ఇరవై ఐదేండ్ల క్రితం హైదరాబాద్ నల్లకుంటలో ఎస్టీడీ బూత్‌లో పనిచేస్తూ… కొరియర్ బాయ్‌గా పనిచేసిన ఒక యువకుడు ఇవ్వాళ అదే హైదరాబాద్‌లో ట్రెడిషినల్ అండ్ హెరిటేజ్ స్వీట్ షాప్‌ను ప్రారంభించి అనతికాలంలోనే దాన్ని ఐదు బ్రాంచీలకు విస్తరించాడు. మాడ్రన్ పోస్ట్ మాడ్రన్ కల్చర్‌ను తనలో కలగలుపుకొని దూసుకెళుతున్న హైదరాబాద్ మహానగరంలో ఆ యువకుడు తను పుట్టిన ఊరు పేరుతో ‘తీయ’ని రుచులు పంచుతున్నాడు.
అంతేకాదు పల్లె సంస్కృతిని, అందాన్ని కండ్లముందు కదలాడేలా తంగేడు,గునుగు పూల పేర్లతో రెస్టారెంట్, క్యాటరింగ్ సర్వీసెస్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నాడు. ఎమ్మెస్సీ బయోసైన్స్ చేసి చిన్నగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆ యువకుడే దొంతినేని బాలకృష్ణ.ఆయన విజయవంతంగా నడుపుతున్న స్వీట్స్ షాప్ పేరు పోత్గల్. సరూర్‌నగర్, రాయదుర్గం, కొత్తపేట, కర్మన్‌ఘాట్, కొంపల్లి ప్రాంతాల్లో పోత్గల్ పేరుతో నెలకొల్పిన మిఠాయి దుకాణాలు హైదరాబాద్‌కు నోరూరించటమే కాకుండా సమీప భవిష్యత్తులో ఢిల్లీ, పూణె నగరాల మీదుగా దుబాయ్వాసుల నోళ్లనూ తీపి చేయాలని ఆ యువకుడు కలలుగంటున్నడు.
పోత్గల్ స్వీట్స్ పేరు వెనుక ఊరున్నది. ఆ ఊరే పోతుగల్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గ్రామమది. ఆ పల్లెలో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దొంతినేని శ్యామల, మాధవరావు కుమారుడే బాలకృష్ణారావు. పేరులో ‘రావు’వద్దని.. కష్టంతో పేరు రావటమే తనకు ఇష్టమని అందుకే బాలకృష్ణ అని పిలిపించుకుంటాడు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక వ్యాపార యూనిట్‌ను ప్రారంభించి, దాన్ని విజయవంతంగా నడిపేందుకు డబ్బు, ఓపిక చాలా అవసరం.
అంతేకాదు అనుభవంతోపాటు తొందరగా క్లిక్ కావాలంటే ఆ వ్యాపారానికి పెట్టేపేరు కూడా అప్పుడప్పుడు కలిసివస్తుంది. వ్యాపారం ప్రారంభించే ముందు ఏ పేరు కలిసివస్తది? అని ఆరా తీయడం ఆనవాయితీ. ఈ క్రమంలో బాలకృష్ణ తన సొంత ఊరిపేరుతో పోత్గల్ స్వీట్స్‌ను ప్రారంభించాడు. తన ఊరిమీద ఉన్న ప్రేమను చాటుకున్నడు. 2021లో సరూర్‌నగర్‌లో పోత్గల్ ట్రెడిషనల్ అండ్ హెరిటేజ్ స్వీట్స్ మొదలుపెట్టాడు. ఇప్పుడా పేరు ఒక్క సరూర్‌నగర్‌కే పరిమితం కాకుండా కేవలం నాలుగేండ్లలోనే రాయదుర్గ్, కొత్తపేట, కర్మన్‌ఘాట్, కొంపల్లి ప్రాంతాలకు విస్తరించింది. త్వరలోనే తన బ్రాండ్‌ను దేశంలోని వివిధ నగరాలకు, విదేశాలకూ విస్తరించే యోచనలో ఉన్నాడు బాలకృష్ణ.
నిరుపేద కుటుంబం నుంచి..
సరిగ్గా 25 ఏండ్ల క్రితం రూ.500లతో హైదరాబాద్‌కు వచ్చిన బాలకృష్ణ ఇవ్వాళ రూ.15 కోట్ల టర్నోవర్ సాధించటం వెనుక ఎంతో కృషి ఉన్నది. సమీప భవిష్యత్తులో ఆ టర్నోవర్‌ను రూ.100 కోట్లకు తీసుకెళ్తాననే పట్టుదలా ఉన్నది. ‘మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. నాకు సునీత, అనిత అని ఇద్దరు అక్కాచెల్లెండ్లు. మా ఊరికి దగ్గరలో చాలా రైస్మిల్లులున్నయ్. ఓ రోజు మా నాన్న నాతో.. ‘రైస్ మిల్లులో నౌకరి మాట్లాడిన నెలకు రూ.1000 జీతం’ అన్నడు. ‘అట్లగాదు నేను చదువుకుంట’ అని చెప్పిన. పోతగల్ జిల్లా పరిషత్ హై స్కూల్ టెన్త్ అయిపోంగనే హైదరాబాద్ వచ్చిన. 2000 సంవత్సరంలో మా అమ్మ దగ్గర గొడవపడి రూ. 500లు తీస్కొని రాజధానికి వచ్చిన. ఇంటర్ గౌతమీ అకాడమీ జూనియర్ కాలేజీలో చేరిన. కష్టపడి చదువుకున్న. ఎన్ని కష్టాలు పడ్డా చదువు ఆపలేదు’ అని బాలకృష్ణ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు.
