‘మళ్లీ నోకియా ఏంటి బాబాయ్..’ అంటారా? మళ్లీ డబ్బాఫోన్.. కనెక్టింగ్ పీపుల్ అంటున్నది. డంబ్ఫోన్లనే ఆశ్చర్యంగా చూసిన మన జనరేషన్.. ఇప్పడు రెండేసి, మూడేసి స్మార్ట్ఫోన్లు వాడేస్తున్నది. కానీ, జనరేషన్ జెడ్ (1996-2010 మధ్య జన్మించిన వాళ్లు) స్మార్ట్ఫోన్లు చూస్తేనే చిరాకు పడుతున్నారట. అందమైన తమ కౌమారాన్ని కాటువేసిన గ్యాడ్జెట్స్‌పై గర్జ్ పెంచుకుంటున్నారని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదికలో తేలింది.
5జీ ఉచ్చుతో కాలాన్ని హరిస్తున్న స్మార్ట్‌ఫోన్‌కు తిలోదకాలిచ్చి.. తామంతా ఊయలలో ఉండగా బండ రింగ్‌టోన్‌తో జోలపాడిన డంబ్ఫోన్కు మారిపోతున్నారని నివేదిక సారాంశం. ఇంత వైరాగ్యం ఎందుకని ఆరా తీస్తే… స్మార్ట్‌ఫోన్‌తో స్క్రీన్టైమ్ పెరిగి వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నామని సమాధానం చెబుతున్నారు. జనరేషన్ జెడ్ సగటు స్క్రీన్ సమయం 7.2 గంటలుగా ఉంటున్నది.
ఇన్నేసి గంటలు ఫోన్లో తలదూర్చి ప్రతిగా శారీరక అనారోగ్యంతోపాటు మానసికంగా కుంగుబాటును పొందుతున్నామని గ్రహించిన కొందరు యువకిశోరాలు.. డంబ్ఫోన్కు జై అంటున్నారు. ఆర్థిక లావాదేవీలకు మొబైల్ బ్యాంకింగ్ సరిపోతుందని చెబుతున్నారు. ఇక సామాజిక మాధ్యమాల సంగతేంటని అడిగితే.. అంతగా చూడాలనుకుంటే ల్యాప్‌టాప్ ఉండనే ఉందిగా అని సమాధానం చెబుతున్నారు. ల్యాండ్‌ఫోన్‌ను అబ్బురంగా చూసిన జనరేషన్ ఎక్స్, మిలీనియల్స్‌లో సింహభాగం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌కు దాదాపు ఎడిక్ట్ అయిపోయారు. తాజాగా జనరేషన్ జెడ్‌లో వచ్చిన మార్పు వారి ముందుతరాలకూ గుణపాఠం కావాలని ఆశిద్దాం!!