సోషల్ మీడియా వాడకం ఎంత పెరుగుతున్నదో ఇన్ఫ్లూయెన్సర్ల ప్రాధాన్యమూ అంతే ఎక్కువ అవుతున్నది. అందుకే హురూన్ ఇండియా-కాండేర్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న 97 మంది మహిళల జాబితాలో వీళ్లకూ స్థానం దక్కింది. ‘ఇండియా ఉమెన్ లీడర్స్ లిస్ట్ 2025’ పేరిట విడుదల చేసిన ఈ లిస్టులో హెచ్‌సీఎల్ సంస్థకు అధిపతి రోషిణి నాడార్, జోహో సహ వ్యవస్థాపకురాలు రాధావెంబు సహా ఎందరో పేరెన్నికగన్న మహిళామణులు ఉన్నారు. వీళ్లలో అతిపిన్న వయస్కురాలు… బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్, ఆంత్రప్రెన్యూర్ అయిన మృణాల్ పాంచాల్. దీంతో ఆమె ఎవరు, ఏం చేస్తుంటుంది లాంటి విషయాల మీద ఆసక్తి నెలకొంది.
మృణాల్ పాంచాల్… సౌందర్య ఉత్పత్తులను జనానికి పరిచయం చేస్తూ ఫాలోయర్లను సంపాదించుకున్న సోషల్ ఇన్ఫ్లూయెన్సర్. ఆమె వయసు 26 సంవత్సరాలు. తన ఇన్స్టాగ్రామ్ పేజీ ‘మృణు’కి ఏకంగా 55 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆమెకు అందంగా ముస్తాబవడం ఎంతో ఇష్టం. రకరకాల ఉత్పత్తులను ఎలా వాడి ఎలాంటి లుక్‌లో కనిపించొచ్చు అన్నది బాగా తెలుసు. మేకప్ అంటే బాగా ఇష్టపడే చాలామంది ఆడపిల్లల్లాంటిదే అయినా, మృణాల్ దానిమీద పట్టు సాధించింది. మేకప్ వేసుకునేప్పుడు పాటించాల్సిన టిప్స్‌ను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకునేది. అవి వైరల్ అవడంతో చాలామంది ఫాలోయర్లుగా మారారు.
ఇలా కాస్మెటిక్స్ వాడకం పట్ల తనకున్న అనుభవం, అవగాహనలను ఉపయోగించుకొని మృణాల్ సొంతంగా ‘మృచ’ పేరిట 2024లో బ్యూటీ ప్రొడక్ట్‌లు తయారుచేసే సంస్థను ప్రారంభించింది. తన కస్టమర్లకు సరసమైన ధరల్లో మంచి ఉత్పత్తులను అందించే ఉద్దేశంతో దీన్ని మొదలుపెట్టానని చెబుతుందామె. తొలుత ఈ బ్రాండ్‌తో గ్లో అప్ పేరిట లిప్ కలెక్షన్ తీసుకొచ్చింది. తర్వాత బ్లష్‌లు ఇతర ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది.
కేవలం అయిదు నెలల్లోనే 2 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయంటే సోషల్ మీడియాలో ఆమె ఇన్ఫ్లూయెన్స్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జెన్ జెడ్‌ను ఆకర్షించేలా, విభిన్నమైన వర్ణాల్లో లిప్‌స్టిక్‌లు, లిప్బామ్లలాంటి వాటిని తీసుకురావడంలో మృణాల్ విజయం సాధించింది. అన్ని శరీర వర్ణాలకూ, వివిధ అభిరుచులకు సరిపడేలా వీటిని తయారు చేయడమూ ఇవి జనాన్ని ఆకర్షించడానికి ఒక కారణం అని చెబుతుందామె. ఇక పాండ్స్, మెబిలీన్, లోరియల్ ప్యారిస్, నివ్యాలాంటి వివిధ బ్రాండ్లతోనూ కలిసి పనిచేస్తున్నది మృణాల్. ప్యాషన్ విత్ పర్పస్‌కు… అదే మనకున్న ప్యాషన్‌ను ఒక ఉత్పాదకత కలిగిన పనిలా మార్చడానికి మృణాల్ మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు కదూ!