రుచిగా వండటమే కాదు, అందంగా వడ్డించడమూ ఓ కళే. అయితే దీని కోసం కలినరీ డిగ్రీలు, స్టార్ హోటల్లో ఇంటర్న్‌షిప్‌లూ ఏమీ చేయనక్కర్లేదు. కాస్త మనసుంటే చాలు ఎవరైనా మాస్టర్షెఫ్లలా మారిపోవచ్చు, తినే వాళ్లను మాయాజాలంలో ముంచేయొచ్చు అంటున్నారు నేటి తరం ఆహార ప్రేమికులు. ప్లేట్‌నే కాన్వాస్‌గా మార్చి, ఆహారాన్నే రంగులుగా అద్ది అందమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు. మనమూ అలా చేసేందుకు బోలెడు ఐడియాల్ని పంచేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా అన్నింటా మన టాలెంట్‌ను చూపించేందుకు అవకాశాలకు లెక్కేలేదు అనిపిస్తుంది వీటిని చూస్తుంటే! ‘ఫుడ్ ప్లేట్ డెకరేషన్’… రుచికి అభిరుచిని కూడా జోడించే ఓ కొత్త మార్గం.
ఆకేసి.. పప్పేసి… బువ్వేసి… నెయ్యేసి… నోట్లో ముద్ద పెట్టుకోగానే వారెవ్వా అనడం వేరు… విస్తరి చూడగానే అదుర్స్ అనడం వేరు. తినే ముందు రుచి అడగడం కాదు, తినకముందే పొగడ్తల్ని అడిగే ఫాస్ట్ జనరేషన్ ఇది. అలాంటప్పుడు ప్రతి పనిలోనూ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉండాలిగా మరి! ఆ ప్రయత్నమే ఇది. అన్నం, కూర, పప్పు, పులుసు… ఏం చేశామని మాత్రమే కాదు, వాటిని ఎంత బాగా డెకరేట్ చేశామన్నదాని మీద కూడా శ్రద్ధ పెడుతున్నారిప్పుడు. దాని ఫలితమే మనకు ఈ చిత్రాల్లో కనిపిస్తున్న అందమైన ప్లేట్లు. ఉప్మా, దోశ, చపాతీలలాంటి మనం చేసుకునే రకరకాల టిఫిన్లతో పాటు అన్నం కూరలు, స్నాక్స్, పండ్లను కూడా ముచ్చటగా ముస్తాబు చేయడం ఈ ఫుడ్ ప్లేట్ డెకరేషన్‌లోని ప్రత్యేకత. విభిన్న ఆకృతుల్లో వంటకాలను పేర్చి, వాటి రంగులతో మాయాజాలం చేయడమే ఇందులోని స్పెషల్.

ఎంతో సులభం
సాధారణంగా భోజనాన్ని అలంకరించడం అనేది పెద్ద సబ్జెక్టు. పేరెన్నికగన్న హోటళ్లలో ప్రత్యేకమైన పరికరాలు, పదార్థాలను ఉపయోగించి, వెజిటబుల్ లేదా ఫ్రూట్ కార్వింగ్లాంటి టెక్నిక్లను వాడి మనకోసం తెచ్చే ప్లేట్‌ను అలంకరిస్తారు. అదో ఖరీదైన చదువు కూడా. దానికి భిన్నంగా మన ఇంట్లో చేసిన వంటల్ని కాస్త సృజనాత్మకత ఉపయోగించి మనమే అందంగా తీర్చిదిద్దే ట్రెండ్ వచ్చిందిప్పుడు. అన్నం కూరల్ని వాడి ఇలా చేయాలంటే ‘రైస్ ప్లేటింగ్ డెకరేషన్’ అంటారు. ఇందులో అన్నం ప్రధాన పదార్థం. దీన్ని ముఖాకృతిలోనో, కోడి, బాతు, చేపలానో అమరుస్తాం.
దాని మీద క్యారెట్, టమాటా, నిమ్మ బద్దలు, ఉల్లిగడ్డలాంటి వాటితో కళ్లు, ముక్కు, తోక, చెవులలాంటి డెకరేషన్ చేస్తాం. మిగతా కూరలు, పప్పులాంటి వాటిని చుట్టూ ఉండే ప్రదేశాలను పోలిన అలంకరణకు వాడుకోవచ్చు. నూడుల్స్‌ని కూడా ఈ తరహాలో అలంకరించుకోవచ్చు. కళ్లు, నోరులాంటివి నలుపు రంగులో గీతల్లా కావాలనుకుంటే నోరి అని పిలిచే ఒక రకం సముద్ర నాచును వాడుకోవచ్చు. జపనీస్ వంటల్లో వాడే ఈ పల్చటి రేకులాంటి పదార్థం మన దగ్గరా దొరుకుతుంది. కాస్త ఆలోచన ఉంటే చాలు అన్నమైనా, నూడుల్స్ అయినా సరే పెద్దా చిన్నా బౌల్స్, చాకు, పీలర్లాంటి వాటిని ఉపయోగించి మనం అలంకరించేయొచ్చు.

అన్ని రకాలూ…
ఫుడ్ ప్లేటింగ్‌లో అందంతో పాటు అభిరుచికీ చోటిస్తున్నారు సృజనకారులు. అందుకే వడ్డించిన విస్తరి ఎలా కనిపించాలి అన్నదాంట్లో తమదైన ముద్ర వేస్తున్నారు. కొన్నింట్లో మనుషుల ముఖాకృతులు కనిపిస్తే, కొన్నింట్లో జంతువుల ముఖాలు, బొమ్మలు, కార్టూన్లు… మరికొన్నింట్లో రైళ్లు, బస్సుల్లాంటి సాధనాలు, ప్రకృతి దృశ్యాల్లాంటివి కనువిందు చేస్తున్నాయి. ఒక్క భోజనంలోనే కాదు, పులిహోర, దోశ, బ్రెడ్, ఆమ్లెట్, ఫ్రైడ్‌రైస్ లాంటి టిఫిన్లు చేసినప్పుడు కూడా వీటిని ప్రయత్నించవచ్చు. దానిమ్మ గింజలు, బత్తాయి తొనలు, కివీ, బొప్పాయి, పుచ్చ ముక్కలు… ఇలా రకరకాల పండ్లతోనూ అందమైన ఆకృతుల్ని ఆవిష్కరించొచ్చు. అవతలి వాళ్లను ఆకట్టుకోవచ్చు. వెజిటబుల్ సలాడ్‌ను కూడా ఇలాగే ముస్తాబు చేయొచ్చు. వీటన్నింటి అలంకరణలో పనీర్, చాకొలెట్ సాస్, పుదీన ఆకుల్లాంటి వాటినీ వినియోగిస్తున్నారు. ఈ డెకరేషన్ ఎలా చేయాలో చూపించే ట్యుటోరియల్స్ యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి.
లేదు ఊరికే అలా ఫొటో చూసి ఇలా చేసేస్తాం అనుకునే వాళ్ల కోసం పింటరెస్ట్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో బోలెడు ఐడియాలు అందుబాటులో ఉన్నాయి. అతిథులు ఎవరు, ఎవరికోసం వడ్డిస్తున్నాం అన్నదాన్ని బట్టి వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవడమే. ఇందులో పిల్లల కోసం చేసేవి కొన్నైతే, పెద్దలకూ నచ్చేవి మరికొన్ని. వాళ్ల ఐడియాలు చూసి మన బుర్రనూ కాస్త జోడించామంటే వడ్డిస్తూనే వారెవ్వా అనిపించుకోవచ్చు! ఏమంటారు?!