ఒకవైపు చదువుకుంటూనే మరోదిక్కు నల్లకుంటలోని ఒక ఎస్టీడీ బూత్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేసేవాడు. పిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడు. కొరియర్ సర్వీసెస్‌లో డిస్పాచ్ బాయ్‌గా కూడా పనిచేశాడు. తన చదువు ఇంట్లోవాళ్లకు భారం కాకూడదని కష్టపడేవాడు. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. చదువు మాత్రం ఆపలేదు. ‘నిజానికి డాక్టర్ కావాలని మొదటి బలంగా ఉండేది. ఎంట్రన్స్‌లో మెడిసిన్ సీటు వచ్చే ర్యాంకు రాలేదు. అప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ వచ్చింది. పూర్తయ్యాక ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, స్పెషల్ బీఎడ్ చేసిన. వాటితోపాటు రెండు ఆర్టీజియన్ కోర్సులను కూడా పూర్తిచేసిన’ అని బాలకృష్ణ వివరించాడు.
‘చదువుకుంటూనే పనిచేసుకోవటం అలవాటైన నేను పీజీ పూర్తికాగానే కొంతకాలం మెడికల్ యూనివర్సిటీలో వర్క్ చేసిన. ఢిల్లీ, డెహ్రడూన్ ప్రాంతాల్లో ఉన్నా! ఇట్లా పనిచేసుకుంటూ తిరుగుడు కాదు ‘నలుగురికీ పని కల్పించే పనిచేయాలి’ అని నిర్ణయించుకున్న’ అంటాడు బాలకృష్ణ. మొదటి నుంచి స్వశక్తితో ఎదగటం, కష్టపడటాన్ని ఇష్టంగా భావించే బాలకృష్ణ తాను ఎదుగుతూ, పదిమందికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. ఫుడ్ ఇండస్ట్రీ అయితే బాగుంటుందని ఫ్రెండ్స్, పెద్దలతో చర్చించి వ్యాపారిగా తన ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు.
Sweets
‘హైదరాబాద్‌లో అప్పటికే అనేక స్వీట్స్ బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయి. పుల్లారెడ్డి స్వీట్స్, ఆల్మండ్ హౌస్ ఇలా అనేక స్టోర్స్ ఉన్నాయి. వ్యక్తిగతంగా పుల్లారెడ్డి ఎదిగిన తీరు, రాజకీయాల్లో కేటీఆర్ ఎదిగి తనను తాను ప్రూవ్ చేసుకున్న తీరు నాకు స్ఫూర్తిని నింపాయి. ‘తెలివైనోడు వ్యాపారం చేస్తడు. లేనోడు ఉద్యోగం చేస్తడు’ అని చిన్నప్పుడు విన్న మాట పదేపదే గుర్తుకొచ్చేది. అట్లా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.
ఏది పెట్టినా అప్పర్‌హ్యాండ్ ఉండాల్ననే తపన. అందుకు తగిన హార్డ్‌వర్క్ చేయటం అనేది అలవాటుగా మలచుకున్న. ఒకనాడు ఎస్టీడీ బూత్‌లో వర్క్ చేసిన నేను ఇవ్వాళ 600 మందికి ఉపాధి కల్పిస్తున్న. ఆ సంఖ్యను వెయ్యికి చేర్చాలన్నదే లక్ష్యం. పోతుగల్ అనేది మా ఊరిపేరు. మా ఊరికి బ్రాండ్ ఇమేజ్ తేవాలని అనుకున్న. అందుకే ఆ పేరుమీద స్వీట్స్ షాప్ పెట్టిన. కేవలం స్వీట్ షాప్స్ మాత్రమే కాకుండా తంగేడు పేరుతో రెస్టారెంట్, గునుగు పేరుతో క్యాటరింగ్ సర్వీసెస్‌ను ప్రారంభించిన. ఇప్పుడు హైదరాబాద్‌లో మోస్ట్‌పాపులర్ ఇమేజ్‌తోపాటు, మోస్ట్ అడ్వైజబుల్ ప్రొడక్ట్స్‌కు సప్లయి చేస్తున్నరు’ అనే పేరు తెచ్చుకున్న’ అని బాలకృష్ణ తన ప్రయాణాన్నివివరించాడు.
…? యెన్నెస్వీ