అందమైన పల్లెలు అనగానే.. యూరప్ దేశాలే గుర్తుకొస్తాయి. అక్కడి స్వచ్ఛమైన గ్రామాలే మదిలో మెదులుతాయి. అయితే, మనదేశంలోనూ అంతకుమించిన అందమైన పల్లెటూర్లు కనిపిస్తాయి. అంతెందుకు? ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం భారత్‌లోనే ఉన్నది. మేఘాలయలోని మావ్లిన్నోంగ్.. ఆ ఘనతను సొంతం చేసుకున్నది.
ప్రకృతి ప్రసాదించిన అందమైన నందనవనం. మేఘాలయలోని తూర్పు ఖాసీ కొండలలో కొలువుదీరిన ఈ చిన్న గ్రామం.. భారత్‌కే కాదు, ఆసియా ఖండానికే గర్వకారణం. 2003లో ‘డిస్కవర్ ఇండియా’ మ్యాగజైన్.. ఈ ఊరిని ‘ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం’గా ప్రకటించింది. దాంతో, ఈ మారుమూల పల్లె.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. పర్యాటకులకు స్వర్గధామంగా మారింది.

పరిశుభ్రత అనేది మావ్లిన్నోంగ్ ప్రజల జీవన విధానం. ఇక్కడ పిల్లల నుంచి వృద్ధుల వరకు.. ప్రతిఒక్కరూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో భాగస్వాములవుతారు. వీధులను, డ్రైనేజీలను గ్రామస్థులే స్వయంగా శుభ్రం చేసుకుంటారు. ఇక్కడి ప్రతి వీధిలోనూ వెదురుతో చేసిన బుట్టల్ని ఏర్పాటు చేశారు. రోడ్డుపై చిన్న కాగితం ముక్క కనిపించినా.. స్థానికులు వెంటనే తీసి అందులో వేస్తారు. అలా పోగైన చెత్తను గుంతల్లో వేసి సేంద్రియ ఎరువుగా మారుస్తారు. దానిని వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఇక ఇక్కడ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధం. అందుకే, మావ్లిన్నోంగ్ అంటే కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు. పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి, పరిశుభ్రతను ఎలా పాటించాలనే విషయాలపై ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే ఒక రోల్ మోడల్ కూడా!

మావ్లిన్నోంగ్ మరెన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏడాది పొడవునా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు, తోటలు, జలపాతాలతో ఒక దృశ్యకావ్యంలా కనిపిస్తుంది. గ్రామానికి సమీపంలో సహజసిద్ధమైన చెట్ల వంతెన ఉన్నది. ఇది మానవ శ్రమ, ప్రకృతి కలయికకు నిదర్శనంగా నిలుస్తోంది. వెదురు కర్రలతో దాదాపు 85 అడుగుల ఎత్తులో నిర్మించిన ‘స్కై వ్యూ టవర్’ మరో ఆకర్షణ. దీనిపైకి ఎక్కి చూస్తే చుట్టుపక్కల దట్టమైన అడవులతోపాటు సుదూరంలోని బంగ్లాదేశ్ మైదానాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాకుండా.. ప్రశాంతమైన వాతావరణంలో, పచ్చని చెట్ల మధ్య జాలువారే మావ్లిన్నోంగ్ జలపాతం.. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడి మరోవింత.. బ్యాలెన్సింగ్ రాక్! ఓ చిన్న రాయిపై మరో పెద్ద బండరాయి.. శతాబ్దాలుగా స్థిరంగా బ్యాలెన్స్ అవుతూ ఉండటం దీని విశేషం.

ఇక్కడ అత్యధికులు ‘ఖాసీ’ తెగకు చెందినవారు. వీరు ఇప్పటికీ మాతృస్వామ్య వ్యవస్థనే పాటిస్తారు. ఆస్తిపాస్తులు తల్లి నుంచి కూతురికి సంక్రమిస్తాయి. పిల్లలు తమ తల్లి ఇంటిపేరునే స్వీకరిస్తారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. పోకచెక్కలు, మిరియాలు, పైనాపిల్స్ వంటి పంటలను ఎక్కువగా పండిస్తారు. ఇక్కడి అక్షరాస్యత రేటు 100శాతం కావడం మరో విశేషం.

మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుంచి మావ్లిన్నోంగ్ సుమారు 90 కిలోమీటర్ల దూరం. దాదాపు అన్ని సమయాల్లోనూ ప్రైవేట్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. వర్షాకాలం తర్వాత (సెప్టెంబర్ నుంచి మే వరకు) ఈ గ్రామాన్ని సందర్శించడానికి అనువైన సమయం. ఈ కాలంలో ఇక్కడి ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. అయితే, మావ్లిన్నోంగ్లో పర్యాటకుల కోసం ఆధునిక హోటళ్లు లేవు. స్థానికులు తమ ఇళ్లలోనే ‘హోమ్‌స్టే’ వసతి కల్పిస్తారు. దీనివల్ల వారి సంస్కృతిని, సాంప్రదాయ ఆహారాన్ని దగ్గరగా పరిశీలించే అవకాశం కూడా దక్కుతుంది.