చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా.
2 స్టాటిస్టికా అనే గణాంక సంస్థ క్విక్ కామర్స్ సంస్థలు ఏటా 50 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని చెబుతున్నది. ప్రస్తుతం దేశ జనాభాలో 1 శాతం కూడా ఈ సేవలను వినియోగించడం లేదనీ, రాబోయే కాలంలో 3.5 శాతం భారతీయులు వీటిని ఉపయోగించుకుంటారని లెక్కకట్టింది.
3 PWC అనే సంస్థ సేకరించిన అభిప్రాయాలలో 80 శాతం మంది వినియోగదారులు తాము కొనుగోలులో సౌలభ్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఆ ఆశ ఫలితమే క్విక్ కామర్స్ పెరుగుదల.
4 సాధారణంగా ఇలాంటి ఆన్లైన్ సేవలను వినియోగించుకోవడం పట్ల పెద్దలు అయిష్టత చూపిస్తారు. కానీ, ఆశ్చర్యం ఏమిటంటే క్విక్ కామర్స్‌ను వినియోగిస్తున్నవారిలో 19 శాతం మంది 60 ఏళ్లకు పైబడినవారేనట.
ఒక ఉత్పత్తిని ఆర్డర్ చేసిన తర్వాత అంత త్వరగా దాన్ని ఎలా అందించగలుగుతున్నారు? అన్న ప్రశ్న సహజం. ఇందుకు జవాబు- డార్క్ స్టోర్స్! చిన్నపాటి రూం నుంచి సూపర్ మార్కెట్ అంత వైశాల్యం వరకూ… క్విక్ కామర్స్ అందించే సంస్థలు ఎక్కడికక్కడ సరుకును సిద్ధంగా ఉంచుకుంటాయి. షాపులను తలపించే ఈ డార్క్ స్టోర్స్‌లో వినియోగదారులకు ప్రవేశం ఉండదు. ఆన్లైన్లో సరుకుల్ని అందించడమే వీటి లక్ష్యం. మనం ఓ వస్తువును ఆర్డర్ చేయగానే… ఆ సమాచారం మన సమీపంలోని డార్క్ స్టోర్‌కి చేరుతుంది. ఆ వస్తువును ఎంపిక చేయడం నుంచి ప్యాక్ చేయడం వరకూ అన్నీ సెకన్ల వ్యవధిలోనే జరిగిపోతాయి. ఆ స్టోర్ బయట వేచి ఉండే డెలివరీ బాయ్, దాన్ని తీసుకుని బయల్దేరతాడు. జెప్టో వ్యవస్థాపకుడు ఆదిత్ మాటల్లో చెప్పాలంటే ‘మా సరుకుల్ని అందించేందుకు సగటు దూరం కేవలం 1.8 కిలోమీటర్లు మాత్రమే. కాబట్టి పదినిమిషాల్లో గమ్యాన్ని చేరుకోవడం కష్టమేమీ కాదు. ఈ డార్క్ స్టోర్స్ వల్ల వాటిని అద్దెకు ఇచ్చే ఇళ్ల యజమానులకు కూడా లాభమే’ అంటారాయన!
వినియోగదారులకు నేరుగా ఇంటికే సరుకులు అందించేందుకు ఇప్పుడు అన్ని సంస్థలూ సన్నద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. మోర్, డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లు సైతం ఇప్పుడు హోం డెలివరీ సేవలకు ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాయి. బిగ్ బాస్కెట్, బ్లింకిట్, జెప్టో, ఇన్ స్టా మార్ట్ లాంటి కంపెనీల సంగతి తెలిసిందే. కానీ అసలు ఆట ఇప్పుడే మొదలుకానుంది. జియో మార్ట్ తన క్విక్ డెలివరీ సేవలను విస్తరిస్తున్నది. ఫ్లిప్ కార్ట్ కూడా ఈ రంగంలో వస్తున్నది. ఇక ఆన్లైన్ షాపింగ్‌లో విప్లవం తెచ్చిన అమెజాన్ ‘తేజ్’ పేరుతో వచ్చే ఏడాది త్వరతి సేవలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటన్నిటి ఫలితం వినియోగదారుల మీదా, స్థానిక దుకాణాల మీదా, కార్మికుల మీదా ఎలా ఉండబోతుందన్నది ఆందోళన కలిగించే విషయం.
తలపండిన సంస్థలు కూడా క్విక్ కామర్స్‌లో అడుగుపెట్టడానికి తటపటాయిస్తున్నాయి. దానికి కారణాలు లేకపోలేదు.
1 సత్వరమే వస్తువులను అందించడానికి తగినన్ని గోదాములను ఏర్పాటు చేసుకోవాలి.
2 వినియోగదారులు, డెలివరీ బాయ్స్ ఇద్దరూ తృప్తిపడేలా చేస్తూనే లాభాలను ఆర్జించగలగాలి.
3 ఏ ప్రాంతంలో ఎలాంటి సరుకులకు ఎక్కువ గిరాకీ ఉందో గమనించుకోవాలి.
4 ప్రారంభంగా వచ్చే నష్టాలను ఎలా తట్టుకోవాలి. పెట్టుబడులను ఎలా సేకరించాలి లాంటి విషయాల మీద ముందే ప్రణాళికలు ఉండాలి.
5 ఏ సరుకు ఎక్కడ ఉంది, ఎంత ఉంది, దానికెంత గిరాకీ ఉంది… లాంటి సవాలక్ష విషయాలను ఠక్కున అందించేలా సమర్థవంతమైన సాఫ్ట్వేర్ అందుబాటులో ఉండాలి.
– కె.సహస్ర