స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్య కృష్ణ ఏకాదశి బుధవారం తేది 14-01-2026 రోజు అనురాధ నక్షత్రం ప్రథమ పాదం, గండ నామ యో గం, బాలవ కరణం, వృషభ లగ్నంలో పగలు 3-07 గంటలకు రవి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. పగలు 3-07 గంటల నుంచి సూర్యాస్తమయం (సాయంత్రం 6-01 గంటలు) వరకు సంక్రాంతి పుణ్యకాలం. సూర్యాస్తమయం కన్నా ముందే సంక్రాంతి పర్వం జరుపుకోవాలి, వివాహితలు నోములు ఆచరించాలి. పర్వ సమయంలో స్నాన-దాన-జప-పితృ దేవతలకు తర్పణాలు చేయడం ద్వారా అక్షయ ఫలం లభిస్తుంది.
మకర సంక్రాంతి పురుష లక్షణం
ఈ సంక్రాంతి పురుషుడి పేరు మంద. ఫలితం పాలకులకు అరిష్టం. కుంకుమోదక స్నాన ఫలం- స్త్రీలకు అరిష్టం, చణకాక్షత ధారణ ఫలం- శనగల పంట దిగుబడి తగ్గుతుంది. రక్త వస్త్ర ధారణ ఫలం- యుద్ధ వాతావరణం, చందన గంధ లేపన ఫలం- ఆరోగ్యప్రదం, జాజీ పుష్ప ధారణ ఫలం- కీర్తి వృద్ధి. ఇంద్రనీల భూషణ ధారణ ఫలం- క్షేమం, రజిత పాత్ర భోజన ఫలం- వెండి ధర పెరుగుతుంది, పాయసాహారం ఫలం- అనావృష్టి, రంభాఫల భక్షణ ఫలం- ఆరోగ్యం, వ్యాఘ్ర వాహన ఫలం- మృగాలకు హాని. భిండిపాల ఆయుధ ధారణ ఫలం- పాలకులకు నష్టం, రక్త ఛత్ర ధారణ ఫలం- యుద్ధం, గదాయుధ ధారణ ఫలం- కలహాలు, క్రోధముఖి చేష్టా ఫలం- ప్రజా కల్లోలాలు, నివిష్ట చేష్టా ఫలం- సస్యవృద్ధి, యామ్య దిగ్యాన ఫలం- దక్షిణ దేశాలకు అరిష్టం, కృష్ణ పక్ష ఫలం- సువృష్టి, పంటలు ఫలించును, ఏకాదశి తిథి ఫలం – క్షేమం, బుధవార ఫలం- శుభం, అనురాధ నక్షత్ర ఫలం- గోవులకు అరిష్టం. వృషభ లగ్న ఫలం- పశువులకు కష్టం, అపరాహ్ణ కాల ఫలం- హాని, 11వ ముహూర్త ఫలం- సుభిక్షం.
నివాస ప్రాంతం అచ్చుబాటు
గ్రామం (నివసించే ప్రాంతం/కాలనీ/ ఊరు) పేరు మీద వచ్చే నక్షత్రం మొదలు నామ నక్షత్రం వరకు లెక్కించి ఈ కింద తెలిపిన ప్రకారం ఫలితం తెలుసుకోవచ్చు. కొందరు నామ నక్షత్రం మొదలు గ్రామ నక్షత్రం వరకు కూడా లెక్కిస్తుంటారు.