దైనందిన జీవితంలో సత్యం అనిపించిన ఎన్నో విషయాలు ఆర్థిక సూత్రాల్లో అంతగా ఇమడవు! ఓ మధ్యతరగతి మనిషికి పొదుపు అంటే… ఖర్చులు తగ్గించుకోవడం వరకే ఆలోచిస్తాడు. మదుపు అంటే ప్రైవేటుగా చిట్స్ వేసి.. ధర్మవడ్డీకి తిప్పడమనే తెలుసు!! ముచ్చటపడి కట్టుకున్న ఇంట్లో మురిపెంగా ఉండాలని ఉన్నా.. ఇంకేదో ఆశిస్తాడు. రూపాయి, రూపాయి కూడబెట్టి ఇల్లు మీద ఇల్లు కట్టి.. యజమానిగా చెలామణీ కావాలని ఆశిస్తాడు. ఈ రకంగా ఆలోచించిన ఎందరో.. యజమానులుగా కన్నా, జీతం భత్యం లేని వాచ్మెన్లుగా మిగిలిపోతున్నారు.
ఏ పెట్టుబడి అయినా మనల్ని ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదై ఉండాలి. కానీ, ఆ పెట్టుబడే గుదిబండగా మారితే.. ఆశించిన లాభాలు రావు సరికదా, తలకు మించిన భారంగా పరిణమిస్తుంది. నడివయసులోనే సొంతింటి కలను నిజం చేసుకున్న వారు నిజంగా అదృష్టవంతులే! దానికి తృప్తిచెంది.. ఇతర పెట్టుబడుల గురించి ఆలోచిస్తే మేలైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. కానీ, చాలామంది మూసపద్ధతికి అలవాటుపడినవాళ్లే ఉంటారు. వాళ్లు చేసే తప్పులు ఎలా ఉంటాయో పరశురామ్ కథ చదివితే అర్థమవుతుంది.
పరశురామ్ ప్రైవేట్ ఉద్యోగి. మంచి జీతం వస్తుంది. ఊళ్లో కొద్దోగొప్పో ఆస్తి ఉంది. భార్య, ఇద్దరు పిల్లలు. జీవితం ఉన్నంతలో రిచ్‌గానే సాగిపోతుంది. పిల్లలు బడి వయసు దాటి కాలేజీలోకి ప్రవేశించారు. ఒకరోజు పరశురామ్ అత్తామామ ఊడిపడ్డారు. అత్తగారేమో తన కూతురుతో వంటింట్లో సొంతిళ్లు సొద మొదలుపెట్టింది. మామగారేమో అల్లుడితో అదే విషయాన్ని తన అనుభవాన్నంతా రంగరించి చెప్పనారంభించాడు. ‘అల్లుడుగారూ! కూడబెట్టిన సొమ్ముతో మంచి స్థలం తీసుకోండి. మంచి బిల్డర్‌కు ఇచ్చి లోను మీద ఇల్లు కట్టుకోవచ్చు. మూడంతస్తులు వేసి.. పై పోర్షన్లో మీరు ఉండి, మిగతావి అద్దెకిస్తే.. తిని కూర్చోవచ్చు! ఏమంటారు?’ అన్నాడు. మామగారి ఆలోచన సబబుగానే తోచింది పరశురామ్‌కు. తల్లి బోధతో అతని భార్య కూడా ఆలోచించండి అన్నట్టుగా చూసింది.
ఇల్లు కట్టాలని ఫిక్సయిన పరశురామ్ అప్పటి వరకు తను కూడబెట్టుకున్న డబ్బంతా వెలికితీశాడు. ఈపీఎఫ్‌లో ఉన్న మొత్తాన్ని తీసుకున్నాడు. కొంత బంగారం కుదువపెట్టాడు. వెంచర్లో చిన్న స్థలాన్ని అమ్మేసి రూ.కోటి సర్దుబాటు చేసుకున్నాడు. ఆ మొత్తంతో నగర శివారులో 220 గజాల స్థలం కొన్నాడు. బిల్డర్‌ను సంప్రదిస్తే మరో కోటితో జీ+2తోపాటు పైన పెంట్‌హౌజ్ నిర్మించేలా ఒప్పందం చేసుకున్నాడు. బ్యాంకులో రూ.1.20 కోట్లు గృహరుణం తీసుకున్నాడు. అప్పటికే 45 ఏండ్లు ఉండటంతో, లోను టెన్యూర్ 15 ఏండ్లు పెట్టుకున్నాడు. ఈఎమ్ఐ రూ.1.20 లక్షలుగా ఫిక్సయింది. అంటే అతని జీతంలో సగం వాయిదాకు చెల్లించాలని ఫిక్సయ్యాడు! ఇల్లు పూర్తయింది. ఆరు పోర్షన్లు అద్దెకిస్తే నెల తిరిగేసరికి రూ.60వేలు వసూలు అవుతున్నాయి.
