డ్యూయల్ సిమ్ ఫోన్లే కాదు.. డబుల్.. త్రిబుల్ సోషల్ మీడియా అకౌంట్లు.. వాడేస్తున్నారు. టైమ్ దొరికితే చాలు… స్వైప్ చేస్తూనే ఉంటారు.. లైక్‌లు కొడుతూనే ఉంటారు.. కామెంట్ల కంపోజింగ్ చూస్తే కళ్లు తిరగాల్సిందే.. అట్లుంటది మనోళ్ల సోషల్ మీడియా వాడకం. కానీ, ఎప్పుడో.. ఎక్కడినుంచో.. సింపుల్‌గా ‘Hi..’ అంటూ ఓ మెసేజ్ వస్తుంది. దానికి మీరు రిైప్లె ఇస్తారు. అది మొదలు.. వర్చువల్ వరల్డ్‌లో ఓ యూటర్న్ వస్తుంది. అక్కడ ఆగిపోకుండా.. ముందుకు వెళ్లారంటే ఊహించని ట్విస్టులు ఎదురవుతాయి. వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయంటే..
‘.. ఏంటి? ఇంతలా భయపెట్టేస్తున్నారు!!’ అని సందేహించొద్దు. ఇవే కాదు.. ఎంతో క్లిష్టమైన సమస్యలు సోషల్ లైఫ్‌లో చాలామందికి ఎదురవుతున్నాయి. తెలిసీ, తెలియక చేసిన చిన్నచిన్న తప్పిదాలు.. ఎన్నో సమస్యల్ని మోసుకొస్తున్నాయి. అందుకే… సోషల్ మీడియాలో ఠీవిగా, స్మార్ట్‌గా ముందుకు సాగాలంటే? ఇవిగో ఈ చిట్కాల్ని ఫాలో అయిపోండి. అప్పుడు మీరు సోషల్ లైఫ్‌లో డాక్టరేట్ సాధించినట్టే!
ఆన్లైన్ ఎఫైర్స్‌ని మేనేజ్ చేయడానికి కొన్ని పరిధుల్ని నిర్ణయించుకోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా.. అయినవారితో పంచుకోవాలే తప్ప ఆన్లైన్ పరిచయస్తులతో షేర్ చేయొద్దు. రియల్ లైఫ్‌లో ఫ్రెండ్ చెప్పే హాయ్.. వర్చువల్‌గా వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ఒకటి కాదని గుర్తుంచుకోండి.
రియల్ కాదుగా.. వర్చువల్ లైఫే కదా అని ఏది కనిపిస్తే దానికి వెంటనే స్పందించొద్దు. వెనకా ముందు ఆలోచించాలి. కనిపించిన కంటెంట్‌కి సంబంధించిన పూర్వాపరాల్ని పరిశీలించాలి. ఒకవేళ ఏదైనా సున్నితమైన అంశంగా అనిపిస్తే.. అంతే సెన్సిటివ్‌గా స్పందించాలి. సోషల్ మీడియాలో అభిప్రాయాల్ని చెప్పడం ఓ ఆర్ట్‌గా భావించాలి. అంతేకాదు.. ఎవరైనా ఏదైనా పోస్ట్ పెడితే దానిపై స్పందించడం వరకూ ఒకేగానీ.. చర్చ జరపడం మానుకోవాలి. నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడేందుకు మీరు ఊతంగా మారొద్దు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కంటెంట్‌ని వ్యక్తిగతంగా స్వీకరించడం మానుకోవాలి. అప్పుడే నెగెటివ్ ఆలోచనలు రాకుండా ఉంటాయి. కంటెంట్ ఏదైనా మంచి తీసుకుని చెడును పక్కకు పెట్టాలి. నోరు జారితే ఎలా వెనక్కి తీసుకోలేమో.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కంటెంట్ కూడా అంతే! ఒక్కసారి పోస్ట్ చేశాక.. మన చేయి దాటి వెళ్లిపోతుంది. అందుకే రాసే భాషపైనే కాదు.. ఫొటోలు.. వీడియోలనూ నిశితంగా పరిశీలించి పోస్ట్ చేయండి. అప్పుడే మీరు ట్రోలర్స్ బారిన పడకుండా ఉంటారు.
