వ్యవసాయ కూలీగా బతకడం ఆమెకు ఇష్టం లేదు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. తనదైన ప్రతిభను నిరూ పించుకోవాలి. అదే ఆమె తపన. తన భర్త లానే తాను కూడా సంప్రదాయమైన నకాషీ (చేర్యాల చిత్రకళ)లో అడుగు
పెట్టింది. చేతివృత్తులకు కాలం చెల్లుతున్న తరుణంలో… వైవిధ్యమైన కళా ప్రతిభతో నైపుణ్యాన్ని సాధించింది. అక్కడితోఆగిపోకుండా, కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ఆంత్రప్రెన్యూర్‌షిప్ వేదిక.. వీహబ్ సాక్షిగా తనలోని కళాకారిణికి తుది మెరుగులు దిద్దుకున్నది. ఆ ఆత్మవిశ్వాసంతోనే రైతుకూలీగా మారాల్సిన పరిస్థితి నుంచి.. ఇరవై మందికి ఉపాధినిస్తూ కళా వ్యాపారిగా రాణిస్తున్న పశుల మంగ స్టార్టప్ స్టోరీ ఈ వారం..
‘కూలి పని చేయనుగాక చేయను. కళాకారిణిగా పెద్ద పేరు తెచ్చుకుంటాను.ఆ సంపాదనతోనే నా కుటుంబాన్ని పోషిస్తాను’.. అని ప్రతిన పూనింది ఓ మంగమ్మ. ఎవరా మంగమ్మ? ఏమిటా శపథం అంటారా? అయితే, చదవండి. అదొక గెలుపు గాథ.
చేర్యాల చేతివృత్తులకు అంతర్జాతీయంగా ఆదరణ ఉంది. కానీ ఆ ప్రాచీన కళపై ఆధారపడుతున్న వారి జీవితాలకు మాత్రం భరోసా లేకుండా పోయింది. ఆ పరిస్థితుల్లో కూడా తాతముత్తాతల నాటి పనితనం తప్పించి, మరో పని తెలియని భర్త
మల్లేష్‌కు చేదోడుగా నిలవాలని భావించింది పశుల మంగ. మొగుడి సహకారంతో నకాషీ చిత్రకారుడు వెంకయ్య కుటుంబం వద్ద శిక్షణ పొందింది.
తనకు ఏ మాత్రం సంబంధం లేని రంగుల రంగంలో అడుగుపెట్టింది. అనతి కాలంలోనే నైపుణ్యం సాధించింది. అంతటితో ఆగకుండా తనలాంటి మరో ఇరవై మందికి జీవనాధారం కల్పిస్తున్నది. కాలం గడిచేకొద్దీ మంగ ప్రతిభ హద్దులు దాటింది. దాంతోపాటు మార్కెట్ కూడా విస్తరించింది. ఆ రాబడి ఇద్దరు కూతుళ్ల చదువులకు పనికొచ్చింది. కుటుంబ నిర్వహణకు ఆసరాగా నిలిచింది.
వీహబ్ భరోసా
చేర్యాల కళాకృతులకు ప్రజల్లో గుర్తింపు ఉంది. కానీ, కస్టమర్ల వరకూ తీసుకెళ్లేందుకు బలమైన మార్కెట్ వ్యవస్థ లేక
పోవడం పెద్ద అవరోధం. ఎంతోమంది గ్రామీణ మహిళలను చిరు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించిన వీహబ్.. చేర్యాల కళ పునరుజ్జీవనంలో తనవంతు పాత్ర పోషించింది.
మంగకు మార్కెటింగ్ మెలకువలతోపాటు, బ్రాండింగ్, సమకాలీన డిజైన్ల ఎంపిక, తయారీలో ఆధునికత.. తదితర అంశాలు నేర్పింది. ఆ శిక్షణ తనకెంతో సాయపడిందని సంబురంగా చెబుతున్నది మంగ. గతంలో ఆమె నెలవారీ ఆదాయం పదివేల లోపే ఉండేది. వీహబ్ పుణ్యమాని రాబడితోపాటు కొనుగోళ్లూ పెరిగాయి.
సంప్రదాయ కళకు గుర్తింపు..
గతంలో చిత్రకళకు మాత్రమే పరిమితమైన చేర్యాల శైలికి సృజనాత్మకతను జోడించి కార్పొరేటైజ్ చేయడంతో మంగ వ్యాపారానికి విస్తృతమైన ఆదరణ లభించింది. కొత్తగా గణపతి, రాజారాణి, అర్ధనారీశ్వర, కాటమరాజు, గంగాదేవి, మల్లన్న బొమ్మలతోపాటుగా కీచైన్లు, వాల్ స్టిక్కర్లు, పెన్ స్టాండ్లు, ఫొటో ఫ్రేమ్‌లను కూడా తయారుచేస్తూ వ్యాపార పరిధిని పెంచుకున్నది మంగ. దీంతోపాటు కొత్త ఏడాది, దీపావళి తదితర సందర్భాల్లో కార్పొరేట్ సంస్థల నుంచి గిఫ్ట్ ఆర్టికల్స్ కోసం భారీ ఆర్డర్లు వస్తున్నాయి.
ఒకరిని చూసి ఒకరు ముందుకొస్తున్నారు. దీంతో చేర్యాల ప్రభ మరింత పెరిగింది. మెటీరియల్ కొనుగోలు, జీతభత్యాలు, వ్యాపార విస్తరణ ఖర్చులు పోగా మిగిలిన పైసలతో కుటుంబాన్ని సమర్థంగా పోషించుకునే వీలు కలిగింది. చేతినిండా ఆదాయం సమకూరింది. ప్రభుత్వం నుంచి మరింత పెట్టుబడి అందితే.. వ్యాపారాన్ని ఇంకొంత పెంచుకుంటామని ఆశగా అడుగుతున్నది మంగ.
ఆ పట్టుదలే ఉమెన్ లీడర్షిప్ అవార్డ్, నేషనల్ కల్చరల్ ఫెస్టివల్ అవార్డ్, జిల్లా, రాష్ట్ర స్థాయి ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డుతోపాటు వివిధ పురస్కారాలను, ప్రశంసలను తెచ్చి పెట్టింది. ‘నేను పడిన కష్టానికి వీహబ్ ప్రోత్సాహం తోడవడంతోనే ఇదంతా సాధ్యమైంది. ఆ వేదిక నా జీవితాన్ని మార్చింది. అంతరించిపోతున్న కళనూ బతికించింది’ అని చెబుతున్నప్పుడు ఆ చేర్యాల చిత్రకారిణి కళ్లల్లో ఆనంద బాష్పాలు. అవి మార్పు సంకేతాలు, ఆత్మవిశ్వాస ఆభరణాలు.
జీవితంలో కష్టాలు ఉంటాయి. అవరోధాలు ఎదురవుతాయి. సవాళ్లు మనల్ని నిలువరించే ప్రయత్నం చేస్తాయి. అయినా
ఆగిపోకూడదు. వెనుదిరగకూడదు. ఓటమిని అంగీకరించకూడదు. ఎదురుతిరగాలి. మనల్ని మనం సరికొత్తగా తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే, లక్ష్యాన్ని చేరుకుంటాం. కుటుంబాన్ని పోషించుకుంటాం. సమాజంలో గౌరవంగా నిలబడ
గలుగుతాం.
-పశుల మంగ
…? కడార్ల కిరణ్