సంపన్నులు కావాలన్న కల అందరికీ ఉంటుంది. దాన్ని నిజం చేసుకునే మార్గమే చాలామందికి తెలియదు. సాధారణ వ్యక్తులతో పాటు.. సౌకర్యవంతమైన జీవితానికీ, ఆకాశాన్ని అందుకోవాలనే కలలకీ మధ్య నడిచే జెన్ జెడ్ తరానికి కూడా సరిపోయేలా ఈ సంపద రహస్యాన్ని తెలిపే పుస్తకం ఒకటి ఇటీవల మార్కెట్లోకి వచ్చింది. ‘మ్యాంగో మిలియనీర్’ పేరిట ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ సీఈఓ రాధికా గుప్తా తీసుకొచ్చిన ఈ పుస్తకం పొదుపు సూత్రాన్ని విభిన్నంగా ఆవిష్కరించింది. 10-30-50 రూల్ పేరిట ఇందులో చేసిన
ప్రతిపాదన విజయ సాధనకు రోడ్ మ్యాప్‌లా పనికొస్తుంది. దీన్ని పాటిస్తే ఎవరైనా సులభంగా తమ లక్ష్యాలను చేరుకోగలరు.
నచ్చిన హ్యాండ్ బ్యాగా లేదా ఆ నెల పొదుపా… రెండింటిలో ఏది ఎంచుకోవాలి అన్నది ఓ నవ యువతి తికమక. యోలో (YOLO) గురూ…అనిపిస్తుందామెకు. ఇది జెన్‌జెడ్ కొత్త పంథా. YOLO… అంటే ఏం లేదు you only live once అని. ఈ జీవితం ఒక్కసారే వస్తుంది కదా! కానీ ఈ రెండూ ఒకేసారి చేయగలిగేలా సరికొత్త పొదుపు మార్గం చెబుతుంది మ్యాంగో మిలియనీర్ పుస్తకం. మనం తొలినాళ్లలో ప్రారంభించే పొదుపు అనేది ప్రాక్టీస్ మ్యాచ్‌లాంటిది. అక్కడ మొదటగా నువ్వు ఏర్పరచుకునే క్రమశిక్షణ పునాదిగా ఉంటుంది. అందుకే దీన్ని క్రికెట్లో నెట్ ప్రాక్టీస్‌గా చెబుతుందీ పుస్తకం. ఏ ఆటగాడూ ఇక్కడ సాధన చేయకుండా అంతర్జాతీయ వేదిక మీద నేరుగా ఆడటానికి వెళ్లడు. అలాగే పొదుపు అనేది నీ ప్రాక్టీస్ మ్యాచ్ అనుకుంటే, విజయవంతమైన ఇన్వెస్ట్మెంట్ అనేదే వేదిక మీద విజయం. ఇక, ఈ పొదుపు ప్రయాణాన్ని ఎలా ప్రారంభించి కొనసాగించాలి అనేదే 10-30-50 నియమం.
ఉద్యోగ జీవితం ప్రారంభమయ్యేదే ఇరవైలలో. కాబట్టి ఈ సమయంలోనే పొదుపు ప్రారంభించాలి. తొలినాళ్లలో ఎవరికైనా జీతం తక్కువగానే ఉంటుంది. చూడాల్సిన సినిమాలు, కొనాల్సిన వస్తువులు…ఇలా లిస్టు పెద్దదిగా ఉంటుంది. కాబట్టి తొలిగా మనకొచ్చే ఆదాయంలోని ఒక 10 శాతాన్ని పొదుపు చేయాలి. అది ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, రికరింగ్ డిపాజిట్లు… ఇలా ఏవైనా సరే! మీ జీతం 25 వేలు ఉంటే 2500 వీటిలో పెట్టండి. ఇక్కడే మనం పొదుపు అనే విత్తనాన్ని నాటుతాం. ఇలా చేయడం అన్నది ఒక విలువైన అలవాటు. ఇది మునుముందు దశల్లో మంచి ఫలితాన్నిస్తుంది.
మన వయసు ముప్పైల్లో పడింది అంటే జీతం కాస్త పెరుగుతుంది. అలాగే బాధ్యతలూ పెరుగుతాయి. కుటుంబం, పిల్లలు, ఈఎంఐలు ఇలా చూసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. అయినా సరే, ముప్పై నుంచి నలభై ఏండ్ల సమయంలో మన ఆదాయంలోని 30 శాతం పొదుపు చేయాలి అని చెబుతుంది మ్యాంగో మిలియనీర్. ఈ దశలో చేసుకునే పెట్టుబడులు మొక్కకు ఎరువులాంటివి. మనం ఎదగడానికి ఇవి ఎంతో అవసరం. ఆర్థిక భద్రత కోసం ఈ దశలో తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం భవిష్యత్తు అనే చెట్టుకు బలాన్నిస్తుంది.
