తమ పిల్లలు అన్నిట్లోనూ ముందుండాలని ఈతరం తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. అందుకోసం అన్ని విషయాల్లోనూ పక్కాగా ఉంటున్నారు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం తొందరపడుతున్నారు. ఇలా పిల్లల పెంపకంలో తొందరపాటు వల్ల.. వారి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదువులు, పాఠశాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. విశ్రాంతి, ఆటలు, నిద్రకూ అంతే ప్రాముఖ్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.
ఈ కాలపు పిల్లలకు అత్యంత ఇష్టమైన సమయం.. స్క్రీన్ చూడటమే! ఇందులో వారి చదువుతోపాటు లోక జ్ఞానానికి ఉపయోగపడే ఎన్నో అంశాలు ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి పిల్లలకు కాస్తంత స్క్రీన్‌టైమ్‌ను కేటాయిస్తే తప్పేం లేదని నిపుణుల మాట. అయితే, వారు ఏం చూస్తున్నారు? ఎంతసేపు చూస్తున్నారు? అనేదానిపై ఓ కన్నేసి ఉంచాలని అంటున్నారు. అయితే, ఏడేళ్లలోపు వారికి స్క్రీన్టైమ్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
చాలామంది పిల్లలు బారెడు పొద్దెక్కినా.. బెడ్డుమీదే ఉంటారు. ‘స్కూల్ టైం’ అంటూ.. తల్లిదండ్రులు ఆదరాబాదరాగా లేపుతుంటారు. ఇలా పిల్లలకు నిద్రాభంగం కలిగించడం.. వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఉదయాన్నే నిద్ర మేల్కొనడానికి ఇబ్బంది పడుతుంటే.. వారు శారీరకంగా అలసటగా ఉన్నారని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అది జీవశాస్త్ర నియమం. పిల్లల పెరుగుదల, అభివృద్ధికి ‘నిద్ర’ చాలా అవసరం. శారీరకంగానే కాదు.. మానసిక పెరుగుదల కూడా నిద్రలో ఉన్నప్పుడే ఎక్కువగా ఉంటుంది. పాఠశాలలో నేర్చుకున్న విషయాలు కూడా.. మంచినిద్ర తర్వాతే వారి మెదడులో బాగా ప్రాసెస్ అవుతాయి. అందుకే.. ఉదయాన్నే బలవంతంగా నిద్ర లేపడానికి బదులుగా.. రాత్రిపూట 8 గంటలలోపే వారిని నిద్రపుచ్చండి.
ఇక నేటితరం తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అది మంచి అలవాటే! కానీ, ప్రతి విషయంలోనూ వారిదే ‘చాయిస్’గా ఉండకూడదు. బట్టలు, భోజనం గురించి కూడా వారినే ఎంపిక చేసుకోవాలని చెప్పడం మంచిది కాదు. వారు యుక్తవయసుకు వచ్చేవరకూ.. వారు సరైన నిర్ణయాలు తీసుకోలేరని నిపుణులు చెబుతున్నారు. నాలుగేళ్ల పిల్లాడిని బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం కావాలని అడుగుతుంటారు. ఇలా తరచుగా అడుగుతుంటే.. వారిలో ఆందోళన, పరధ్యానానికి కారణమవుతుంది. వారిని గందరగోళంలో పడనీయకుండా.. నిర్ణయాలు మీరే తీసుకోండి.
‘ప్రీ స్కూల్’లోనే పిల్లలు పెన్సిల్ చేతబట్టి రాయాలని పేరెంట్స్ ఆశిస్తుంటారు. స్కూల్లో చేరేనాటికే.. వారి చేతిరాత బాగుండాలని తహతహలాడుతుంటారు. కొందరైతే.. ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పిస్తుంటారు. అయితే, ఆరేళ్లు దాటితేనే.. పిల్లల మణికట్టు రాయడానికి సిద్ధంగా తయారవుతుంది. కాబట్టి, అప్పటిదాకా చదువులపై తొందరపెట్టే బదులుగా.. ఆటలు, విశ్రాంతిపై దృష్టిపెట్టాలి. వారి కదలికలు చురుగ్గా ఉండేలా చూసుకోవాలి.