Heavy Anklets | మువ్వల పాదం ఎంత ముద్దుగా ఉంటుందో తెలుగు భాషను అడిగితే తెలుస్తుంది. పాటలూ పద్యాల్లో ఆ అందాన్ని ఆకాశానికెత్తడం అందరమూ చూస్తుంటాం. పొగడ్త వింటే మొహం చాటంత అయ్యేది మనుషులకే కాదు, ఇదిగో ఈ పట్టీలకు కూడా. అందుకే, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి పాదం నిండా పరుచుకున్నాయి. పెండ్లికూతుళ్ల కోసం తయారు చేస్తున్న ఈ నిండైన పట్టీలు నిజంగానే ఎంత బావున్నాయో కదూ!
ఖైదీల కోసం చేసే అరదండాలు ఎంత మందిని కట్టిపడేశాయన్నది లెక్క చెప్పొచ్చేమో కానీ, పడుచు పాదాలను చుట్టే పట్ట్ట గొలుసులు ఎందరి హృదయాలను బందీ చేసుంటాయో తేల్చి చెప్పడం కష్టమే. కాంచన కాళ్లను కట్టిపడేసినట్టు కనిపించే ఈ ‘నగ’రాజులు ఎన్ని మనసుల్ని కనికట్టు చేశాయంటే… ఎంచడమూ కష్టమే. అందుకే, ఆడపిల్లలు అమితంగా ఇష్టపడే మువ్వల్ని సాధ్యమైనంత ముద్దుగా రూపొందిస్తుంటారు తయారీదారులు. కంఠా భరణాల్లాగే బోలెడు డిజైన్లలో వీటినీ తయారుచేస్తారు. లక్ష్మీ స్వరూపంగా భావించే బంగారాన్ని కాళ్లకు పెట్టుకునే సంప్రదాయం చాలా కుటుంబాల్లో ఉండదు. కాబట్టే, ఎక్కువగా వెండితోనే ఇవి రూపొందుతాయి.
ఇంతకు మునుపు పట్టీ.. చీలమండలాన్ని చుట్టి ఉండేది. కానీ ఇప్పుడు, పాదాన్నంతటినీ అలంకరించేలా ‘హెవీ యాంక్లెట్స్’ లేదా ‘ఫుల్ యాంక్లెట్స్’ రూపొందుతున్నాయి. థోంగ్ యాంక్లెట్స్ అని కూడా వీటిని పిలుస్తున్నారు. కాలికి సాధారణంగా పెట్టుకునే పట్టీతో పాటు వేళ్ల దగ్గర మెట్టెల తరహా రింగులు ఉంటాయి. ఈ పట్టీనీ, వేళ్ల రింగులనూ కలుపుతూ గొలుసులు వస్తాయి. అచ్చమైన వెండితో చేసినవే కాదు.. బంగారు పోత పోసినవీ, ఫ్యాన్సీ పట్టీలు, పూసలవీ తయారవుతున్నాయి. ఒక్క పట్టీ పెట్టుకుంటే సరి పోతుంది. ఎంతో అలంకారం చేసుకున్నట్టు కనిపిస్తుంది. అందులోనూ అందమైన మెహందీకి జోడించామంటే, పెళ్లికూతురు పాదాల మీదే కెమెరాలన్నీ క్లిక్కుమంటాయి. వరుడు తలవంచుకుని కూర్చుంటాడు. సిగ్గు కాదు.. పాద సౌందర్య ఆరాధన.