‘సార్.. మా అన్నయ్య ప్రణయ్‌ను లక్కీ చంపేశాడు’ కంట్లోంచి వస్తున్న నీటిని తుడుచుకొంటూ చెప్పింది ప్రియ. అప్పుడే తన క్యాబిన్లో లంచ్ చేస్తున్న ఇన్స్పెక్టర్ రుద్ర.. తినడం ఆపేసి అర్థం కానట్టు ఆమె వైపు చూశాడు. ఏమైందంటూ ప్రియను అడిగాడు. దీంతో ఆమె ఇలా చెప్తూ పోయింది.
‘సార్.. నా పేరు ప్రియ. ఎమ్మెల్యే గురుమూర్తి అబ్బాయి లక్కీ, నేను ఏడాదిగా ప్రేమించుకొంటున్నాం. అయితే, లక్కీ మంచివాడు కాదని మా అన్నయ్య ప్రణయ్ అడ్డు చెప్పాడు. దీంతో ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకొందామని డిసైడ్ అయ్యాం. ఈరోజు అన్నయ్య బయటికి వెళ్లగానే, మా ప్లాన్ ప్రకారం నేను లక్కీ గెస్ట్‌హౌజ్‌కు వెళ్లా. అయితే, అక్కడే అతని నిజస్వరూపం ఏంటో నాకు అర్థమయ్యింది. అతను నన్ను బలాత్కారం చేయబోయాడు. ఇంతలో మా అన్నయ్య అక్కడికి వచ్చి నన్ను కాపాడాడు. ఈక్రమంలో అన్నయ్యకు, లక్కీకి పోట్లాట జరిగింది. అన్నయ్యను పొడిచిన లక్కీ అక్కణ్నునుంచి పరారయ్యాడు’ అంటూ ఏడుస్తూ కుర్చీలో కూలబడింది ప్రియ.
‘ఏడాదిగా ప్రేమించుకొంటే, ఎన్నడూ బలాత్కారం చేయని లక్కీ.. ఈరోజే ఎందుకు చేసినట్టు?’, ‘మీరిద్దరు గెస్ట్‌హౌజ్‌లో ఉన్నట్టు మీ అన్నయ్యకు ఎవరు చెప్పారు?’.. ఇలాంటి ప్రశ్నలు అటు రుద్రకు, ఇటు రామస్వామికి ఒకేసారి వచ్చాయి. దీంతో ఈ కేసు సంగతేంటో తేలుద్దామని ప్రియతో కలిసి లక్కీ గెస్ట్‌హౌజ్‌కు వెళ్లారు. పెనుగులాట జరిగిన గదిలోకి ఇద్దరినీ తీసుకెళ్లింది ప్రియ. అక్కడ అలాంటి పెనుగులాట జరిగినట్టు ఎలాంటి ఆనవాళ్లు లేవు. పనివాళ్లను అడిగితే, ఆ రోజు ఎవరూ అక్కడికి రాలేదన్నారు.
సీసీటీవీ ఫుటేజీలో కూడా అలాంటిదేమీ రికార్డు కాలేదు. దీంతో ప్రియ చెప్తున్నదంతా అబద్ధమని ప్రాథమికంగా అంచనాకు వచ్చిన రుద్ర టీమ్.. ఎందుకైనా మంచిదని ప్రణయ్ గురించి వాకబు చేయడానికి ప్రియ ఇంటికి వెళ్లారు. చుట్టుపక్కల వాళ్లను అడిగారు. ప్రణయ్, ప్రియ అన్నాచెల్లెళ్లు అని చెప్పిన ఇరుగుపొరుగు వారు.. లక్కీతో ప్రియ సన్నిహితంగా ఉండేదని, అయితే అది ప్రణయ్‌కు నచ్చేదికాదని కూడా చెప్పారు. పొద్దున్నే ప్రణయ్‌ను చూశామని కూడా చెప్పారు.
