రింగుల జుట్టు.. ఒత్తుగా కనిపిస్తుంది. అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ, కర్లీ హెయిర్ కొన్ని కష్టాలనూ తెచ్చిపెడుతుంది. అది చిక్కులు పడితే.. సరిచేయడానికి చాలా సమయం పడుతుంది. దువ్వెన వాడితేనేమో జుట్టు తెగిపోతుంది, రాలిపోతుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే.. రింగుల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
వెంట్రుకలు తడిగా ఉన్నప్పుడు దువ్వుకోకపోవడమే మంచిది. తడి ఉన్నప్పుడు చిక్కుబడితే విప్పడం చాలా కష్టం. దువ్వెనను వాడితే.. వెంట్రుకలు తెగిపోవడం, రాలిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
షాంపూ చేయడానికి ముందే వెంట్రుకలకు నూనెను పట్టించి, బాగా మసాజ్ చేయాలి. కొబ్బరి లేదా ఆవ నూనెలు వాడటం వల్ల జుట్టు మందంగా మారుతుంది. వెంట్రుకలను వదులుగా చేస్తాయి.
జుట్టు ఎక్కువగా చిక్కులు పడటానికి కారణం.. వెంట్రుకలు పొడిబారడం. జుట్టులో తేమ లేకుంటే.. నిర్జీవంగా, సుడులు సుడులుగా అల్లుకుపోతుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు మాయిశ్చరైజింగ్, ఆయిల్ బేస్డ్ షాంపూలను వాడాలి. షాంపూ చేసిన తర్వాత కండీషనర్‌ను ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. షాంపూలతో ఇబ్బంది అనుకుంటే.. బియ్యం కడిగిన గంజి నీటిని ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుంది.
పొడి జుట్టు సమస్యను హెయిర్ మాస్క్ సమర్థంగా నివారిస్తుంది. పెరుగు-తేనె కలిపి ఇంట్లోనే హెయిర్ మాస్క్ తయారుచేసుకోవచ్చు. ఈ మాస్క్‌లు జుట్టును మృదువుగా, బలంగా మారుస్తాయి.
కొందరు వెంట్రుకలు తడి ఆరిన తర్వాతే సీరమ్‌ను అప్లయ్ చేస్తారు. కానీ, సీరమ్‌ను ఎప్పుడైనా.. తడి జుట్టు మీదే వాడాలి.
హెయిర్ డ్రయర్ వాడటం వల్ల జుట్టు తేమను కోల్పోతుంది. అందుకే, టవల్‌ను ఉపయోగించే.. జుట్టును తడి ఆరనివ్వాలి. ఇందుకోసం మైక్రోఫైబర్ టవల్ మంచిది. మృదువుగా తుడిస్తేనే.. జుట్టు రాలకుండా ఉంటుంది.