మ్యాజిక్ సంగీతానికి మేఘాలు వర్షిస్తాయి, రాళ్లు కరుగుతాయి, ప్రకృతి పరవశిస్తుంది. అలాంటి సంగీతానికి మనసులో బాధలను మాత్రమే కాదు.. శరీరానికి కలిగిన రుగ్మతలనూ రూపుమాపే శక్తి ఉందని అనేక పరిశోధనలు తేల్చాయి. అందుకే, కార్పొరేట్ దవాఖానలు కూడా మ్యూజిక్ థెరపీని చికిత్సలో భాగం చేశాయి. శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించడం ద్వారా రోగిలో ఒత్తిడి తగ్గుతుందనీ, చికిత్స వేగంగా పనిచేస్తుందని సర్వేలు చెబుతున్నాయి.
చాలా దేశాల్లో మ్యూజిక్ థెరపిస్ట్‌లు కనిపిస్తారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న రోగులకు సంగీతంతో వైద్యం చేస్తారు. మనోవ్యాధికి మందు లేదంటారు! కానీ, ఏ ఔషధానికీ కొరుకుడుపడని మనో క్లేశమైనా సంగీతంతో సద్దుమణుగుతుంది. అందుకు కారణం సంగీతం విన్నప్పుడు ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదలై సంతోషాన్ని కలిగిస్తాయి. బాధను ఆమడదూరం పారదోలుతాయి. సంగీతం వినడం, పాటలు పాడటం వల్ల మెదడులో సెరటోనిన్ స్థాయులు కూడా పెరిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు, ఇది క్లిష్ట పరిస్థితుల్లో అనుకూలతను అందించడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుస్తుంది. అలాగే వృద్ధుల్లో కనిపించే డిమెన్షియా లేదా అల్జీమర్స్ సమస్యను మ్యూజిక్ కట్టడి చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
మెదడు పనితీరును మెరుగుపరచడంలో సంగీతం ముఖ్య పాత్ర పోషిస్తుందని న్యూరోసైన్స్ పరిశోధకులు తేల్చారు. మ్యూజిక్ ట్రైనింగ్ వల్ల కాగ్నిటివ్ ఫంక్షన్స్ అయిన జ్ఞాపకశక్తి, అభ్యసన సామర్థ్యం మెరుగుపడుతాయని పరిశోధనల సారాంశం. అంతేకాదు హృద్రోగ బాధితులు హృద్యమైన గీతాలు వింటే గుండె లయ శ్రుతిలో సాగుతుందని వైద్యుల మాట.
మ్యూజిక్ వినడం వల్ల టీనేజర్లలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఆ వయసులో వారిలో కలిగే రకరకాల ఒత్తిళ్లకు మ్యూజిక్ మంచి ఊరటనిస్తుంది. గంగ పొంగులా సాగిపోయే సంగతులు… మనసు పొరల్లో మరుపునకు గురైన సంగతులనూ తట్టిలేపుతాయి. అలాగే మనసుకు నచ్చిన పాటలు పదే పదే వినడం వల్ల.. గతంలో మర్చిపోయిన సంఘటనలు కూడా మది ఫలకంపై కదలాడుతాయట. రోజూ శ్రావ్యమైన సంగీతం వినడం వల్ల… విద్యార్థుల్లో గ్రహణ శక్తి పెరుగుతుంది.
మనసుకైన గాయాల నుంచి బయటపడాలంటే సంగీతమే మంచి ఔషధం. అందుకే తరచూ సంగీత కచేరీలకు వెళ్లడం వల్ల మానసిక సమస్యలు చాలావరకు తగ్గుతాయి. అక్కడి ఉల్లాసవంతమైన వాతావరణం రోగుల్లో మంచి మార్పును తీసుకువస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయం కూడా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
అభిరుచి ఉన్న పెద్దలకే కాదు… ఏ రాగం తెలియని శిశువులనూ సంగీతం అలరిస్తుంది. అమ్మలాలి పాటతో బుజ్జాయిలు బజ్జోవడం లేదా! బడి వయసు పిల్లలు రోజూ మంచి సంగీతం వింటే… వాళ్లు చలాకీగా తయారవుతారట. హోంవర్క్, పరీక్షల ఒత్తిడిని తేలిగ్గా జయించగలుగుతారట. అందుకే, పుస్తకాలతో కుస్తీ పడుతున్న పిల్లలు రోజూ కాసేపు మంచి సంగీతం వినేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.
అప్పుడప్పుడూ శాస్త్రీయ సంగీత కచేరీలకు తీసుకెళ్తూ ఉండాలి.