ఉదయం లేవగానే కాఫీ, ఫ్రెషప్ అయ్యాక టిఫిన్.. ఆన్లైన్లోనే! ఆఫీస్ దారిలో స్నాక్స్ తిన్నా.. లంచ్ టైమ్‌కి ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ కావాల్సిందే! ఇక సాయంత్రం పూట ఇంటికెళ్తూ ఏదో ఒకటి షాపింగ్ చెయ్యాల్సిందే! రాత్రిపూట ఫ్రెండ్స్‌తో డిన్నర్ కూడా బయటే! ఇదే ఇప్పుడు చాలామంది రొటీన్ లైఫ్ అయిపోయింది. ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే.. ‘ఇవన్నీ నిజంగా అవసరమా?’ అనే ప్రశ్న ఉదయిస్తుంది! దానికి సమాధానంగా.. సోషల్‌మీడియాలో ఓ కొత్త ట్రెండ్ వైరల్ అవుతున్నది. అదే.. ‘నో స్పెండ్ చాలెంజ్’! అంటే.. కొన్నిరోజులపాటు అనవసరమైన ఖర్చులు పూర్తిగా ఆపేయడం! ఇది కేవలం డబ్బు ఆదా చేసుకోవడం కోసమే కాదు.. ఖర్చుల అలవాట్లను మార్చుకోవడం, మానసిక ఆనందం పొందడం కోసం కొందరు పాటిస్తున్నారు!

సగటున ఓ మనిషి చేసే ఖర్చుల్లో సగం.. ‘అవసరం’ కోసం కాకుండా ‘ఆశ’ తీర్చుకునేందుకు చేసేవే ఉంటాయి! ఆ ఒక్క తేడాను గుర్తిస్తే చాలు.. సగం ఆర్థిక సమస్యలు తీరిపోయినట్లే. ‘నో-స్పెండ్ చాలెంజ్’ అంటే అదే! అంటే, అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఉండటం కాదు. తిండి, అద్దె, బిల్లుల వంటి అత్యవసరాలకు తప్ప, విలాసాలకు ఒక్క పైసా వెచ్చించకూడదనే నియమం. ఈ చాలెంజ్ మీ జేబుకే కాదు.. మీ ఆలోచనా విధానానికి కూడా ఒక పరీక్ష లాంటిదే!
నో స్పెండ్ చాలెంజ్ అంటే.. ఒక నిర్ణీత కాలంపాటు అవసరమైన ఖర్చులే చేయాలి. అదనపు ఖర్చులను పూర్తిగా పక్కన పెట్టేయాలని తీసుకునే ఒక ఆర్థిక లక్ష్యం. ఇది డబ్బును ఆదా చేయడానికి, ఖర్చు అలవాట్లను మార్చుకోవడానికి చేసే ఒక ప్రాక్టీస్‌లా ఉపయోగపడుతుంది.

ఓవైపు రోజురోజుకీ ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. మరోవైపు విపరీతమైన ఖర్చులతో.. సంపాదన మొత్తం కరిగిపోతున్నది. ఇలాంటి సమయంలో తమను తాము నియంత్రించుకోవడానికి యువత.. ఈ చాలెంజ్‌ను తీసుకొచ్చారు. ముఖ్యంగా జెన్-జెడ్ దీన్ని ఒక గేమ్‌లా భావిస్తూ.. ఖర్చులను పక్కన పెట్టేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ‘నో స్పెండ్ డే’ అని పోస్ట్ చేస్తూ.. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారు. ఇందులో ‘మరీ అతివద్దు’ అనే కాన్సెప్ట్ కూడా ఉంది.
రూపాయి కూడా ఖర్చు చేయొద్దని మరీ కక్కుర్తి పడితే.. అది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. అందుకే, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పొదుపు చేయొద్దు. అవసరాలకు మించి ఖర్చు చేయొద్దు. ఇక ఒక నెల చాలెంజ్ పూర్తి కాగానే.. ‘నేను చాలా పొదుపు చేశాను కదా!’ అనుకోవద్దు. ఆ మరుసటి రోజు నుంచి విచ్చలవిడిగా షాపింగూ చేయొద్దు. అలా చేస్తే.. ఆ చాలెంజ్‌కి అర్థమే ఉండదు. అందుకే, ఈ ఆర్థిక క్రమశిక్షణ నిరంతరం కొనసాగాలి.

కాలపరిమితి: ఒక వారం కావచ్చు, ఒక నెల కావచ్చు. మీ ఓపికను బట్టి లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి. ఒక ఏడాదిపాటు కూడా అనవసరమైన ఖర్చును పక్కన పెట్టొచ్చు.
నిబంధనలు: కేవలం పాలు, కూరగాయలు, మెడిసిన్స్, పెట్రోల్ వంటి అవసరాలకే డబ్బు ఖర్చు చేయాలి. బయటి తిండి, కొత్త దుస్తులు, అనవసర సబ్స్క్రిప్షన్లు, వినోదాల కోసం ఖర్చును పూర్తిగా నిలిపివేయాలి.
కారణాలు: అప్పులు తీర్చడానికో, ఒక పెద్ద ఇంటి కలను నెరవేర్చుకోవడానికో, ఎమర్జెన్సీ ఫండ్ నిల్వ చేసుకోవడానికో.. ఈ చాలెంజ్ ఒక బూస్టర్‌లా పనిచేస్తుంది.
తాత్కాలిక బ్రేక్: ఆన్లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ, కెఫే విజిట్స్ లాంటి వాటికి తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాలి.
మైండ్‌ఫుల్ స్పెండింగ్: ఒక్కో రూపాయి ఖర్చు చేసే ముందు.. ‘ఇది అవసరమా?’ అని మనకు మనమే ప్రశ్నించుకోవాలి. తప్పకుండా ‘అవసరం’ అనిపిస్తేనే ఖర్చు చేయాలి.
ఖర్చుల జాబితా: నో స్పెండ్ చాలెంజ్లోకి దిగడానికి ముందు.. మీరు వేటికి ఖర్చు చేయకూడదో ఒక లిస్ట్ రాసుకోండి.
ప్రలోభాలకు దూరం: మిమ్మల్ని ప్రలోభపెట్టి షాపింగ్ చేయించే యాప్స్‌ను కొన్నిరోజులు అన్ఇన్స్టాల్ చేయండి. ఆకర్షణీయమైన ఆఫర్లకు తలొగ్గకండి.
ప్రత్యామ్నాయాలు: బయట సినిమాకు వెళ్లే బదులు.. ఇంట్లోనే సినిమాలు చూడండి. రెస్టారెంట్లో తినేకన్నా.. ఇంట్లోనే కొత్త వంటకాలు ప్రయత్నించండి.
చివరగా.. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. దాన్ని నిలబెట్టుకోవడం అంతకన్నా అవసరం. మీరు కూడా ఈ చాలెంజ్‌ని ప్రయత్నించి చూడండి. మీ ఖాతాలో పెరిగిన బ్యాలెన్స్ ఇచ్చే ఆనందం.. అనవసరమైన షాపింగ్ కంటే ఎక్కువే ఉంటుంది!