అభిప్రాయాల్ని పంచుకోవడానికే సోషల్ వీడియా వేదికల్ని ఎంచుకుంటాం. పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటాం. ఈ క్రమంలో కొన్నిసార్లు అర్థవంతమైన చర్చలు జరగొచ్చు. ఇంకొన్ని సార్లు గాలివాటంగా మారొచ్చు. అలాంటి సందర్భాల్లో చర్చ నుంచి తెలివిగా పక్కకు జరగడం మంచిది. మన వ్యూ పాయింట్స్‌ని బలం చెప్పాలి. మరో విషయం ఏంటంటే.. ఏదైనా అంశంపై అందరూ రెస్పాండ్ అవుతున్నారని మీరూ స్పందించొద్దు. మీకు తెలిస్తేనే దానిపై మాట్లాడండి. గుర్తుంచుకోండి.. మీ స్పందన మరో నలుగురిని ఆలోచింపజేసేలా ఉండాలి. అప్పుడే మీ ఫ్రొఫైల్‌కి ఫాలోవర్స్, ఫ్యాన్స్ పెరుగుతారు. ఇంకో విషయం ఏంటంటే.. మూడ్ బాగోకపోతే సోషల్ మీడియా వైపు వెళ్లకండి. డిప్రెషన్లో ఉన్నప్పుడు మీరు చేసే పోస్టులు భవిష్యత్తులో చిక్కులు తేవచ్చు.
ఇంట్లో ఫ్యామిలీ సభ్యుల్ని దాటుకుని సోషల్ మీడియా సభ్యుల్ని కూడగట్టుకుంటున్నాం. పేరు, ఫొటో, ఫ్రొఫైల్ తప్ప మరే ఇతర ప్రూఫ్‌లు లేకుండానే ఫ్రెండ్స్‌ను నెట్‌వర్క్‌గా పెట్టుకుంటున్నాం. రోజంతా ఎన్నో విషయాల్ని పోస్ట్ చేస్తూ పంచుకుంటున్నాం. ఈ క్రమంలోనే కొన్నిసార్లు వ్యక్తిగతమైనవి కూడా షేర్ చేసుకుంటుంటారు. వాటిని ఆసరాగా చేసుకుని జరుగుతున్న మోసాలు ఎన్నో. అందుకే ఈ ఆన్లైన్ ఎఫైర్స్‌ని మేనేజ్ చేయడానికి కొన్ని పరిధుల్ని నిర్ణయించుకోవాలి. ఎన్ని సమస్యలు వచ్చినా.. అయినవారితో పంచుకోవాలే తప్ప ఆన్లైన్ పరిచయస్తులతో షేర్ చేసుకోవద్దు. రియల్ లైఫ్‌లో ఫ్రెండ్ చెప్పే హాయ్.. వర్చువల్‌గా వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ఒకటి కాదని గుర్తుంచుకోండి. ఒంటరిగా అనిపిస్తే సోషల్ మీడియా వైపు చూడొద్దు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లండి. ఎందుకంటే.. ఒంటరిగా ఉన్నప్పుడు తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో చేసే వీడియో చాట్లు, పోస్టు చేసే ఫొటోలు, మాట్లాడే కాల్స్.. మీతోపాటు మీ కుటుంబానికీ ఇబ్బందులు తెచ్చిపెట్టొచ్చు.
మనకు ఏ కష్టం వచ్చినా.. కళ్లు కుటుంబం వైపే చూడాలి. వారి నుంచే బలం పొందాలి. ఒకవేళ ఇప్పటికే ఆన్లైన్ ఎఫైర్స్‌తో సతమతం అవుతున్నట్లయితే.. ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. నిపుణుల్ని సంప్రదించి సలహాలు, సూచనల్ని పాటించండి. సోషల్ మీడియా అనేది మనలోని కళాత్మక ఆలోచనలు పంచుకునే వేదిక మాత్రమే! అంతేకానీ కంట్రోల్ లేని లైఫ్‌ని లీడ్ చేయడానికి అవకాశంగా దాన్ని ఎంచుకోవద్దు. ఫ్రొఫైల్‌ని క్రియేట్ చేసుకున్నప్పుడే పరిధుల్ని రాసుకోవాలి. జీవిత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో సోషల్ మీడియాని ఓ సోర్స్‌గా వాడుకోవాలి. విలువైన కంటెంట్‌ని క్రియేట్ చేయాలి. ‘పవర్ ఆఫ్ డేటా’ అనే ఫార్ములా మర్చిపోకుండా సోషల్ లైఫ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగిపోవాలి.
– అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్