నవతరం వివాహ బంధాలు బలహీనపడుతున్నాయి. ‘పెళ్లి’ జీవితకాల బంధమని భావించే జంటలు తగ్గిపోతున్నాయి. కొత్తగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న వారిలో.. ప్రేమ, స్థిరత్వం లాంటివి లోపిస్తున్నాయి. ముఖ్యంగా.. జెన్-జెడ్, మిలీనియల్స్‌లో కమ్యూనికేషన్ లేకపోవడం, నమ్మకం సన్నగిల్లడం లాంటి సమస్యలు పెరుగుతున్నాయి. అదే సమయంలో పరస్పర గౌరవం, భావోద్వేగపరమైన మద్దతు, విభేదాలను పరిష్కరించుకోవడంలోనూ కొత్త జంటలు విఫలం అవుతున్నాయి. వెరసి.. విడాకులు పెరుగుతున్నాయి. అయితే, ఇద్దరి మధ్యా ప్రేమపూర్వక వాతావరణం ఉంటే.. పెళ్లిళ్లు పెటాకులు కాకుండా ఉంటాయి. ఇందుకు నవ దంపతులు పాటించాల్సిన చిట్కాలు కొన్ని ఉన్నాయి.
శరీరంలోని వివిధ రకాల హార్మోన్లు.. మనుషుల భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంటాయి. అందులో ప్రముఖమైంది లవ్ హార్మోన్‌గా పిలిచే.. ఆక్సిటోసిన్. దీనికే ‘బాండింగ్ హార్మోన్’ అని కూడా పేరు. మనుషుల మధ్య ప్రేమ, అనుబంధం, విశ్వాసాన్ని పెంచడంలో ఈ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆక్సిటోసిన్ లెవెల్స్ పెరిగితే.. మానసిక ప్రశాంతత, సంతోషకరమైన అనుభూతి కలుగుతుంది. కాబట్టి, నవ దంపతులు ఈ లవ్ హార్మోన్‌ను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం కింది సూచనలను ఫాలో అవ్వాలి.
వంట సాదాసీదాగా ఉన్నా.. అద్భుతమని కితాబివ్వండి. భర్త నుంచి వచ్చే ఇలాంటి సానుకూల స్పందన.. భార్య హృదయాన్ని ఆనందంతో నింపేస్తుంది. ఆక్సిటోసిన్ విడుదలకు దోహదం చేస్తుంది. ఇక తనపట్ల భార్య ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటే.. భర్తలో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే, భాగస్వామి అందించే వెచ్చని కౌగిలి.. ప్రేమ భావనను పెంచుతుంది. ఆక్సిటోసిన్ విడుదలను ప్రేరేపిస్తుంది.
వ్యాయామంతో శరీరం ఆరోగ్యంగా ఉండటంతోపాటు హార్మోన్ల స్థాయులూ పెరుగుతాయి. ముఖ్యంగా యోగా, నడక లాంటి చిన్నపాటి వ్యాయామాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయులనూ పెంచుతాయి. కాబట్టి, దంపతులు కలిసి వాకింగ్, యోగా చేయడం అలవాటు చేసుకోండి. బయటికి వెళ్లడం వీలుకాకుంటే.. ఇంట్లోనే ఇద్దరూ కలిసి ఇష్టమైన పాటలకు కాలు కదపండి. డ్యాన్స్ వల్ల శరీరంలో ఆక్సిటోసిన్తోపాటు డోపమైన్, ఎండార్ఫిన్స్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసికోల్లాసాన్ని, ప్రేమనూ పెంచుతాయి.
సంగీతం మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. కాబట్టి, ఇద్దరి ఫేవరెట్ సాంగ్స్‌ను ప్లేలిస్ట్‌లో పెట్టేసి.. వాటిని వింటూ ఎంజాయ్ చేయండి. ఇష్టమైన పాటలు వింటే.. శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. మనసును ఉల్లాసంగా ఉంచుతుంది. ఇక వెనిలా, లావెండర్లాంటి సువాసనలు కూడా మానసిక ప్రశాంతత చేకూరుస్తాయి. శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలను ప్రేరేపిస్తాయి. అందుకే.. మీ పడక గది ఎయిర్ఫ్రెష్నర్ను వెనిలా, లావెండర్ ఫ్లేవర్‌లో తీసుకోండి.
భాగస్వామితో ఎంత ఎక్కువ సమయం గడిపితే.. మనసు అంత ప్రశాంతంగా మారుతుంది. వారితో నవ్వుతూ గడిపే ప్రతీ క్షణం.. ఎదుటివారిలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాంటి సాన్నిహిత్యంతో శరీరంలో లవ్ హార్మోన్ కూడా విడుదలవుతుంది. ఇది.. ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. కాబట్టి, సాయంత్రాల్లో అలా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోండి.
నిత్యజీవితంలో వీటిని పాటిస్తే.. నవ దంపతుల్లో ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం పెరుగుతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌తోపాటు పరస్పర గౌరవం పెరిగి.. ఆనందంగా ఉండగలుగుతారు.