ఒకప్పుడు మట్టికుండను సామాన్యుడి ఫ్రిజ్ అనేవాళ్లు! కానీ, ఇప్పుడు సామాన్యుడి కంటే సంపన్నులే మట్టి పాత్రల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మట్టికుండకు మళ్లీ ఆదరణ పెరగడం బాగానే ఉంది. కానీ, వాడే వాళ్లు ఆశించే ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మట్టికుండను కొన్న తర్వాత బాగా కడిగి, ఎండలో తడి ఆరిపోయేంత వరకు ఉంచాలని సూచిస్తున్నారు. కుండలో మంచినీళ్లు పోసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోపు మాత్రమే వాటిని ఉపయోగించాలి. ఎందుకంటే, సాధారణ ఉష్ణోగ్రత వద్ద బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది.
కాబట్టి కుండలో పోసిన నీళ్లు 24 గంటల కంటే ఎక్కువగా నిల్వ ఉంటే తాగకూడదు. తప్పకుండా ఆ నీటిని పారబోసి కుండను శుభ్రంగా కడగాలి. నిల్వనీటిలో పెరిగే బ్యాక్టీరియా, ఆల్గే (నాచు వంటి సూక్ష్మజీవులు) కుండకు కూడా అంటుకుని ఉంటాయి. అవి పోయేందుకు గండ్ర ఉప్పుతో రుద్దాలి. కడిగేందుకు సాఫ్ట్‌గా ఉండే పీచు, గోరువెచ్చని నీటిని వాడాలి. ఇలా చేయడం వల్ల నీటిలో ఉండే రసాయనాలను మట్టికుండ గ్రహిస్తుంది. నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. అలాగే వారానికి ఒకసారి నిమ్మరసంతో ఉప్పు లేదా బేకింగ్ సోడా కలిపి కడిగితే కుండలో ఉండే బ్యాక్టీరియా, ఆల్గేని పూర్తిగా తొలగించవచ్చు.