ఒక వ్యక్తి వయసు నలభై ఏండ్లు దాటే సమయానికి జీతం లేదా సంపాదన గరిష్ఠ దశలో ఉంటుంది. ఇలాంటప్పుడు అందులో నుంచి 50 శాతాన్ని తప్పకుండా పొదుపు చేయమని చెబుతారు ఇందులో రచయిత్రి రాధికా గుప్తా. ఈ సమయంలో మీరు భవిష్యత్తు కోసం చేసిన పెట్టుబడులు చెట్టు ఇచ్చే నీడ, ఫలాల్లాంటివి. పిల్లల చదువులు, పెండ్లిండ్లు, రిటైర్మెంట్ జీవితం తదితరాలన్నింటికీ ఇవే దన్ను. కాబట్టి ఈ దశ వచ్చే సరికి మన ఆర్థిక పరిస్థితిని తప్పకుండా అదుపులో ఉంచుకోవాలి. ఆదాయ మార్గాల పెంపూ చేసుకోవాలి. అప్పుడే ఎవరైనా తాము అనుకున్న సంపద లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుంది.
టీడీఎస్ అన్నది ఆర్థిక విషయాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న వారెవరికైనా తెలిసిన విషయమే. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్… అంటే మనకు రావల్సిన డబ్బుల్ని సోర్స్ దగ్గరే, అంటే మొదట్లోనే ట్యాక్సులు పోను కత్తిరించి ఇవ్వడం అన్నమాట. జీతం, ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీలు, డివిడెండ్లు… ఇలా చాలా వాటిలో వచ్చే రిటర్న్స్ అన్నీ ఇలాగే మన చేతికి అందుతాయి. అదే విధానంలో సేవింగ్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఉండాలంటుంది ఈ పుస్తకం. అంటే బ్యాంకులో డబ్బులు పడగానే సిప్(సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లు లేదా ఇతర ఏ ఇన్వెస్ట్మెంట్లకైనా మనం కేటాయించిన మొత్తం నేరుగా వెళ్లిపోవాలి. దాన్ని మనం ఆపే అవకాశం లేకుండా ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా పెట్టుకోవాలి. అప్పుడే అనుకున్న పొదుపు గమ్యం చేరడానికి వీలవుతుంది.
డబ్బు అంటే ఒత్తిడి కాదు భద్రత. పొదుపు అంటే త్యాగం కాదు, భవిష్యత్తులో మనం అందుకోబోయే బహుమతి… అని చెబుతుందీ పుస్తకం. ఈ అంశాలను గుర్తు పెట్టుకుని క్రమ పద్ధతిలో, దీర్ఘకాలంపాటు మనం డబ్బును ఆదా చేస్తూ, దాన్ని పెట్టుబడి పెడుతూ సాగితే తప్పకుండా సాధారణ వ్యక్తి కూడా కోటీశ్వరుడు అవుతాడు అన్నది ఇందులోని సూత్రం. అందుకే కోటి రూపాయలు సంపాదించాలి అని అనుకుంటే ముందుగా ఒక రూపాయి దాచండి అని చెబుతుంది ఇది. కాబట్టి సంపద అనేది ఒకే రోజు రాదు. అలవాటు, క్రమశిక్షణ, ఓపిక… ఇవన్నీ కలిసి నిజమైన ధనాన్ని తెస్తాయి. పుస్తకాన్ని సలహాల సమాహారంగా కంటే ఒక మైండ్ సెట్ మార్పుని సూచించేదిగా మనం అర్థం
చేసుకోవచ్చు.
‘మ్యాంగో మిలియనీర్’ అనే పేరు ‘మ్యాంగో పీపుల్’ అన్న ప్రచారంలో ఉన్న పదం నుంచి వచ్చింది. ఓ హిందీ సినిమాలో… సంపన్నుడు అయిపోవాలన్న పెద్ద పెద్ద ఆశలేమీ లేకుండా, సాధారణ సౌకర్యవంతమైన జీవితాన్ని కోరుకునే సగటు మనిషిని ‘మ్యాంగో మ్యాన్’ అని పిలుస్తుంటారు. అలాగే వాడుకలో సాధారణ మనుషుల్ని ‘మ్యాంగో పీపుల్’ అంటుంటారు. అలాంటి వాళ్లు కూడా బిలియనీర్ అవ్వడం ఎలా అన్నది తెలుపుతుంది.. అన్న ఉద్దేశం వచ్చేలా ఈ పుస్తకం పేరు పెట్టారట.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి