నూతన సంవత్సరంలోకి వచ్చేశాం. ఈ ఏడాది కొత్తగా ఏం చేద్దాం అని అలోచిస్తూ ఉంటారుగా. ఇది ట్రై చేయండి. ఈ మధ్య వచ్చిన ‘8 వసంతాలు’ సినిమా చూసే ఉంటారుగా. అందులో ఓ పాట ఉంటుంది. ‘పరిచయమిలా.. పరిమళములా’ అంటూ సాగిపోతుంది. మనం కూడా అలాంటి పరిచయాల కోసం వెతుకుతూ ఉంటాం. ఈ వెతుకులాటలో ఓ ముఖ్యమైన వ్యక్తిని మర్చిపోతాం. ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నారా? అది మీరే! ఈ కొత్త ఏడాది మిమ్మల్ని మీరు తిరిగి పరిచయం చేసుకోండి. మీకు మీరే కొత్తగా కనిపిస్తారు.
కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ మారడం మాత్రమే కాదు, కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే అద్భుతమైన అవకాశం. గతంలో జరిగిన పొరపాట్ల నుంచి నేర్చుకుంటూ, మరింత మెరుగైన వ్యక్తిగా ఎదగడానికి ఇది సరైన సమయం. నిన్నటి మీ కంటే నేటి మీరు ఎంత మెరుగ్గా ఉన్నారనేదే అసలైన ఎదుగుదల. ఈ కొత్త ఏడాదిలో మీ పాత భయాలను వీడి, కొత్త ఆశలతో అడుగు ముందుకు వేయండి. బాహ్య విజయాల మీద ఎంత దృష్టిపెడతారో అంతర్గత ప్రశాంతత, మానసిక ఆరోగ్యం మీద కూడా అంతే శ్రద్ధ వహించాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి కొన్ని సూచనలు.
కృతజ్ఞత కలిగి ఉండటం: మన దగ్గర లేని దాని గురించి బాధపడటం కంటే, ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండటం వల్ల మెదడులో సానుకూలత పెరుగుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు, ఆ రోజు మీకు జరిగిన మూడు మంచి విషయాలను ఒక డైరీలో రాయండి. ఇది మీ ఆలోచనా దృక్పథాన్ని మారుస్తుంది.
భావోద్వేగాల నియంత్రణ: కోపం, భయం, బాధ కలగడం సహజం. కానీ వాటిని అణచివేయకుండా, వాటిని గుర్తించడం నేర్చుకోండి. ఒత్తిడి అనిపించినప్పుడు దీర్ఘ శ్వాస తీసుకోవడం లేదా కాసేపు ఏకాంతంగా ఉంటే మనసు కుదుటపడుతుంది.
‘నో’ చెప్పడం నేర్చుకోండి: అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీ శక్తికి మించిన పనులను అప్పగించినప్పుడు, మీకు ఇష్టం లేని పనుల విషయంలో సున్నితంగా ‘నో’ చెప్పడం నేర్చుకోండి. మీ వ్యక్తిగత సమయం మీకు చాలా ముఖ్యం.
వర్తమానంలో జీవించడం: చాలామంది గతంలో జరిగిన పొరపాట్ల గురించి బాధపడుతూనో, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూనో ఉంటారు. దీనివల్ల ప్రస్తుత క్షణంలోని సంతోషాన్ని కోల్పోతారు. చేసే ప్రతి పనినీ పూర్తి స్పృహతో చేయడం అలవాటు చేసుకోండి.
డిజిటల్ డిటాక్స్: సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో మనల్ని మనం పోల్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. రోజులో కనీసం ఒక గంట పాటు ఫోన్, ల్యాప్‌టాప్‌కు దూరంగా ఉండండి. ప్రకృతితో సమయం గడపడం, నచ్చిన పుస్తకం చదవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
అన్నిటికన్నా.. మనం తరచుగా సమాజం కోసమో, ఇతరుల మెప్పు కోసమో ముసుగులు వేసుకుని బతుకుతుంటాం. ఆ ముసుగులను తొలగించి, మీలోని సహజత్వాన్ని గౌరవిస్తూ, మీరు ఎవరో ఆ నిజాయితీతో జీవించడమే జీవితం మనకు ఇచ్చే అత్యున్నతమైన అవకాశం. మీ లోపల ఒక అద్భుతమైన ప్రపంచం ఉంది, దాన్ని ఆవిష్కరించుకోవడానికి ఈ ఏడాది సాధన చేయండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.