ఆయనగారికి.. కారు తాళాలు ఎక్కడ ఉంటాయో తెలియదు. కళ్లద్దాల కోసం ఇల్లంతా వెతుకుతారు. ఇంట్లో ఏ వస్తువు కనిపించక పోయినా.. శ్రీమతిపైనే చిర్రుబుర్రులాడుతారు. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణం. ‘ఈయన మతిపరుపుతో వేగలేక పోతున్నా!’ అని ఆవిడగారు అనడం కూడా వింటూనే ఉంటాం. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా అదే విషయం చెబుతున్నారు. ఆడవాళ్లతో పోలిస్తే.. మగవారిలో జ్ఞాపకశక్తి పాళ్లు కాస్త తక్కువగా ఉంటాయట.
ముఖ్యంగా.. ఇంట్లో వస్తువుల స్థానాలను గుర్తించుకోవడంలో పురుషులు పట్టు చిక్కడం లేదట. అనేక అధ్యయనాల తర్వాత.. శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. మహిళలు వస్తువుల స్థానాలను, ల్యాండ్ మార్క్‌లను, చూసిన దృశ్యాలను గుర్తించుకోవడంలో పురుషుల కన్నా ముందంజలో ఉన్నారని తేల్చారు. ముఖ్యంగా.. వంటగది, అల్మారా లాంటి సుపరిచితమైన ప్రదేశాల్లో వస్తువులను గుర్తించడంలో మహిళలు చురుగ్గా ఉంటారట.
అదే సమయంలో.. చిన్నచిన్న వివరాలను గ్రహించడంలో, కదిలే వస్తువులను ట్రాక్ చేయడంలో పురుషులు మెరుగ్గా ఉంటారట. స్త్రీలలో రంగుల్లో ఉండే సూక్ష్మ వైవిధ్యాలను కూడా స్పష్టంగా వేరు చేయగల సామర్థ్యం ఎక్కువట. హార్మోన్లలో వైవిధ్యాలు, ఇతర కారణాలే.. ఈ తేడాలను ప్రభావితం చేస్తాయని అధ్యయనకారులు అంటున్నారు.