బిడ్డకు జన్మనివ్వడంతో తన జన్మ తరించిందని భావిస్తుంది అమ్మ. ఆ బిడ్డకు గోరంత కష్టం వచ్చినా కొండంత బాధపడిపోతుంది. చిన్నగా నసిగినా పెద్దగా ఆందోళన చెందుతుంది. అదే బిడ్డకు ప్రాణాల మీదికి వచ్చిందంటే.. అమ్మ దుఃఖం కట్టలు తెచ్చుకుంటుంది. దేవుళ్లను నిలదీస్తుంది. అవసరమైతే.. అపర సంజీవనిగా మారి ఆయువు పోస్తుంది. అలాంటి తల్లులే వీళ్లు. కిడ్నీలు విఫలమై మంచానికి పరిమితమైన తమ బిడ్డలకు తమ కిడ్నీ ప్రసాదించి పునర్జన్మనిచ్చారు. కొడిగడుతున్న వారి బతుకులకు ఊపిరులూదారు. అమ్మదనానికి అసలైన చిరునామాగా నిలిచిన షకీలా ఖాన్, రాజ్యలక్ష్మి, కల్యాణి ద్విభాష్యం, నిర్మలను జిందగీ పలకరించింది. ఆ విశేషాలే ఇవి..
– రాజు పిల్లనగోయిన
నా కూతురు వసంతకు మూడేండ్ల కిందట సుస్తీ చేసింది. రోజుల వ్యవధిలోనే బాగా నీరసించి పోయింది. దవాఖానకు తీసుకెళ్లాం. వైద్యులు పరీక్షలు చేసి.. అమ్మాయి కిడ్నీలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఆ మాట వినగానే కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనైంది. పగవాడికి కూడా రావొద్దనుకునే కష్టం నా బిడ్డకు వచ్చిందని తల్లడిల్లిపోయాను. తనను కాపాడాలని మొక్కని దేవుళ్లు లేరు. ఆ దేవుడి మీదే భారం వేసి ఎనిమిది నెలలపాటు డయాలసిస్ చేయించాం. మా అల్లుడే దగ్గరుండి ఆమెను చూసుకున్నాడు. నా కూతురు అవస్థ చూసి నేను కుమిలిపోయేదాన్ని. కిడ్నీ మార్పిడి ఒక్కటే పరిష్కారం అని వైద్యులు చెప్పారు. దగ్గరి రక్త సంబంధీకులు కిడ్నీ దానం చేస్తే మంచిదని సూచించారు. ఆ మాట వినగానే నా కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఇంట్లోవాళ్లు కూడా నా నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. శస్త్రచికిత్స చేసి నా కిడ్నీ కూతురుకు అమర్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడింది. నేను కూడా బాగానే ఉన్నా. కన్నబిడ్డ ఆరోగ్యం కన్నా.. ఏ తల్లి మాత్రం ఏం కోరుకుంటుంది.