పరశురామ్ ఆనందానికి అవధుల్లేవ్. మూడు నెలలు గడిచాయో లేదో.. అద్దెదారులు పరస్పరం గొడవలకు దిగడం, తీర్పు కోసం పరశురామ్ తలుపు తట్టడం కామన్ అయిపోయింది. తప్పు చేసిన వారిని ఇల్లు ఖాళీ చేయించడమో, అలా చేయలేకపోతే తమదే ఒప్పు అనుకున్న వాళ్లు మరో ఇంటికి మకాం మార్చడమో జరుగుతూ వచ్చింది. ఆరు పోర్షన్లలో ఎప్పుడూ రెండు ఖాళీగానే ఉంటున్నాయి. ఇది చాలదన్నట్టు.. నీళ్లు రావడం లేదనీ, కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తున్నదనీ, మంచి నీళ్లు పైకి వచ్చేలా ఏర్పాటు చేయమనీ, వాష్‌రూమ్‌లో నీళ్లు పోవడం లేదనీ.. ఇలా రోజుకో ఫిర్యాదు రావడం మొదలైంది. వాళ్ల కోరికలు మన్నించలేక, ఫిర్యాదులు పరిష్కరించలేక.. పరశురామ్‌కు సొంతింట్లో ఉంటున్న ఆనందం రెండేండ్లకే ఆవిరైంది. అప్పటి వరకు తన దగ్గర ఉన్నదంతా ఊడ్చిపెట్టి, బ్యాంకు లోను తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. రిటైర్ అయ్యాక అద్దెల ద్వారా వచ్చే ఆదాయంతో బతుకు వెళ్లదీయొచ్చు అని భావించాడు. కానీ, వెలకట్టలేని మనశ్శాంతిని దూరం చేసుకున్నాడు. పైగా, బీపీ షుగర్ లెవల్స్ పెరిగాయి.
ఆరోగ్యం నిదానంగా దెబ్బతినడం మొదలైంది. ఈఎమ్ఐ భారంతో పిల్లల పైచదువులప్పుడు పూర్తి స్థాయిలో అండగా నిలవలేకపోయాడు. స్పష్టంగా చెప్పాలంటే.. రెండు కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసిన యజమాని కాస్త ఆ ఇంటికి వాచ్‌మ్యాన్‌గా మారిపోయాడు.
ఇప్పుడు మీరు ఆలోచించండి.. రూ.2.20 కోట్ల పెట్టుబడి పెట్టి.. ఇల్లు తీసుకున్న వ్యక్తి దర్జాగా బతక్కుండా, ఇలా నీరుగారిపోవడాన్ని ఏ ఆర్థిక సూత్రం మాత్రం ఆమోదిస్తుంది. ఇదే పరశురామ్ రూ.కోటితో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్గానీ, అదే నగర శివారులో డూప్లెక్స్ ఇల్లు గానీ తీసుకుంటే.. ‘అనుభవించు రాజా!’ అని పాడుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేసేవాడు. తానొకటి తలస్తే విధి మరొకటి తలచింది. శాశ్వత ఆదాయం మాయలోపడి జీవితంలో ప్రశాంతతకు దూరం అయ్యాడు.
అప్పటి వరకు తన దగ్గర ఉన్నదంతా ఊడ్చిపెట్టి, బ్యాంకు లోను తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. రిటైర్ అయ్యాక అద్దెల ద్వారా వచ్చే ఆదాయంతో బతుకు వెళ్లదీయొచ్చు అని భావించాడు. కానీ, వెలకట్టలేని మనశ్శాంతిని దూరం చేసుకున్నాడు. పైగా, బీపీ షుగర్ లెవల్స్ పెరిగాయి. ఆరోగ్యం నిదానంగా దెబ్బతినడం మొదలైంది. ఈఎమ్ఐ భారంతో పిల్లల పైచదువులప్పుడు పూర్తి స్థాయిలో అండగా నిలవలేకపోయాడు.
– ఎం. రాం ప్రసాద్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in
www.rpwealth.in