సూర్యుడు మనకు వెలుగుతోపాటు శక్తిని ఇస్తున్నాడు. వెలుగు ఎటుంటే అటు తిరిగే పొద్దుతిరుగుడు పువ్వులాఅవకాశాల వైపు అడుగులేస్తూ సౌరశక్తితో స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నది విజేతా రెడ్డి. పెళ్లి కారణంగాఇంటర్మీడియట్ మధ్యలోనే ఆగిన చదువును కొనసాగిస్తూనే.. వ్యాపారంలో అడుగుపెట్టింది. ‘బ్రైట్ సొల్యూషన్స్’తో సంప్రదాయ విద్యుత్తుకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నది. ఆ సౌర వెలుగుల ప్రస్థానం ఆమె మాటల్లోనే..
నాకంటూ ఓ గుర్తింపు కావాలని.. నాదైన భవిష్యత్ ఉండాలని ఈ రంగాన్ని ఎంచుకున్నా. నాకు సోలార్ పవర్ గుర్తింపునిచ్చింది. ఒక ప్రయత్నంలో విఫలమైతే.. ఇంకో పనిలోకి మారిపోకుండా అక్కడే మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. ప్రతి ప్రయత్నంలో కొత్తపాఠం నేర్చుకుంటే తప్పక సక్సెస్ అవుతాం. అదే నా విజయ రహస్యం. ప్రతిరోజూ కొత్తగా తీర్చిదిద్దుకుంటూ నన్ను నేను మార్చుకున్నా. నేను హైదరాబాద్‌లో ఉంటూ పిల్లల చదువు, సోలార్ వ్యాపారం చూసుకుంటున్నాను. నాలాగే మా ఆయన కూడా ఊళ్లో తనకు ఇష్టమైన వ్యవసాయం చేస్తున్నారు. నా భర్త కుడుముల శేఖర్ రెడ్డి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను.
నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. ఇంటర్మీడియట్ పరీక్షలకు ముందే పెళ్లి పీటలెక్కాను. చదువు మధ్యలోనే ఆగిపోయింది. అత్తగారిదీ వ్యవసాయ కుటుంబమే. నాకు సేద్యం పట్ల ఆసక్తి లేదు. ఇంకా చదవాలనిపించింది. కానీ కుటుంబ బాధ్యతల వల్ల సాధ్యం కాలేదు. నా కొడుకు కొంచెం పెద్దవాడైన తర్వాత చదువు మీద ఆసక్తి పెరిగింది. డిస్టెన్స్‌లో బీఏ చేశాను. కాలేజీకి వెళ్లి ఎంఏ ఎకనామిక్స్ చదివాను. తర్వాత బీఎడ్, ఎమ్మెస్సీ సైకాలజీ కూడా పూర్తి చేశాను. నేను ఎంఏ చదివిన కళాశాలలోనే కొంతకాలం గెస్ట్ లెక్చరర్‌గా పని చేశాను.
బడి కోసం..
బీఎడ్ చదివాను కాబట్టి విద్యార్థికి ఎలాంటి చదువులు అవసరమో నాకు తెలుసు. కానీ, అలాంటి చదువు చెప్పే స్కూళ్లు మా కల్వకుర్తి చుట్టుపక్కల లేవు. నేను మంచి బడి కోసం వెదకడం మొదలుపెట్టాను. మొత్తానికి, హైదరాబాద్ దగ్గర్లో ఉన్న ఓ స్కూల్లో మా వాడిని చేర్పించి, హాస్టల్లో ఉంచాను. అలా మూడేండ్లు గడిచాయి. పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో పెరిగితేనే మంచిగా ఉంటారని చదివాను. బిడ్డను నా చేతుల మీదుగా పెంచలేకపోతున్నందుకు బాధగా అనిపించింది. నాతోనే వాడూ ఉండాలని హైదరాబాద్ వచ్చాను. బాబు చదువు చూసుకుంటూ ఇక్కడే ఉన్నాను. ఊళ్లో ఉంటూ మా ఆయన వ్యవసాయం చేస్తున్నారు.
భవిత వైపుగా..
