Bengaluru Cafe : సాధారణంగా రెస్టారెంట్లు, కేఫ్‌లలో కొన్నిసార్లు కార్పొరేట్ మీటింగ్స్ జరుగుతుంటాయి. ఐటీ, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్ రంగాలతోపాటు వివిధ వ్యాపారవర్గాలకు చెందిన చిన్నపాటి మీటింగ్స్ ఎక్కువగా రెస్టారెంట్లు, కేఫ్‌లలో జరుగుతుంటాయి. అయితే, ఇలాంటి మీటింగ్స్‌ను తమ కేఫ్‌లో అంగీకరించబోమని బెంగళూరుకు చెందిన ఒక కేఫ్ చెప్పింది. అంతేకాదు.. గంటసేపుకంటే ఎక్కువ టైం కేఫ్‌లో ఉంటే రూ.1,000 ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.
దీనికి సంబంధించి ఒక నోటీస్ బోర్డు కూడా ఏర్పాటు చేసింది. కేఫ్ పేరు తెలియనప్పటికీ.. ఒక కస్టమర్ దీనికి సంబంధించిన బోర్డును ఫొటో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ అంశంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. సాధారణంగా నలుగురైదుగురు కలిసే మీటింగ్స్ ఇలాంటి కేఫ్‌లలోనే జరుగుతుంటాయి. అలాగే వర్కింగ్ కల్చర్‌లో మార్పు కూడా ఇందుకు కారణం. కస్టమర్లు కాఫీ తాగి, ఏదైనా స్నాక్స్ తింటూ అక్కడే గంటల తరబడి పని చేసుకుంటారు. కేఫ్‌లు, రెస్టారెంట్లు చెబుతున్నదాని ప్రకారం.. ఇలా కొందరు కస్టమర్లు టేబుళ్లను గంటలతరబడి వాడుతున్నారు. ఖాళీ చేయకుండా, ఒక కాఫీ లేదా టీ మాత్రమే తాగుతున్నారు. ఆర్డర్లు నెమ్మదిగా, ఒకట్రెండు మాత్రమే ఇస్తూ తమ స్పేస్ వాడుకుంటున్నారు. దీంతో ఇతర కస్టమర్లకు సమయానికి టేబుల్ దొరకడం లేదు. అందుకే ఒక కేఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కువ సేపు మీటింగ్స్ పెట్టుకోకుండా, గంటసేపటికంటే ఎక్కువ టైం కూర్చోకుండా చూస్తోంది.
saw this notice posted at an eatery in BLR pic.twitter.com/nnEpjPjRjg
— Shobhit Bakliwal (@shobhitic) January 25, 2026
అలా కూర్చుంటే గంటకు రూ.1,000 ఫైన్ విధిస్తామని వార్నింగ్ బోర్డ్ పెట్టింది. చాలా మంది యూజర్లు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. కేఫ్‌లు అంటేనే నలుగురూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి అని, కాస్త టైం స్పెండ్ చేయడానికే అని చాలా మంది అంటున్నారు. ఇలా గంటలతరబడి కూర్చుని టేబుల్స్ ఆక్రమించి టైం వేస్ట్ చేస్తే వేరే కస్టమర్లకు టేబుల్స్ దొరకడం లేదని, పైగా ఆ చిరు వ్యాపారానికి నష్టం కలుగుతుందని ఇంకొందరు అంటున్నారు. కొందరు కస్టమర్లు కేఫ్‌లు, రెస్టారెంట్లు విశ్రాంతి తీసుకోవడానికే అంటుంటే.. ఆ స్పేస్ తమ ఆర్థిక లావాదేవికి సంబంధించింది అని రెస్టారెంట్ల ఓనర్లు అంటున్నారు.