స్ట్రక్చర్ బాగా కనిపించాలనీ, ఫ్యాషనబుల్ లుక్ ఉండాలని చాలా మంది బిగుతు దుస్తులకు ప్రాధాన్యం ఇస్తారు. కాసేపైతే ఫర్వాలేదు కానీ, ఒంటిని పట్టేసినట్టు ఉండే వస్ర్తాలు తరచూ ధరించడం అంటే రోగాలను కొనితెచ్చుకోవడమే అని చెబుతున్నారు వైద్యశాస్త్ర నిపుణులు. ఇలాంటి దుస్తులు ధరించడం వల్ల చర్మం రాపిడికి గురై కందడమే కాదు, ర్యాషెస్ వచ్చే ప్రమాదమూ ఉంటుంది. నరాలు ఒత్తిడికి గురవుతాయట.
దానివల్ల ఆ భాగం తిమ్మిరెక్కి మొద్దుబారినట్టుగా అవుతుంది. గుండె, పొట్ట భాగంలో టైట్‌గా ఉండే దుస్తులు వేసుకుంటే శ్వాస అందడమూ కష్టమవుతుంది. ఇది కొద్ది సమయం పాటు బిగుతు దుస్తులు ధరించేవారి సంగతి. అదే దీర్ఘకాలం పాటు మళ్లీ మళ్లీ ఇలాంటి వస్ర్తాలే వాడితే పొట్ట భాగంలో ఒత్తిడి కారణంగా ఎసిడిటీ, ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్ ఇతర జీర్ణ సంబంధిత సమస్యల బారినపడే అవకాశం ఉందంటున్నారు.
గజ్జల్లాంటి ప్రదేశాల్లో గాలి ఆడక ఈస్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడతారట. నరాల మీద దీర్ఘకాలం పాటు ఒత్తిడి కొనసాగితే ఆ ప్రాంతం మొద్దు బారడమే కాదు, ముందు ముందు తీవ్రమైన నొప్పికి కారణం అవుతుంది. తర్వాత వదులు దుస్తులు వేసుకున్నా సరే, ఇది తగ్గడం అన్నది కష్టంగా మారుతుంది. ఇక, రక్తప్రసరణ సరిగ్గా జరగకపోతే క్లాట్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. నడుము దగ్గర బిగుతైన బెల్టులు, బ్యాండ్లు ధరిస్తే నడుము, మెడ, కీళ్లు, కండరాలకు సంబంధించిన నొప్పులు వస్తాయి. ఊపిరి హాయిగా తీసుకోకపోవడం అన్నది ఎక్కువరోజులపాటు సాగితే ఎగ్జిమా, డెర్మటైటిస్లాంటి చర్మ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈసారి దుస్తులు ఎంచుకునేప్పుడు ఆరోగ్యకరమైన ఫ్యాషన్‌కే ఓటేయండి!