వర్కౌట్ చేసేవాళ్లను సంగీతం మరింత ఉత్సాహపరుస్తుంది. కానీ, చెవిలో బాగా ఫిట్ అవ్వని ఇయర్‌బడ్స్ వల్ల మ్యూజిక్ వింటూ వర్కౌట్స్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్లకోసం పవర్‌బీట్స్ ప్రో 2 వచ్చేసింది. మార్కెట్లో ఇప్పటికే స్పోర్ట్స్ ఇయర్‌బడ్స్ చాలా ఉన్నాయి. కానీ, పవర్‌బీట్స్ ప్రో 2 ప్రత్యేకత ఏమిటంటే.. ఆపిల్ H2 చిప్. దీంతో మరింత క్లియర్ సౌండ్, స్టేబుల్ కనెక్టివిటీతో మ్యూజిక్ వినొచ్చు. హుక్ టైప్ డిజైన్‌తో వచ్చే ఈ ఇయర్‌బడ్స్ చెవిని గట్టిగా పట్టుకుంటాయి. వర్షంలో తడిసినా, వర్కౌట్స్ చేస్తూ చెమట పట్టినా ఇబ్బంది లేకుండా.. IPX4 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌తో రూపొందించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 10 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇక చార్జింగ్ కేస్‌తో కలిపితే 45 గంటల వరకు నాన్‌స్టాప్ మ్యూజిక్ వినొచ్చు. వ్యాయామం చేసేటప్పుడు హార్ట్‌బీట్‌ని ట్రాక్‌చేసే ఆప్షన్ కూడా ఇందులో ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో బహిరంగ ప్రదేశాల్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యూజిక్ వినొచ్చు. ఆన్లైన్, రిటైల్ స్టోర్లలో ఇది అందుబాటులో ఉంది.
ధర: రూ. 29,900
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు రెడ్మీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఒకవైపు గ్లోబల్‌గా తన మార్కెట్‌ను విస్తరిస్తూనే.. దేశీయ మార్కెట్లోకి కొత్త ఫీచర్లతో రెడ్మీ 13 5Gని లాంచ్ చేసింది. స్టన్నింగ్ డిజైన్, బిగ్ బ్యాటరీ, సాలిడ్ పెర్ఫార్మెన్స్తో ఈ ఫోన్ మొబైల్ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నది. బడ్జెట్ సెగ్మెంట్‌కి బెస్ట్ ఆప్షన్ అవుతుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్, కెమెరా.. ఆల్‌రౌండర్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్! ఇక ప్రత్యేకతల విషయానికొస్తే.. 6.6 అంగుళాల 120Hz IPS LCD డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్.. ఇక ఫొటోగ్రఫీ ప్రియుల కోసం 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్.. సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 5,030mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ. రెడ్మీ 13 5G.. 6 జీబీ + 128 జీబీ వేరియంట్‌తోపాటు 8 జీబీ + 256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. మార్చి 20 నుంచి అమెజాన్, రెడ్మీ వెబ్సైట్లో అందుబాటులోకి రానుంది. లాంచ్ ఆఫర్ కింద ఎంపికచేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1,000 తగ్గింపు లభిస్తుంది.
ధర: రూ. 13,999 (ప్రారంభ ధర)
బీట్‌కి మాంచి ఊపు రావాలంటే.. సౌండ్ పవర్‌ఫుల్‌గా ఉండాలి. పార్టీలు, ట్రిప్‌లు, ఫంక్షన్లు.. ఎక్కడైనా మీ మూడ్‌ను పెంచాలంటే.. దమ్మున్న స్పీకర్ ఉండాల్సిందే. అచ్చం అలాంటి ఓ మ్యూజిక్ బ్లాస్టర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది ‘బోట్’. అదే.. పార్టీపాల్ 390 స్పీకర్. 160 వాట్ల సౌండ్‌తో ఏ పార్టీకైనా హైఎనర్జీని ఇచ్చేస్తుంది. సౌండ్ మాత్రమే కాదు.. ఇందులో లైటింగ్ కూడా అదుర్స్! కేవలం పాటలు వినిపించడమే కాదు.. చూడటానికి కూడా ట్రెండింగ్‌గా ఉండాలి.. అందుకే ఈ స్పీకర్లో ఎల్ఈడీ లైట్లు సంగీతానికి అనుగుణంగా మారుతూ అదిరిపోయే ఆంబియన్స్ను తీసుకొస్తాయి. ఇంట్లో పార్టీ, బైక్ టూర్ అయినా, క్యాంపింగ్ చేసినా.. దీన్ని సులభంగా తీసుకెళ్లొచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే 6 గంటల బ్యాకప్ వస్తుంది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో మ్యూజిక్ స్ట్రీమింగ్ మరింత ఫాస్ట్‌గా ఉంటుంది. అందులోనూ ఈక్వలైజర్ మోడ్స్ ఉన్నాయి. పాప్, రాక్, పార్టీ, జాజ్ లాంటి సెట్టింగులతో పాటలు మరింత క్లియర్‌గా వినిపిస్తాయి. కారోకే, కచేరీలకు బెస్ట్ చాయిస్! ఈ స్పీకర్లో రెండు మైక్రోఫోన్ ఇన్పుట్లు, గిటార్ ఇన్పుట్ కూడా ఉన్నాయి. అంటే.. మీరు ఇట్టే సింగర్ అయిపోవచ్చు కూడా. మైక్ పట్టుకుని పాటలు పాడుకోవచ్చు. కచేరీలూ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్, ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్లలో ఇది అందుబాటులో ఉంది.
ధర: రూ.16,990
పని, ఎంటర్టైన్మెంట్.. రెండిటినీ ఒకే డివైస్‌లో యాక్సెస్ చేయాలనుకుంటే? ఆసుస్ వివోబుక్ 14 ఫ్లిప్ సరైన ఎంపిక. 2-ఇన్-1 డిజైన్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌ను టాబ్లెట్లా కూడా ఉపయోగించుకోవచ్చు. 350 డిగ్రీల్లో ఎటైనా తిప్పుకొని పని చేసుకోవచ్చు. స్టయిలస్ సపోర్ట్‌తో నోట్స్ రాసుకోవచ్చు. విద్యార్థులు, ఉద్యోగులు, క్రియేటివ్ ప్రొఫెషనల్స్.. అందరూ ఉపయోగించుకునేలా దీన్ని డిజైన్ చేశారు. స్పష్టమైన కలర్స్, డీటైల్డ్ విజువల్స్ అందించే ఓఎల్ఈడీ డిస్ప్లే దీంట్లో ప్రత్యేకత. రోజంతా సరిపడే బ్యాటరీ లైఫ్‌తో నాన్‌స్టాప్‌గా పని చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్లు, వీడియో ఎడిటింగ్, డిజైనింగ్ లాంటి పనులకు కూడా అనువుగా ఉంటుంది. ఏఐ సపోర్ట్‌తో కొన్ని టాస్క్‌లను ఇట్టే ముగించేయొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. హైఎండ్ ల్యాప్‌టాప్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్!! ఆసుస్ అధికారిక సైట్లో అందుబాటులో ఉంది.
ధర: రూ. 97,000