హైదరాబాద్ వచ్చేనాటికి నాకంటూ ఓ లక్ష్యం ఉంది. జ్యూట్ బ్యాగుల తయారీ లేదా సోలార్ ఎనర్జీ వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ఈ రెండిటిలో ఏదో ఒకటి నా టార్గెట్. వ్యాపారం కంటే ముందు మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. మొదట మా అబ్బాయి చదివే స్కూల్లోనే ఉద్యోగంలో చేరాను. అడ్మిషన్లు చూసేదాన్ని. పేరెంట్స్‌కి, మేనేజ్మెంట్కి మధ్య కోఆర్డినేటర్‌గా వ్యవహరించేదాన్ని.
ఏడాది తర్వాత ఆ ఉద్యోగం మానేశాను. ఐటీసీలో సీఎస్ఆర్ విభాగంలో చేరాను. పాఠశాల పిల్లలకు స్వచ్ఛ భారత్ గురించి అవగాహన కల్పించడం, ఘన వ్యర్థాలను వేరు చేయడం ఎలాగో నేర్పించడం నా పనులు. కొన్నాళ్ల తర్వాత ఆ ఉద్యోగం కూడా మానేశాను. హైదరాబాద్‌లో ప్రైవేట్ సెక్టార్‌ను పూర్తిగా స్టడీ చేశాను. ఆ రోజుల్లోనే.. మా పొలం పక్కనే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి ఆ పవర్‌ను పవర్ గ్రిడ్‌కి అమ్మేవాళ్లు. అది చూసిన తర్వాత సోలార్ పవర్ పట్ల మరింత ఆసక్తి కలిగింది. ‘ఇదే నా భవిష్యత్’ అని నిర్ణయించుకున్నాను.
అంత సులభం కాదు
సోలార్ విద్యుత్‌కు సంబంధించిన సాంకేతిక విషయాలు ఇంటర్నెట్లో తెలుసుకున్నాను. జనం అవసరాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకున్నాను. మార్కెట్లో పరిస్థితులు అధ్యయనం చేశాను. ఆ తర్వాతే ‘బ్రైట్ సొల్యూషన్స్’ ప్రారంభించాను. సోలార్ పవర్‌కు భవిష్యత్ ఉందని అంగీకరించేవారే కానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. అయినా నేను ఆగిపోలేదు. మూడు నెలలు ప్రయత్నిం చాను. ఏదో ఎన్జీవో అటవీ ప్రాంతంలో ఒక భవనాన్ని నిర్మించింది. దానికి సోలార్ విద్యుత్ మేలని చెప్పాను. దీనివల్ల వైరింగ్ కష్టాలు తప్పుతాయి. ఆర్థికంగా భారం తగ్గుతుంది. కరెంటు బిల్లు ఉండదు.
కేవలం నా మాటలు నమ్మి ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు. మంచి క్వాలిటీతో అనుకున్న సమయానికి సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించాం. వాళ్లు చాలా సంతోషించారు. ఆ అవకాశం ఇచ్చినవాళ్లే అభిమానంతో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి సిఫారసు చేశారు. ఆ కంపెనీ నిర్మించే విల్లాలన్నిటికీ సోలార్ వాటర్ హీటర్ల ఆర్డర్ వచ్చింది. దీంతో బ్రైట్ సొల్యూషన్స్ గురించి నలుగురికీ తెలిసిపోయింది. ఇప్పుడు, అడగకుండానే ఆర్డర్లు వస్తున్నాయి. నెలకు అయిదు వేల రూపాయల కంటే ఎక్కువ విద్యుత్ బిల్లు చెల్లించే వాళ్లంతా సోలార్ ప్యానల్స్‌ను అమర్చుకుని గ్రిడ్‌తో అనుసంధానమైతే ఆర్థికంగా ఎంతోమేలు. పాఠశాలలు, హాస్పిటల్స్ విద్యుత్ ఖర్చు తగ్గించుకోవచ్చు. వ్యవసాయ భూముల్లో, సేద్యానికి పనికిరాని భూముల్లో సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి పవర్ గ్రిడ్‌కు అమ్ముకోవచ్చు. ఈ కొత్త అవకాశాల వైపుగా చాలా మంది అడుగులేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల రాకతో కరెంట్ బిల్లు తగ్గించుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు.