నాటిక పేరు: నాన్నా నేనొచ్చేస్తా!
మూలకథ: శ్రీగంటి రాజేశ్వరి
రచన: తాళాబత్తుల వెంకటేశ్వరరావు
దర్శకత్వం: అమృతలహరి
ప్రదర్శన: శ్రీ అమృతలహరి థియేటర్ ఆర్ట్స్
పాత్రధారులు: అమృతవర్షిణి, లహరి, హసన్, ప్రసాద్
ఎంత మారిందనుకున్నా ఇది పురుషాధిక్య సమాజమే. సంస్కారవంతులుగా, విద్యావంతులుగా ముసుగేసుకున్నా భార్య అణగిమణగి ఉండాలనే భావనలో ఉన్నవాళ్లే ఎక్కువ. కానీ, కూతురు మెట్టినింటికి పోయి, చీటికి మాటికి తగువులాడి పుట్టింటికి వచ్చేస్తే.. కన్నప్రేమ నా కూతురే కరెక్టని వాదిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో… ఓ బాధ్యతగల తల్లి తన జీవితానుభవంతో ఓర్పుగా, నేర్పుగా కూతురు సంసారాన్ని చక్కదిద్దుతుంది. లోకం రీతిని కళ్లకు కడుతూ కనువిప్పు కలిగించే నాటిక ‘నాన్నా నేనొచ్చేస్తా’.
వర్షం వస్తున్న అర్ధరాత్రి.. సుధ భర్తతో గొడవపడి అకస్మాత్తుగా తన పుట్టింటికి వస్తుంది. ఆమె రాక తల్లి సావిత్రికి నచ్చదు. ఆ సమయంలో అల్లుడు శ్రీరామ్‌కు ఫోన్ చేస్తే… ‘మా మధ్యన జరిగిన గొడవేమిటో మీ ముద్దుల కూతుర్నే అడిగి తెలుసుకోండి’ అంటూ వ్యంగ్యంగా బదులిస్తాడు. మర్నాడు తండ్రి రాఘవను పట్టుకుని కూతురు బోరున ఏడుస్తూ ‘నేనిక శ్రీరామ్ దగ్గరకు పోను. ఇక్కడే ఉంటాను’ అంటూ చిన్నపిల్లలా మారాం చేస్తుంది సుధ.
‘నాన్నా… మీరు వద్దన్నా నేనే మిమ్మల్ని ఒప్పించి శ్రీరామ్‌ను పెళ్లి చేసుకున్నాను. మాది ప్రేమ వివాహమే! కానీ, నేను పెద్ద తప్పు చేశానని ఇప్పుడనిపిస్తోంది. నాకు ఆయన విలువ ఇవ్వడు. ఒకర్ని ఒకరు అర్థం చేసుకున్నది భ్రమేనని ఆలస్యంగా తెలుసుకున్నాను. అతగాడికి అహంకారం ఎక్కువ. అన్నిటికి తన మాటే నెగ్గాలనుకుంటాడు. నా మాటలకు, చేతలకు కొంచెం కూడా అప్రిసియేషన్ ఇవ్వడు. అసలు నన్ను ఓ మనిషిలా చూడడు. ఇంత చదువు చదివి, మా ఆఫీసులో టీమ్ లీడర్‌గా అందరిచేత ఎక్స్లెంట్ అనిపించుకుంటున్నా, ఇంట్లో మాత్రం ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోతున్నా’ అంటూ వలవల ఏడ్చింది.
అదే సమయంలో అల్లుడు శ్రీరాం అక్కడికి చేరుకున్నాడు. వాళ్లిద్దరూ మాట్లాడుకోవడం కోసం తల్లిదండ్రులు వేరే గదిలోకి వెళ్లారు.
సుధ: ‘నాకు వ్యక్తిగత కోరికలు ఉంటాయి. జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంటున్నా. కానీ, నీకివేమీ నచ్చవు. పుట్టిన రోజు సెలెబ్రేషన్ జరుపుకొంటానంటే వద్దంటావు. అన్నిటినీ బడ్జెట్‌తో ముడిపెడతావ్. ఏం నేను సంపాదిస్తున్నాగా… సరిపోదా?’
శ్రీరామ్: ‘సరిపోదు (గట్టిగా అరుస్తూ). నువ్వు అనుకున్నవన్నీ జరగాలని అనుకుంటే ఈ మహానగరంలో కచ్చితంగా సరిపోదు. ఈ కొలువులు, జీతాలు శాశ్వతం కాదు. మనకొచ్చిన జీతాలతోనే ఓ ప్లాన్ ప్రకారం జీవితం గడపాలి. అప్పులు చేసి ఆర్భాటాలకు పోయి, అనందం కొనుక్కోవడం నాకిష్టం ఉండదు. ఇది ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసే దంపతుల మధ్య ఎక్కువగా జరుగుతున్న ఘర్షణే. ఈ ఘర్షణలో నీ డబ్బు, నా డబ్బు, నీ ఆస్తి, నా ఆస్తి అంటూ ఏదీ వేర్వేరుగా చూడడం సరికాదు.’
