ఇంటర్నెట్లో వైరల్ అవ్వడానికి వయసుతో పనిలేదు. కాస్త ఉత్సాహం, ఇంకాస్త యాటిట్యూడ్ ఉంటే చాలు ఎనభైల్లోనూ యవ్వనాన్ని సవాలు చేస్తూ దూసుకెళ్లొచ్చు… అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ‘మార్గరెట్ చోళ’. రంగు రంగుల దుస్తులు, అల్ట్రా ఫ్యాషన్ యాక్సెసరీలతో విభిన్నంగా కనిపిస్తూ ‘లెజెండెరీ గ్లామా’గా ఇంటర్నెట్లో సంచలనమైందామె.
మనవరాలు ముచ్చటపడి చేసిన ఓ మేకోవర్ ఆ బామ్మను ఓ ఫ్యాషన్ ఐకాన్‌గా మార్చేసింది. మీ బామ్మ భలే ఉందే… తన ఫొటోస్ ఇంకా కొన్ని షేర్ చేయండి అంటూ నెటిజన్లు అడిగేంతలా ఆకర్షించింది. ఇంకేం, మరింత ఉత్సాహంతో ఫొటోలు అప్లోడ్ చేశారు. అవి కూడా పెద్ద ఎత్తున లైకులు సంపాదిస్తూ ఆ పెద్ద మనిషిని తెగ ఫేమస్ చేసేశాయి. ఇక్కడ చిత్రాల్లో విచిత్రమైన వేషధారణలో కనిపిస్తున్న ఆ బామ్మే జాంబియాకు చెందిన మార్గరెట్ చోళ. ఆమె మనవరాలు న్యూయార్క్‌లో ైస్టెలిస్ట్గా పనిచేస్తున్నది. ఓ కార్యక్రమం నిమిత్తం ఊరికి వెళ్లిన ఆమెకు అక్కడో సరదా ఆలోచన వచ్చింది. దాని ఫలితమే ఇదంతా.
మార్గరెట్ మనవరాలు డయానా కౌంబా తన బామ్మను కలిసినప్పుడు… ‘మనం ఇద్దరం ఒకరి దుస్తులు ఒకరం వేసుకుందామా’ అని అడిగింది సరదాగా. దానికామె ఓ చిరునవ్వు నవ్వింది. ‘నేను మంచి ైస్టెలిస్ట్ని… ఇదిగో ఈ దుస్తులు వేసుకో. నిన్ను సూపర్‌గా తయారు చేస్తా’ అని ఉత్సాహపరిచింది కౌంబా. ‘సరే వేసుకుంటా. నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తా. ఈ ఫొటోల ద్వారా అయినా నేను తర్వాత మీకు గుర్తుండిపోతా’ అంది బామ్మ. ఇంకేం, తన దగ్గర ఉన్న ఖరీదైన దుస్తుల్ని వేసి, ఫంకీ నగలను, కళ్లద్దాలనూ పెట్టి పల్లెటూరి బ్యాక్‌గ్రౌండ్‌లో మంచి ఫొటోను తీసి ఇన్‌స్టాలో పెట్టింది కౌంబా.
దానికి మంచి రెస్పాన్స్ రావడంతో రకరకాల హెయిర్ ైస్టెల్స్, రంగురంగుల దుస్తులు, నగలతో జాంబియా జీవన విధానాన్ని ప్రతిబింబించేలా మంచి మంచి ఫొటోలు తీసి ‘లెజెండరీ గ్లామా’ అనే ఇన్‌స్టా హ్యాండిల్లో పెట్టడం ప్రారంభించింది. గతేడాది మొదలు పెట్టిన ఈ పేజీకి ఇప్పుడు లక్షకు పైగా ఫాలోవర్లున్నారు. ఫ్యాషనబుల్ దుస్తులు ధరించి రోకలి చేత్తో పట్టుకుని, మేకను తన సోఫాకు కట్టేసుకుని…ఇలా విభిన్నంగా పోజులిస్తున్న ఆమెకు నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు. అటు సహజత్వం, ఇటు ఫ్యాషన్ల కలగలుపుగా ఉండటమే ఆమెకు ఫ్యాన్‌బేస్‌ని పెంచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో తనని అభిమానించడం ఆనందంగా ఉందంటూ తెగమురిసి పోతున్నది ఈ ఇన్‌స్టా బామ్మ.