అందరి రక్షణ వాళ్ల ధ్యేయం.ఆందోళనలు శ్రుతిమించకుండా కాపుకాసేది వాళ్లే! బందోబస్తులో ముందుండేదీ వాళ్లే!ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణనిస్తున్న బెటాలియన్ పోలీసులు.. తమ ఇంటికి, ఇల్లాలికి అండగా ఉండలేకపోతున్నారు. కన్నవారి అవసరాలు తీర్చలేకున్నారు. పిల్లలతో ఆనందాల్ని పంచుకోలేక పోతున్నారు. అందుకే, బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్ల ఇల్లాళ్లు కదం తొక్కారు. ‘ఏక్ పోలీస్..’ మా విధానమంటూ డప్పుకొట్టి.. గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్.. తమ గోడు వినాలంటూ నినదించారు. వారిది ఆవేశం కాదు.. ఆవేదన. రిక్వెస్ట్ కాదు.. డిమాండ్. ఆ తడారిన గొంతుకల్లో వినిపించని విషాద గాథలు ఎన్నో..
మొన్న ఆడపడుచుల ఆర్తనాదాలతో సచివాలయం పరిసరాలు.. నిన్న ప్రధాన రహదారులు దద్దరిల్లాయి. ‘వియ్ వాంట్.. జస్టిస్!’.. ‘పోలీసు కుటుంబం నుంచి వచ్చిన రేవంతన్నా.. టీజీఎస్పీ ఖాకీని నౌకర్‌గా మార్చొద్దన్నా’, ‘కావాలి కావాలి.. ఏక్ పోలీస్ కావాలి’ అనే నినాదాలతో మహిళలు గర్జిస్తున్నారు.
అందరు పోలీసుల్లాగే వాళ్లూ ఒకే పరీక్ష రాశారు. ఫిజికల్ టెస్టులు పాసయ్యారు. తొమ్మిది నెలలు కఠిన శిక్షణ తీసుకున్నారు. బెటాలియన్ పోలీసులుగా విధుల్లో చేరాక.. విధిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రజారక్షణలో ఆల్వేస్ ముందుండే వీళ్లతో ప్రభుత్వం గొడ్డుచాకిరీ చేయిస్తున్నది. రోజుల తరబడి విధుల పేరుతో నరకం చూపిస్తున్నది. 26 రోజుల డ్యూటీ అంటూ కుటుంబానికి కాకుండా చేస్తున్నది. ఒకేచోట ఉద్యోగం చేసే వెసులుబాటు లేకపోవడంతో బెటాలియన్ పోలీసుల బతుకు.. సంచార జీవితమైంది. నెల తిరిగాక ఇంటికొచ్చిన తండ్రి.. రెండ్రోజులకు మళ్లీ డ్యూటీకి వెళ్తుంటే.. ఇంటిల్లిపాదీ ‘మళ్లీ ఎప్పుడొస్తావ్?’ అని దీనంగా చూపులతోనే ప్రశ్నిస్తున్నారు. వాళ్ల మౌనప్రశ్నకు సమాధానం ఇవ్వలేక, మనసులో పెల్లుబికిన ఆవేదనను పంటికింద అదుముకొని వెనక్కి తిరక్కుండా బయటికి దారితీస్తున్నాడు ఆ పోలీసన్న. ఆ ఆవేదన ఇప్పుడు కట్టలు తెంచుకుంది. ‘ఇదేం విధానం’ అని ప్రశ్నించిన బెటాలియన్ పోలీసులపై కక్ష కట్టింది ప్రభుత్వం. అందుకే, పోలీసుల ఇల్లాళ్లు, తల్లులు, పిల్లలు రోడ్డెక్కారు.
‘సార్.. మా బాబుకు 15 నెలలు. వాడికి కుక్క తెలుసు, ఇంట్లో పిల్లి తెలుసు. కానీ, నెలరోజులకు ఒకసారి వచ్చే తండ్రిని పోల్చుకోలేడు! నా గుండెకోత ఎవరికి చెప్పుకోవాలి. ఈ దుస్థితి ఎందుకొచ్చింది? తీసుకొచ్చిన వారెవరు?’ ఓ తల్లి కన్నీటి వేదన. ‘బెటాలియన్ పోలీసులను ఇంటికి పంపకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్లకు ఎలాంటి డ్యూటీ టైమింగ్ లేదు. నాన్‌స్టాప్‌గా పనులు చెబుతున్నారు. వారితో వెట్టి చేయిస్తున్నారు. భార్యాపిల్లలకు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదా సార్?’ అంటూ ఓ బెటాలియన్ పోలీసు ఇల్లాలు సూటిగా సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు?
మమ్మల్ని ఆదుకునేది ఎవరు?
‘నేను రెండు నెలల గర్భిణిని. నాకు 18 నెలల వయసున్న కొడుకున్నాడు. మా ఆయన నన్ను కనీసం ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. నేను ఇంట్లో పనులు చేసుకోవాలి. వీడ్ని చూసుకోవాలి. దవాఖానకు వెళ్లాలి. ఇంట్లో వృద్ధులైన అత్తమామలు ఉన్నారు. మా తల్లిదండ్రులు ఎంతకాలమని మాతో ఉంటారు? నన్ను ఆస్పత్రికి ఎవరు తీసుకెళ్లాలి? చెప్పండి సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం.. ఇంట్లో సరుకులు తెచ్చేవాళ్లు ఉండరు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే పట్టించుకునే దిక్కు ఉండదు. మా బాధలు పట్టించుకునేటోళ్లు లేరు. ఈ బతుకులు బతకడం కన్నా చావడం బెటర్’ అంటూ మరో ఆడబిడ్డ ఆవేదన. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో కష్టం. ఎవరి దీనగాథ వారిది.