‘ప్రణయ్, ప్రియ ఎలా ఉండేవారు?’ రామస్వామి అడిగిన ప్రశ్నకు.. ‘పేరుకే అన్నాచెల్లెళ్లు గానీ.. వాళ్లకు ఎప్పుడూ పడేది కాదు. అన్నయ్య అంటే ప్రియకు అసలు గౌరవమే ఉండేది కాదు. అమ్మానాన్నలలాగే నువ్వు చనిపోతే, బాగుంటుంది. అప్పుడు ఈ లోకంలో నాకు అడ్డు చెప్పేవారు ఎవరూ ఉండరు’ అని ప్రియ ఎప్పుడూ ప్రణయ్‌పై అరుస్తూ ఉండేదని చెప్పారు. దీంతో ప్రణయ్‌ను ప్రియనే ఏదో చేసి ఆ నెపాన్ని లక్కీపై నెట్టాలని అనుకుంటున్నట్టు రుద్రకు, రామస్వామికి అర్థమైంది.
కేసులో లక్కీ పేరు రావడంతో ఎమ్మెల్యే గురుమూర్తి ఇంటికి వెళ్లి ఒకసారి లక్కీ స్టేట్మెంట్ తీసుకోవాలని రుద్ర నిర్ణయించుకొన్నాడు. రామస్వామి, ప్రియతో కలిసి కారులో స్టార్ట్ అయ్యాడు. కారును బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10కి పోనీయమని డ్రైవర్‌కు చెప్పాడు. ఇంతలో.. ‘సార్..మెయిన్ రోడ్డు నుంచి వెళ్తే మసీదు వస్తుంది. ఆ పక్కనే గురుమూర్తి గారి ఇల్లు. అసలే నమాజ్ టైమ్ ఆ రోడ్డులో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంటుంది.
అందుకే డ్రైవర్‌ను వెనుక గల్లీ నుంచి వెళ్లమనండి సార్’ అంటూ రామస్వామి అనడంతో వెనుక గల్లీ నుంచి కారు వెళ్లింది. ఏదో ఫంక్షన్ జరుగుతుండటంతో గురుమూర్తి ఇల్లు బంధువులు, స్నేహితులతో హడావుడిగా ఉంది. ఇంట్లోకి వెళ్లి గురుమూర్తిని కలిసిన రుద్ర విషయమంతా చెప్పాడు. ఒక్కసారిగా ఆ హాల్ మొత్తం నిశ్శబ్దం. ‘ఏం ఇన్స్పెక్టర్ గారు. ఏం మాట్లాడుతున్నారు? మా అబ్బాయి హత్య చేశాడా?’ అంటూ నిలదీసినంత పనిచేశాడు గురుమూర్తి. ‘సార్.. అవి ఆరోపణలే. ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ అమ్మాయి పేరు ప్రియ. తన అన్నయ్యను మీ అబ్బాయి చంపాడని కంప్లయింట్ ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడికి వచ్చాం’ అంటూ రామస్వామి చెప్పాడు.
ఇంతలో అక్కడే ఉన్న లక్కీ కలుగజేసుకొన్నాడు. ‘ఇన్స్పెక్టర్ గారు. నేను లక్కీని. ఈ అమ్మాయి ప్రియ నా కాలేజీ ఫ్రెండ్. దీంతో కాస్త సన్నిహితంగా మెలిగా. ఆ మాత్రం దానికే ప్రేమిస్తున్నానంటూ నా వెంటపడింది. ఇష్టం లేదని చెప్పడంతో ఈ నాటకం ఆడుతున్నట్టు ఉంది. ఆమె డబ్బు పిచ్చిది. పాపం.. వాళ్ల అన్నయ్య గురించి కూడా ఎప్పుడూ నాతో తప్పుగానే మాట్లాడేది’ అంటూ చెప్పాడు లక్కీ. ‘యూ ఇడియట్.. ప్రేమ, దోమ అంటూ నన్ను నమ్మించి ఇంత మోసం చేస్తావా?’ అని లక్కీ కాలర్ పట్టుకొంది ప్రియ.
‘ఇన్స్పెక్టర్ గారు.. ఏమిటిది? ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన ఓ అమ్మాయి ఇలా మా అబ్బాయిని పట్టుకొని..’ అంటూ గురుమూర్తి ఏదో చెప్తూ పోయాడు. ఇంతలో కలుగజేసుకొన్న రామస్వామి.. ‘ఏమ్మా.. మీ అన్నయ్యను ఈ లక్కీ చంపాడంటున్నావ్. నువ్వు చెప్పిన ప్లేస్‌కు వెళ్తే అక్కడ ఏమీ జరగనట్టే ఉంది. నీ గురించి మీ పక్కింటివాళ్లే చెడుగా చెప్పారు. ఇక్కడేమో.. ఫంక్షన్ హడావుడిలో ఈ లక్కీ ఉన్నాడు. ఇక్కడున్న లక్కీ.. గెస్ట్‌హౌజ్‌లో మీ అన్నయ్యను ఎలా చంపుతాడమ్మా?’ అని రామస్వామి కసురుకున్నాడు.