సుధ: ‘ప్రమోషనతో నేను టీమ్ లీడర్ అయ్యాను. నాకు జీతం పెరిగినప్పటి నుంచి నువ్వు జెలసీగా ఫీలవుతున్నావు. మీ మగబుద్ధి చూపిస్తున్నావు. పెత్తనం చేయాలని భావిస్తున్నావు. నీతో జీవితం అంటేనే నాకు విరక్తి కలుగుతున్నది.’
శ్రీరామ్: ‘పెళ్లికి ముందు ప్రేమించుకునేప్పుడు నీవు లేకపోతే నేను లేను అన్నావు. ఇప్పుడు నేనంటేనే విరక్తి అంటున్నావు. ఎంతమాటొస్తే అంతమాట అనేస్తున్నావు. వివాహం అంటే ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ కాదు. సహనం ఉండాలి’
(శ్రీరామ్ అక్కడినుంచి వెళ్లిపోతాడు)
ఆ తర్వాత.. ‘నేను ఎదుర్కొన్న సమస్యలతో పోలిస్తే నీవి ఏపాటివి? సమస్యల పరిష్కారం కోసం నాకు నేనుగా ఘర్షణపడేదాన్ని. సాక్ష్యంగా ఇవిగో ఉత్తరాలు’ అంటూ తల్లి కూతురికి కొన్ని ఉత్తరాలు చూపింది. ‘పద్దెనిమిదేళ్ల చిన్న వయసులోనే నాకు పెళ్లయింంది. ఉమ్మడి కుటుంబంలోకి వచ్చాను. నీ అంతగా నేను చదువుకోలేదు. ఇవన్నీ నువ్వు పుట్టక ముందు నాడు రాసుకున్న బాధలు. నాలుగు రోజుల తర్వాత పోస్ట్ చేద్దామని అనుకుని ఆగిపోతే.. ఆ తర్వాత అంత బాధ అనిపించేది కాదు. కాబట్టి పోస్ట్ చేయక నా వద్దే ఉండిపోయాయి’ అంటూ తల్లి బిడ్డకు ఉత్తరాలు చూపింది.
ఓ ఉత్తరం తెరిచి… ‘అమ్మా! నాన్నా! మీ ఒళ్లో తలపెట్టి చాలా విషయాలు మీకు చెప్పాలని ఉందమ్మా. క్లాసులో నాకు ఫస్టు మార్కులు వస్తే మీరు ఎంతో సంబరపడిపోయి మెచ్చుకునేవారు. ఇక్కడ కష్టపడి అందరికీ వంటచేసి వడ్డిస్తుంటే.. ఎవరూ మెచ్చుకోరేం నాన్నా..? పైగా వంకలు పెడుతూ తిడతారు ఎందుకమ్మా..? ఎక్కువమందిని సమాధానపర్చడం చాలా కష్టంగా ఉందమ్మా!
అల్లుడు గారికి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఒంటరిగా ఉండాలి. కొన్ని రోజులు అమ్మను తోడుగా పంపమని అడుగుదామంటే కుదరదని అంటున్నారు. నేను ఇప్పుడు మామూలు మనిషిని కూడా కాదు. అమ్మా నువ్వు నా దగ్గరుండటం ఆయనకు ఇష్టం లేదట. ఈ విషయంలో మా మధ్య గొడవ జరిగింది. నన్ను నానా మాటలన్నారు. తట్టుకోలేకపోతున్నానమ్మా. చిన్నప్పటి నుంచి మీరు ఏమాట అనకుండా నన్నెందుకు అంత గారాబంగా పెంచారు నాన్నా!’ అని చదువుతుంటే.. బావురుమంటూ ఏడుస్తూ సుధ తల్లిని కౌగిలించుకుంది. సుధ తెప్పరిల్లి వెంటనే శ్రీరామ్ దగ్గరికి వెళ్తుంది. భర్తతో కలిసి కలిసివచ్చి తల్లిదండ్రులను తమ ఇంటికి రమ్మని ఆహ్వానించడంతో కథ సుఖాంతం అవుతుంది.
భావోద్వేగాలు నిక్షిప్తం చేయడానికి ఉత్తరాలు ఎంతగా ఉపయోగపడతాయో ఈ నాటిక విశదపరిచింది. ఉత్తర-దక్షిణ ధ్రువాల్లాంటి రెండు స్త్రీ పాత్రలు నాటికకు మూలస్తంభాల్లా నిలిచాయి. సమకాలీన సమస్య కావడంతో ప్రేక్షకలోకం అడిగి మరీ ఈ నాటకాన్ని ప్రదర్శనలు ఇప్పించుకుంటున్నది. రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు ఇతర రాష్ర్టాల్లో కూడా ఈ నాటికను ప్రదర్శించారు.
…? కె. శాంతారావు
రంగస్థల నటుడు, విశ్లేషకుడు