సీతా రంజిత్ రెడ్డి.. సంపన్న కుటుంబంలో పుట్టారు. భర్త రంజిత్ రెడ్డి వ్యాపారవేత్త, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు.ఆమె ఆలోచనలు మాత్రం సామాన్యుల చుట్టూ తిరుగుతుంటాయి. ఉపాధి కరువైన చేనేత కార్మికులు, తమ సంస్థలలో పనిచేసే సిబ్బంది, తన భర్త నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలు.. ఎవరికి ఏ అవసరం వచ్చినాస్పందిస్తారు. సహృదయంతో ఆదుకుంటారు. తాజాగా ఆమె తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి సభ్యురాలిగా నియమితులయ్యారు. సామాన్య భక్తులకు శీఘ్రంగా శ్రీవేంకటేశ్వరుడి దర్శనభాగ్యం కలిగించడమే తన లక్ష్యమనిఅంటున్నారు
సీతా రంజిత్ రెడ్డి..
ఆరోగ్యం, విద్య, నైపుణ్యం.. ప్రతి అమ్మాయి కనీస హక్కులు. అవగాహన లేక, చేయూత అందక చాలామంది గ్రామీణ బాలికలు ఈ మూడు హక్కులకూ దూరం అవుతున్నారు. అందుకే పలు సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) మహిళా విభాగమైన ‘ఫ్లో’ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగానూ ఆ లక్ష్యం కోసం కృషి చేస్తున్నా. తరచూ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి పీరియడ్స్ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం.
చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని చాలా బడులలో శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మెషీన్లు అందుబాటులోకి తెచ్చాం. కొవిడ్ సమయంలో ప్రత్యేక యాప్ ద్వారా బాడీ లాంగ్వేజ్, స్కిల్ డెవలప్మెంట్, స్పోకెన్ ఇంగ్లిష్ ఆన్లైన్ క్లాసులు నిర్వహించాం. గ్రామీణ ప్రాంతాల్లో ఆణిముత్యాల్లాంటి బాలికలు ఉన్నారు. మా చేయూతతో వాళ్లంతా చక్కని ప్రావీణ్యం కనబరుస్తున్నారు. అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుంటే ముచ్చటేస్తుంది. నా సొంత ఛారిటబుల్ ట్రస్ట్.. ఆర్ఆర్ ఫౌండేషన్‌కు సెక్రటరీగానూ వ్యవహరిస్తున్నా. ఉన్నత చదువులు చదవలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను ట్రస్ట్ తరపున ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం.
చేనేతకు ప్రాచుర్యం..
భారతీయ సంస్కృతిలో చేనేత వస్ర్తాలకు ఓ ప్రత్యేకత ఉంది. వీటికి మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. నేత వస్ర్తాలంటే నాకు ఆసక్తి. పట్టుచీర కట్టుకోవడం ఇష్టం. ఈ మక్కువతోనే గత పదిహేనేళ్లుగా క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యురాలిగా కొనసాగుతున్నా. పోచంపల్లి, గద్వాల, ఉప్పాడ, బెనారస్ వంటి తరాలనాటి వస్ర్తాలకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన అధునాతన డిజైన్లను ఒకే వేదికపైకి తెచ్చి విక్రయాలు పెంచేందుకు కృషిచేస్తున్నాం. నేటితరం కూడా చేనేత వస్ర్తాలను ధరించి మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్నదే మా ఆకాంక్ష. కొవిడ్ సమయంలో ఎంతోమంది చేనేత కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేశాం. కొయ్యబొమ్మల తయారీ వంటి హస్తకళలకు ఆదరణ కల్పించేందుకు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నాం.
బ్యాలెన్స్ చేసుకుంటూ..
కుటుంబానికి ఇబ్బంది కలగకుండానే.. సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నాను. నాకు డ్యాన్స్, మ్యూజిక్ అంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే మా అమ్మాయి పూజారెడ్డికి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి వద్ద శిక్షణ ఇప్పించాను. వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది తను. బాబు రాజ్ ఆర్యన్‌కు చిన్నప్పుడే సంగీతం నేర్పించాను. పిల్లలు స్కూలు నుంచి రాగానే నేనే డ్రైవ్ చేస్తూ డ్యాన్స్, సంగీతం క్లాసులకు తీసుకెళ్లేదాన్ని. ఇప్పుడు ఇద్దరూ పెద్దవాళ్లయ్యారు. అమ్మాయికి పెళ్లయ్యింది.
బాబు చదువు ఓ దారికి వచ్చింది. దీంతో సామాజిక, ఆధ్యాత్మిక సేవలకు పూర్తి సమయం వెచ్చిస్తున్నా. జపనీస్ సాంప్రదాయ కళ ‘ఇకెబనా’ అంటే నాకు ప్రాణం. చెట్టు మీద ఉండాల్సిన ఆకులు, పూలను.. నేల మీదకు తెచ్చి రంగవల్లికలా ఆవిష్కరించే కళ ఇది. ఇకెబనా ధ్యానంతో సమానమైంది. నా వ్యక్తిత్వం మీద అమ్మ పుట్టింటి ప్రభావమూ ఉంది. మా అమ్మమ్మ, తాతయ్య నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నా. అమ్మమ్మ ఊరు మహబూబాబాద్ జిల్లాలోని కల్వల. తాతయ్య పెద్ద భూస్వామి.పలు పర్యాయాలు సర్పంచ్‌గా చేశారు.
శ్రీనివాసుడి సేవలో..
బాల్యం నుంచీ నాకు దైవభక్తి ఎక్కువ. వరంగల్‌లోని ఎల్బీ కాలేజ్‌లో చదువుకునే రోజుల్లో భద్రకాళి ఆలయానికి, ఆ పక్కనే ఉన్న షిర్డీ సంస్థాన్‌కు తరచూ వెళ్లేదాన్ని. మా ఆయన కూడా ఆస్తికుడే. గతంలో ప్రతివారం ఏదో ఒక ఆలయానికి వెళ్లేవారు. ప్రస్తుతం ఎంపీగా రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. పదిహేను రోజులకు ఒకసారైనా దైవదర్శనం చేసుకుంటారు. నేను మాత్రం రోజూ గుడికి వెళ్తాను. హిమాయత్ నగర్, ఫిల్మ్‌నగర్ టీటీడీ ఆలయాలకు లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గానూ వ్యవహరిస్తున్నా.
తిరుపతికి వెళ్తే ఎక్కువగా కాలినడకనే కొండకు చేరుకుంటాను. నా భక్తికి మెచ్చి వేంకటేశ్వరుడు టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా అవకాశం కల్పించాడేమో అనిపిస్తున్నది. సామాన్య భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సేపు నిరీక్షించకుండా శీఘ్రంగా స్వామి దర్శనం జరిగేలా నావంతు కృషిచేస్తా. యాదాద్రి సందర్శన పేరుతో ఇటీవల ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాం. చేవెళ్ల ప్రజలు శని, ఆదివారాల్లో యాదాద్రి ఆలయాన్ని సందర్శించేలా ఏర్పాట్లు చేశాం. రవాణా, భోజనం, దర్శనం టిక్కెట్లను సమకూరుస్తూ.. మా వలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నడిపిస్తున్నారు. నాకెంతో సంతృప్తినిచ్చిన సేవ ఇది.
…? గంజి ప్రదీప్ కుమార్