‘నిజం సార్.. ఉదయం 11 గంటలకు లక్కీ మా అన్నయ్యను చంపాడు. అప్పుడు గెస్ట్‌హౌజ్‌లోని గడియారం కూడా గంట కొట్టింది. నాకు బాగా గుర్తు’ అంటూ బోరుమన్నది ప్రియ. దీంతో అక్కడ హాల్లో ఉన్న గురుమూర్తి బంధువులు, స్నేహితులు పెద్దపెట్టున నవ్వారు. ఆ గుంపులోంచి ఓ పెద్దాయన మాట్లాడుతూ.. ‘ఏయ్ అమ్మాయ్.. నీ కహానీలు సినిమా వాళ్లకు చెప్పు. మా లక్కీ బాబు 11 గంటలకు ఇక్కడే ఉన్నాడు. అప్పుడే కేక్ కట్ చేశాడు. మీకు ప్రూఫ్స్ కావాలంటే..’ అంటూ అక్కడే ఆ ఫంక్షన్‌ను రికార్డ్ చేస్తున్న వీడియోగ్రాఫర్‌ను పిలిచాడు ఆ పెద్దాయన. వీడియోను ప్లే చేయమన్నాడు. అందులో 11 గంటలకు లక్కీ కేక్ కట్ చేస్తున్నట్టు క్లియర్‌గా ఉంది. హాల్లోని గోడ గడియారం కూడా వీడియోలో అదే టైమ్‌ను చూయిస్తుంది.
వీడియో చూసిన రుద్ర, రామస్వామి అక్కడి వారికి సారీ చెప్పి ప్రియను కస్టడీలోకి తీసుకొని తిరిగి వస్తుండగా.. రుద్ర బుర్రలో ఏదో అనుమానం కలిగినట్లయింది. దీంతో వీడియోగ్రాఫర్‌తో వీడియోను మళ్లీ ప్లే చేయమన్నాడు. ఆ వీడియోలో కేక్ కట్ చేస్తున్న లక్కీతో గురుమూర్తి ఏదో చెప్తున్నట్టు అనిపించింది. దీంతో సౌండ్ పెంచమన్నాడు. సౌండ్ ఎంత పెంచినప్పటికీ.. బంధువుల చప్పట్లు, కోలాహలం, పక్కన మసీదు నుంచి వస్తున్న నమాజ్ శబ్దాలతో గురుమూర్తి ఏం చెప్తున్నాడో రుద్రకు అర్థంకాలేదు. ఇదే విషయమై ఎమ్మెల్యేని అడిగాడు.
దానికి ఆయన స్పందిస్తూ.. ‘ఏం ఇన్స్పెక్టర్ గారూ.. అది తెలుసుకొని ఏం చేస్తారు?? సరే.. అడిగారు కాబట్టి చెప్తున్నా.. హయ్యర్ స్టడీస్‌కి యూఎస్‌కి వెళ్తావా? యూకేకా? అని నా కొడుకుని అడిగా’ అంటూ గురుమూర్తి సమాధానమిచ్చాడు. ఒక చిరునవ్వు నవ్విన రుద్ర.. ‘సార్.. ప్రణయ్‌ను హత్య చేసినందుకు మీ అబ్బాయి అదే లక్కీని అరెస్ట్ చేస్తున్నాం. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు మీరు, మీ పరివారం కూడా స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది’ అంటూ లక్కీని బయటికి తీసుకెళ్లాడు రుద్ర. అసలేం జరుగుతుందో ప్రియకు, రామస్వామికి అర్థంకాలేదు. అయితే, తన కొడుకును ఇంత జాగ్రత్తగా కాపాడినా.. ఆ చిన్న పొరపాటుతో దొరికిపోయినందుకు గురుమూర్తి బాధపడ్డాడు. ఇంతకూ.. ప్రణయ్‌ను లక్కీనే హత్య చేశాడని రుద్ర ఎలా కనిపెట్టినట్టు??
…? రాజశేఖర్ కడవేర్గు