పిల్లనిస్తలేరు…
‘పిలగాడు ఏం కొలువు చేస్తుండమ్మా..’
‘పోలీసు నౌకరీ’.
‘అయితే మంచిదే’‘ఎక్కడ ఏం డ్యూటీ చేస్తడమ్మా..’
‘టీజీఎస్పీ కానిస్టేబులు’..
‘అవునా.. అయితే మీ సంబంధం వద్దులేమ్మా.. నెలలో రెండ్రోజులు మాత్రమే ఇంట్లో ఉండే పిలగాడికి ఇక మా పిల్లనేం ఇస్తాంలే..’ అని ఆడపిల్ల తల్లిదండ్రులు ముఖం మీద చెబుతున్నారని ఓ కానిస్టేబుల్ తల్లి ఆక్రోశం వెళ్లగక్కింది. ‘డ్యూటీల పేరుతో రోజుల తరబడి స్టేషన్లు, అడవులు పట్టుకొని తిరిగితే.. సంసారం ఎప్పుడు చెయ్యాలె? కుటుంబాన్ని ఎప్పుడు చూసుకోవాలె?’ అని టీజీఎస్పీ కానిస్టేబుళ్ల భార్యలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ‘ఇట్లాంటి బాధలు ఉంటయనే మా బిడ్డలకు కనీసం పిల్లను ఎవరు ఇస్తలేరు’ అని ఓ తల్లి ఆవేదన.
కలిసి ఉండే హక్కు లేదా?
‘మా కష్టాలను పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం వినాలని ధర్నాలు చేస్తుంటే.. మా వారిని సస్పెండ్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? మా ఆయనతో కలిసి ఉండే హక్కు నాకు లేదా? మాకు ఆ స్వాతంత్య్రం లేదా? ఇదేం ప్రభుత్వం రేవంత్రెడ్డిసార్? మూడు నెలలు ఒకచోట.. మరో మూడు నెలలు మరోచోట డ్యూటీలు చేస్తే.. మా పిల్లలను ఎక్కడ చదివించుకోవాలి సార్?’ మరో ఆడపడుచు ఆందోళన ఇది.
ఈ బాధలన్నీ భరించలేకనే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నామని చెబుతున్నారు కానిస్టేబుళ్ల భార్యలు. ‘మాకు ఒక పండుగ లేదు. ఫంక్షన్ లేదు.. పుట్టినరోజు లేదు.. సచ్చినరోజు లేదు. ఏ శుభకార్యమైనా డ్యూటీలో ఉన్నా కుదరదని చెబుతున్నారు. కుటుంబాలతో కలుసుడు లేదు.. ఇంటికి ఎప్పుడొచ్చేది సమాచారమే లేదు’ అని బోరున విలపిస్తున్నారు మరికొందరు. కొంతమంది తల్లులైతే.. ‘ఆఫీసర్ల దగ్గర మా పిల్లలు గొడ్డు చాకిరి చెయ్యాల్నా? నా పిలగాడిని ప్రభుత్వ ఉద్యోగానికి రాయించింది మీ దగ్గర బానిస బతుకు బతికేందుకు కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నమ్మి ఓట్లేసినందుకు ఇదేనా..
‘రేవంత్‌రెడ్డి సార్.. మీరు ఎన్నికలప్పుడు ‘ఏక్ పోలీస్’ చేస్తామంటేనే నమ్మి మేమంతా మీకు ఓట్లు వేశాం. ఇప్పుడు ఆ ఏక్ పోలీసు వ్యవస్థ తీసుకురాకపోగా.. నాన్‌స్టాప్ డ్యూటీలు 26 రోజులకు పెంచారు. ఇదెక్కడి అన్యాయం ముఖ్యమంత్రి గారు? మిమ్మల్ని నమ్ముకున్నందుకు మా పోలీసు జీవితాలను ఇలా రోడ్ల మీదకు ఎందుకు తీసుకొచ్చారు. ఎంతో సఫర్ అవుతున్నాం. ఇన్నిరోజులు సైలెంట్‌గా ఉన్న మేము.. ఇప్పుడు ఆందోళనకు దిగామంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోండి’ అని ప్రభుత్వాన్నీ, నాడు నమ్మించిన కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు.‘ఏక్ పోలీస్‌పై నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని కుటుంబాలను సస్పెండ్ చేస్తారు సార్.. మీరు? సస్పెండ్లు జరిగితే మాకు ఆత్మహత్యలే శరణ్యం. అప్పుడు రాష్ట్రం ఎలా అల్లకల్లోలమైతదో మీరే చూస్తారు’ అంటూ కొంగుతో కళ్లు ఒత్తుకుంటున్న ఇల్లాలి మాటలు సర్కారు చెవిన పడాలని కోరుకుందాం.
ఒక్కో బెటాలియన్ పరిధిలోని
ఒక్కొక్కరికి మూడు నెలల పాటు డ్యూటీలు వేసి, మరో మూడు నెలలు వేరే ప్రాంతానికి తిప్పుతున్నారు.. ఇలా ఏడాదిలో మూడు జిల్లాలు తిరగాల్సి వస్తున్నది. మేము ఎక్కడ ఉండాలి? మా బిడ్డలు ఎక్కడ చదువుకోవాలి? ఈ తిరుగుడేంది? పోలీసు ఉద్యోగం చేస్తున్న మా వాళ్లను తోటి పోలీసులే జీతగాళ్లలా చూస్తున్నారు. పొద్దున్నే పలుగు, పారలతో గడ్డి పీకిస్తున్నారు.
-ఓ పోలీసు భార్య
…? రవికుమార్ తోటపల్లి
వీరగోని రజనీకాంత్ గౌడ్