శ్రావణ మాసంలో కొత్తగా జట్టుకట్టిన జంటలు ఎన్నో! కొంగుముడి వేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న నూతన దంపతులకు జీవితంపై బోలెడన్ని అంచనాలు ఉంటాయి. తమ జీవన యానం ఆనందంగా సాగాలనీ, ఒకరికొకరు తోడుగా ఉండాలనీ భావిస్తూ ఉంటారు. ఆ ఆశలు పూర్తిస్థాయిలో నెరవేరాలంటే మాత్రం ఈ సూత్రాలు గుర్తుంచుకోండి..
కొత్తజంట మొదటి లక్ష్యం బంధాన్ని బలపరుచుకోవడమే కావాలి. అందుకు కొన్నాళ్ల సమయం పడుతుంది. మూడు నెలలు పట్టొచ్చు, ఆరు మసాలు కావొచ్చు, కొన్నిసార్లు ఏడాది దాటొచ్చు. ఒకరినొకరు త్వరగా అర్థం చేసుకోవాలంటే మీ మధ్య అపార్థాలకు ఏమాత్రం తావివ్వకూడదు. మీ భాగస్వామి ఉద్దేశాన్ని ముందుగానే ఊహించుకోవద్దు. సందేహాలు ఉంటే అడగడం తప్పు కాదు. అది సందేహ నివృత్తి కోసం అడిగినట్టు ఉండాలి కానీ, శల్యపరీక్ష కాకూడదు.
ప్రతిరోజూ ప్రశాంతంగా గడవాలని కోరుకోవాలి. అందుకోసం మీ భాగస్వామి నుంచి ఏం ఆశిస్తున్నారో.. వాళ్లకూ మీరు అదే అందించాలి. సంతోషాలనే కాదు, బాధ్యతలనూ గుర్తించడం అవసరం. అలకల వరకు ఓకే కానీ, గొడవలకు దారి తీయొద్దు. కోపతాపాలు పొడచూపినా.. మాటలకు కళ్లెం వేయద్దు. మౌనం పరిష్కారం కాకపోగా, మరో సమస్యకు దారితీయొచ్చు. అందుకే మనసారా మాట్లాడుకుంటూ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి.
భాగస్వామికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి. మీ ఆలోచనలు, ఆశయాలు వారితో పంచుకోండి. వారి సహకారం ఆశించండి. అదే సమయంలో వారి లక్ష్యాలేమిటో తెలుసుకోండి. ఆ లక్ష్యసాధనలో తన వెంట ఉంటానని నమ్మకంగా చెప్పండి. అప్పుడు ఇద్దరి మాట, బాట ఒకటవుతాయి. ఒంటరిగా డీల్ చేస్తే తేలికైన పని కూడా జటిలం అవుతుంది. జంటగా కష్టపడితే.. కష్టతరమైన పనికూడా తేలిక అవుతుందని మర్చిపోకండి.