ఇంటర్ పరీక్ష ఫీజు కట్టాక అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంలో బోటని రికార్డు ఇవ్వనందుకు నా అప్లికేషన్ కాలేజీ ఆఫీసులో తీసుకోలేదు. బోటనీ లెక్చరర్ నుండి లెటర్ తెమ్మన్నారు. మర్నాడు కాలేజీకి రాగానే బోటనీ మేడమ్ ఆ రోజు లీవ్ అని తెలిసి నా గుండె జారిపోయింది. ఆ రోజంతా నా మనసు మనసులో లేదు. మర్నాడే నేను మా ఊరికెళ్లి రెండ్రోజులు అక్కడ ఉండి అక్కడి నుండే బోటని రికార్డు కోసం కొమ్మలు రెమ్మలు తెచ్చుకోవాల్సి ఉంది.
నేను వెళ్లి వచ్చేలోగా లాస్ట్ డేట్ అయిపోతే ఎట్లా అనే దిగులు మొదలయింది. అన్ని క్లాసులు హాజరవుతున్నా మనసులో ఓ మూల ఏదో తొలుస్తూనే ఉంది. జయశ్రీ గానీ, అంజని గానీ ఎందుకో రెండు మూడు రోజులుగా కాలేజీకి రాలేదు. ఎవరితోనూ నా బాధ చెప్పేలా లేదు. తీరా క్లాసులు అయిపోయేసరికి నాలుగయింది. మా ఆఫీసు అయిదు దాకా ఉంటుంది. ఏమయితే అదవుతుందని ఆఫీసుకు వెళ్లాను. ఆఫీసులో మళ్లీ అదే రష్, పెద్ద క్యూ. ఇంటర్ వాళ్లు, డిగ్రీ వాళ్లు ఏవేవో కాగితాలు చేతిలో పట్టుకుని లైన్లో నిలుచున్నారు. ‘వాట్ రే.. సీ రే’ అంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఆ ముందు రోజు సుమిత్రా మేడమ్ ఉగ్రరూపం చూసిన నేను భయపడుతూ లైన్లో చేరాను. అందరూ క్లియర్ అయ్యేసరికి నా వంతు వచ్చింది.
‘ఎస్!’ అన్నారు సుమిత్రా మేడమ్ చెప్పమన్నట్లుగా. ఆమెకు నిన్న నేను కలిసింది గుర్తులేదో, లేక గుర్తులేనట్టు అగుపించారో గానీ.. మామూలుగానే ఉన్నారు. అయినా, రోజూ కలిసే వందల మందిలో నేను గుర్తుండాలని లేదుగా! ‘సీనియర్ ఇంటర్ ఎగ్జామ్ ఫీ కట్టాను మామ్!’ అంటూ చెప్పబోతుండగానే ఆమె ‘ఓకె’ అంటూ గ్రిల్ విండో లోంచి ఓ అప్లికేషన్ బయటికి ఇచ్చి ‘తొందరగా ఫిల్ చేసి, ఫొటోస్ పెట్టి, అన్నీ ఎంక్లోజ్ చేసి ఇవ్వు’ అంది. ‘కాదు మేడమ్! నేను నిన్న వచ్చాను. బోటనీ మేడమ్ దగ్గర నో ఆబ్జెక్షన్ తెమ్మన్నారు’ అన్నాను భయపడుతూనే. ‘మరి? తెచ్చావా? ఇవ్వు’ అన్నారామె చాలా క్యాజువల్‌గా. ‘మేడమ్ లీవ్‌లో ఉన్నారు’ ఆ మాట చెప్పడానికి నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది.
‘అయితే నీ ఖర్మ!’ అన్నారామె. నాకు ఏడుపు వచ్చింది. ‘మేడమ్! ప్లీజ్..’ అన్నాను కళ్లలో నీళ్లు తిరుగుతుండగా. ఆమె ఏమనుకున్నారో ఏమో! ‘సరే.. సరే.. అప్లికేషన్ ఇవ్వు, నువ్వు రాసిన లెటర్ కూడా ఇవ్వు. మేడమ్ వచ్చాక రికార్డ్ సబ్మిట్ చేసి అప్పుడు నాకు మళ్లీ వచ్చి చెప్పు’ అన్నారు. ఆ క్షణంలో ఆవిడ నాకు సినిమాల్లో మాదిరిగా అకస్మాత్తుగా దేవత ప్రత్యక్షమైనట్టుగా అనిపించింది. ‘లెటర్ ఇప్పుడే రాసి ఇస్తాను మేడమ్!’ అన్నాను గబగబా. ‘ఇంకా రాయలేదా? నిన్ననేగా చెప్పాను?’ అందామె అంతలోనే విసుగ్గా. ‘తొందరగా రాసిస్తాను మేడమ్!’ అంటూనే నా దగ్గరున్న లాంగ్నోట్ బుక్‌లోని జంట పేజీ చింపి అక్కడే ఉన్న బెంచీ మీద కూచొని గబగబా రిక్వెస్ట్ లెటర్ రాసాను.
