మగువల నయనాల సొగసును కలువ రేకులతో పోలుస్తారు. ప్రస్తుతం ఆ కలువలు దుస్తుల మీదా, నగల్లోనూ ఒదిగిపోయి అతివల అలంకరణలో భాగమయ్యాయి. గులాబీ, ఆకుపచ్చ రంగుల మేళవింపుతో కెంపులు, పచ్చలను పొదిగిన కలువపూల నగలు సంప్రదాయ దుస్తులపైనా, ఆధునిక ఫ్యాషన్ మీదా చక్కగా ఒదిగిపోతున్నాయి. ఒకప్పుడు గుళ్లు, గోపురాలు, దేవుడి చిత్తరువుల్లో వికసించిన కలువలు ఇప్పుడు రకరకాల రూపాల్లో నగ నిగలు పెంచుతున్నాయి. భారీ డిజైన్లతో రూపొందే టెంపుల్ జువెలరీ నుంచి సన్నని గొలుసులతో మెరిపించే మినిమల్ ఆభరణాల వరకు అన్నింటా ఇవి విరబూస్తున్నాయి.
మహిళలు ధరించే దుస్తుల్లోనే కాదు అలంకరించుకునే నగల్లోనూ ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంటుంది. మార్కెట్లో ఏ ఫ్యాషన్ కొనసాగుతున్నా.. కొన్ని నగలు మాత్రం ఎప్పుడూ ఆడపడచుల ఆదరణ పొందుతూనే ఉంటాయి. వాటిలో ముఖ్యంగా సంప్రదాయం, సంస్కృతి మేళవించిన ఆభరణాలు ముందువరుసలో ఉంటాయి. దేవతామూర్తుల ప్రతిబింబాలు, ఏనుగులు, మయూరాలు, ఆకులు, తీగలు, మామిడిపిందెలు.. ఇలా ఒక్కటేమిటి సృష్టి అందాలన్నీ మగువల మేనిపై నగల్లో ఒదిగిపోయి వాటి సొగసును రెట్టింపు చేసుకుంటాయి. గులాబీలు, కలువలు కూడా ఆభరణాల్లో అమరిపోతున్నాయి. అయితే వీటిలో కలువలు పొదిగిన నగలు ఎంతో ప్రత్యేకం. అలలు లేని కొలనులో ముచ్చట గొలిపే ఈ పుష్పాలను చూస్తూ ముదితలు మురిసిపోతారు. వారి మురిపాన్ని మరింత పెంపు చేసేలా కెంపులు, వజ్రాలు, పచ్చలను పొదిగి కలువల్ని రూపొందించిన నగలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి.

టెంపుల్ జువెలరీలో కలువలు పొదిగిన నగలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో సన్నని గొలుసులు జోడించిన డిజైన్లూ అందుబాటులోకి వచ్చేశాయి. ఇవి ఆధునిక దుస్తులపైనా చక్కగా అమరిపోతూ అతివల అలంకరణలో భాగమవుతున్నాయి. కలువలను ప్రతిబింబించే కంఠాభరణాలు, పెండెంట్లు, బ్రేస్లెట్లు, గాజులు, కమ్మలు, ఉంగరాలు.. అన్నిరకాల ఆభరణాలు మార్కెట్లోకి వచ్చేశాయి. గుత్తపూసలు, ముత్యాలు జోడించిన ఈ నగలు అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటున్నాయి. బంగారు ఆభరణాల్లోనే కాదు వెండితో తయారుచేసిన భారీ ఆభరణాలు, ఆదివాసీ నగల్లోనూ కలువల డిజైన్లు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. టెర్రకోట, ఫ్యాబ్రిక్, సిల్క్ జువెలరీలోనూ ఈ కలువల అందాలను జోడిస్తున్నారు తయారీదారులు. ఇంకెందుకు ఆలస్యం కలువ సోకులను మీరూ ఓసారి ట్రై చేసేయండి!