– రాజ్యలక్ష్మి
మాది హైదరాబాద్. నా కూతురు పేరు లక్ష్మీభావజ. ఆ రోజు నా బిడ్డ పుట్టినరోజు. వేడుకగా జరుపుకొంటున్నాం. అప్పటికి కొన్నాళ్ల ముందే నా కూతురు పెండ్లి నిశ్చయమైంది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. ఇంట్లో అంతా సందడే! అలాంటి ఆనందకర సమయంలో ఉన్నట్టుండి నా కూతురు అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయాలన్నారు వైద్యులు. నాకేం పాలుపోలేదు. ఏవో కొన్ని పరీక్షలు చేశారు. కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పగానే నా ప్రాణం పోయినంత పనైంది. ‘కిడ్నీ మార్పిడి చేస్తే మీ అమ్మాయికి ఏ ఆపదా లేద’ని డాక్టర్లు చెప్పడంతో కాస్త ఊరట చెందాను. మా ఆయన కిడ్నీ ఇవ్వడానికి ముందుకువచ్చారు. అయితే అది మ్యాచ్ కాదని వైద్యులు చెప్పడంతో నా కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డాను. పరీక్షల తర్వాత శస్త్రచికిత్స చేశారు. అమ్మాయి ఆస్పత్రిలో చేరిందని తెలియగానే మా కాబోయే వియ్యాలవారు కూడా మాకు అండగా నిలిచారు. మాకు భరోసా ఇచ్చారు. రెండేండ్లపాటు ఆగారు. కిడ్నీ మార్పిడి తర్వాత ఆరు నెలల్లో పూర్తిగా కోలుకున్నాం. నేను తిరుమల వెళ్లి అలిపిరి నుంచి కాలినడకన స్వామిని దర్శించుకున్నా. అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా చేశాను. ఇప్పుడు ఇద్దరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. మా అమ్మాయి, అల్లుడు జర్మనీలో హాయిగా ఉంటున్నారు. నా బిడ్డ సంతోషం కోసం తల్లిగా ఆ మాత్రం చేయలేనా!
– కల్యాణి ద్విభాష్యం
ఆ క్షణంలో అమ్మ లేకుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. మాది గుంటూరు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా. పీజీలో ఉంటున్నా. హాస్టల్ ఫుడ్ పడకపోవడం, బయట ఫాస్ట్‌ఫుడ్, లైఫ్‌స్టయిల్ వీటన్నిటి కారణంగా నాకు తెలియకుండానే ఆరోగ్యం క్షీణించింది. అప్పుడప్పుడు వాంతులు, విరేచనాలు అయ్యేవి. కరోనా లాక్డౌన్ టైమ్‌లో వైద్యులను సంప్రదించాను. పరీక్షలు చేసి కిడ్నీలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఆ మాట వినగానే చాలా కుంగిపోయాను. ఇక నేను బతకను అనుకున్నాను. నైరాశ్యంలో కూరుకుపోయిన నాకు అమ్మ షకీలా ఖాన్ అండగా నిలిచింది. ‘నేను ఉన్నంతవరకు నీకేం కానివ్వను’ అని భరోసా ఇచ్చింది. తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. నెల రోజులపాటు అమ్మకు రకరకాల పరీక్షలు చేశారు. శస్త్రచికిత్స చేసి అమ్మ కిడ్నీ నాకు అమర్చారు. జన్మ ఇచ్చినందుకే తల్లికి జీవితకాలం రుణపడాలి. అలాంటిది తన ప్రాణాలను పణంగా పెట్టి నాకు మరో జన్మ ప్రసాదించిన మా అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. ఇప్పుడు నేను తీసుకుంటున్న ప్రతిశ్వాస అమ్మ మళ్లీ ప్రసాదించిందే! ఈ బతుకంతా అమ్మకే అని ఫిక్సయ్యాను.
– ఫర్హా
నా చిన్నకొడుకు సాయి యశేశ్కు పదేండ్లు ఉన్నప్పుడే కిడ్నీలు దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారు. ఆ విషయం తెలియగానే కుటుంబమంతా విషాదంలో మునిగిపోయాం. ఇంత చిన్నవయసులో డయాలసిస్ చేస్తే ఇబ్బందని చెప్పడంతో వెంటనే నా కిడ్నీని తనకు ఇచ్చాను. అప్పటినుంచి వాడి ఆరోగ్యం కుదుటపడింది. వాడి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. కరోనా ప్రభావం మూలాన నా కొడుకు ఆరోగ్యం క్షీణించింది. అది మళ్లీ వాడి కిడ్నీలపై ప్రభావం చూపింది. ఈసారి ఇంట్లోవాళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూడా నా కొడుకు వద్దని డయాలసిస్ చేయించుకుంటున్నాడు. నేను జన్మనిచ్చిన నా బిడ్డను కాపాడుకోవడం నా కర్తవ్యం.
– నిర్మల