రెండే నిముషాల్లో అది రాసినందుకో, తెలుగు మీడియం అయి ఉండి ఇంగ్లిష్‌లో తప్పుల్లేకుండా రాసినందుకో ఆమె కాస్త మెత్తబడి ‘ఓకె, అప్లికేషన్ ఇవ్వు, అదైనా ఫిల్ చేసావా, ఇప్పుడే నింపాలా?’ అన్నారు. ‘లేదు మేడమ్, రెడీగా ఉంది’ అంటూ నా దగ్గర తయారుగా ఉన్న అప్లికేషన్‌ను ఒకసారి సరిచూసుకుని ఇచ్చాను. ఆమె అందుకుని ఫొటోలు పెట్టానా, ఫీజు కట్టిన రసీదు ఉందా అని అన్నీ చూస్తుండగా ఆమె సీటు దగ్గరికి దేవకి మేడమ్ వచ్చారు. ఆవిడ ఆఫీసులో హెడ్ అని అందరూ అనేవారు. ‘ఏంటి సుమిత్రా, ఇంత లేటు చేస్తున్నావు? పద పద.. మళ్లీ బస్ వెళ్లిపోతే గంటసేపు నిలబడాలి!’ అని తొందరపెడుతూ నన్ను చూసి ‘ఏంటమ్మా, ఒక టైము అదీ ఏం లేదా?’ అన్నారు. నేను ఏమీ మాట్లాడకుండా ‘రమ మంచి బాలిక’ అన్నట్టు మౌనంగా నిలబడ్డాను. నిజానికి నా ఇమేజ్ కూడా అదే!
సుమిత్రా మేడమ్ తొందర తొందరగా టేబుల్ మీది పేపర్లన్నీ సర్ది డెస్క్‌లోకి తోసేసి బ్యాగు తీసుకుని పరిగెత్తినట్టుగా వెళ్లిపోతూ ఉండగా అంతకు ముందే ఆమె నాకిచ్చిన ఖాళీ అప్లికేషన్ ఫామ్ ఇవ్వబోతూ ‘మేడమ్! ఇది ఎక్స్ట్రా’ అన్నాను. ‘పర్లేదు, ఎక్స్ట్రానేగా? వదిలేయ్!’ అంటూ పరిగెత్తి వెళ్లిపోయారామె. ‘హమ్మయ్య! ఒక పనై పోయింది’ అనుకుంటూ ఇంటికెళ్లాను. ఆ మర్నాడే మా ఊరికెళ్లాను. ‘ఎందుకే.. ఊర్కే పోతున్నవు? మొదటేడు గింతగనం పోలే గద! రైలు చార్జీలు అయితలేవా? ఆ రైలోణ్ని బతికిచ్చుడు కాకపోతె!’ అన్నారు నాయనమ్మ. గోపిక చిన్నమ్మకు అంతకుముందే చెప్పాను కనుక ‘తన రికార్డు కోసం ఆకులేవో తెచ్చుకుంటదట అత్తయ్యా!’ అని చెప్పింది. ‘మరి దీని తోటి చదువుకునేటోండ్లందరు ఏ ఊర్లకు పోతరు? ఇక్కడ్నే చూసుకోరాదా? పండ్లూడకొట్టుకోను పర్వతం పోయినట్టు! ఎమ్మో, ఏం పిల్లలో!’ అన్నారు. నేను మౌనంగా వున్నాను. నాయనమ్మ చెప్పింది మంచిదే, నా కోసమే కూడా. కానీ, ఈ వంకతో ఓసారి అమ్మానాన్నల్ని చూసిరావాలని నా ఆరాటం. సికింద్రాబాద్ వచ్చి రైలెక్కాను.
రెండ్రోజులు అనుకున్నదాన్ని వారం రోజులున్నాను. నిజానికి నా బోటనీ రికార్డు పని ఒక్కరోజులో పూర్తయింది. కానీ, అమ్మకు బాగా జ్వరం. చూస్తూ వెళ్లలేకపోయాను. ‘ఏం గాదు. అదే తక్వైతది. నువ్వు పో బిడ్డా!’ అన్నది అమ్మ. అమ్మకు మధ్య మధ్య జ్వరం వస్తున్నదని నానమ్మ చెప్పింది. అమ్మేమో ఏమీ చెప్పదు, మౌనంగా భరిస్తుంది. బోలెడు పనిచేస్తుంది కూడా. మరి, నాన్న పట్టించుకున్నట్టు కనిపించలేదు. అమ్మ మామూలుగా తిరుగుతూ ఉంటే తనకు బాగానే ఉందనుకుంటాడేమో. ఏమీ అర్థం కాలేదు. మరింత దిగులుగా హైదరాబాదు రైలెక్కాను ఈసారి.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి