గరిక ప్రియుడు గజాననుడు. బిల్వంతో అలంకరించగానే.. సర్వం ఇచ్చేస్తాడు. గండకీ పత్రం సమర్పయామీ అనగానే.. గండాలన్నీ గట్టెక్కించేస్తాడు. వెలగపండు నివేదించగానే మరింత వెలిగిపోతాడు. ఆయన అర్చనలో పత్రాలదే అగ్రతాంబూలం. ప్రకృతి శక్తి పార్వతీదేవి గారాలపట్టినిపర్యావరణ విజేతగా నిలబెట్టే శక్తి విత్తన గణపతికి ఉంది.విత్తనంబును హత్తుకొని మృణ్మయ గణపతి ముందు మొక్కై, ఆపై మానై, అటు తర్వాత మహావృక్షమై.. మన పెరటిలో సదా నిలిచి ఉంటాడు. ఎకో రూపంలోని ఏకదంతుడిని ఉపాసించి.. అనేక ప్రయోజనాలు పొందుదాం.
వినాయకుడిని మహాగణపతి అని పిలుస్తాం. మహాగణపతికి ‘మహాంశ్చాసౌ గణపతిః, మహతాం గణానాం పతిః’ అని వ్యుత్పత్తి అర్థాలు. అంటే గొప్ప గణపతి, విశేషమైన గణపతి అని అర్థం. ప్రకృతికి ప్రతిరూపమైన పార్వతీ తనయుడిని మహాగణపతిగా ఆవిర్భవింపజేసే శక్తి విత్తన గణపతికి ఉంది. వినాయకుడి అష్టోత్తర శతనామాల్లో ‘ఓం విశ్వరక్షాకృతే నమః’, ‘ఓం జగదాధారాయ నమః’ అనే నామాలు కనిపిస్తాయి. విశ్వాన్ని రక్షించే ఆకృతి కలవాడు అనీ, ఈ జగత్తుకు ఆధారం ఆయనే అనీ వీటికి అర్థాలు. ఈ మంత్రాలను సరిగ్గా అర్థం చేసుకుంటే.. ప్రకృతి పురుషుడైన విఘ్నేశ్వరుడి ఉత్సవం పర్యావరణ హితం కావాలనుకుంటాం. విత్తన గణపతిని ఆరాధిస్తే రాష్ట్రం, దేశం హరితభరితం అవుతుందని గ్రహిస్తాం.
పుట్టింది మట్టిలోంచే..
వినాయకుడి పుట్టుకకు మృత్తిక సమానమైన నలుగు పిండి మూలాధారం. ఆయనకు మట్టిలోంచి రావడం ఇష్టం. ఎందుకంటే అది ఆయన సహజ శరీరం. మృత్తిక నాశనం లేనిది. అనంత ఖనిజాలకూ ఆలవాలం! అనంత ఐశ్వర్యాలూ ప్రసాదించే విఘ్నేశ్వరుడి విరాట్ రూపాన్ని మట్టితో మలిస్తేనే ఆయనకు ఆనందం. అన్నిటికన్నా ముఖ్యంగా తేజోమూర్తి అయిన భగవానుడి ఆరాధనకు నిర్మలమైన మనసే అర్హత. చిత్తం ఎంత ప్రధానమైనదో దైవాన్ని ఆవాహన చేసే పదార్థమూ అంతే ముఖ్యం. ఉత్తమ ద్రవ్యం కాకపోతే దేవతలు సైతం మన పూజలు అంగీకరించడానికి ఇష్టపడరు అని శాస్ర్తాలు వివరిస్తున్నాయి. ప్రకృతి దైవంగా భావించే మూషికవాహనుడికి ముచ్చటైన రూపాన్ని ఇవ్వడానికి బంకమట్టిని మించిన ద్రవ్యం లేదని పెద్దల మాట. అందుకే యుగాలుగా వినాయక చవితికి మట్టితో చేసిన మూర్తినే ఇంటింటా కొలువుదీర్చి నవరాత్రులు నిర్వహించేవారు.
బంకమట్టి శ్రేష్ఠం
గణేశ ప్రతిమ నిర్మాణానికి బంకమట్టి శ్రేష్ఠం. శివారాధనలో పార్థివ లింగం (మట్టితో చేసిన లింగం) ఎంత మహిమాన్వితమైనదో.. మట్టితో చేసిన వినాయకుడి పూజ కూడా అంతే గొప్పది. గణేశ పురాణంలో 49, 50 అధ్యాయాల్లోనూ చవితినాడు మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించాలని కనిపిస్తుంది. వినాయకుడి విగ్రహం తయారీ గురించి కూడా అందులో స్పష్టంగా ఉంది. వినాయక చవితి నాడు ఉదయాన్నే స్నానాదికాలు పూర్తి చేసుకోవాలి. తర్వాత గణపతి మూర్తిని తయారు చేయడానికి సిద్ధం కావాలి. చెరువు నుంచి రాళ్లు, చెత్త లేని బంకమట్టిని సేకరించాలి. దానిని ముద్దగా చేసి మర్దించాలి. ఆ మట్టితో సర్వాయవ సంపూర్ణమైన గణపతి ప్రతిమ తయారు చేయాలి. ఈ కాలంలో అందరికీ అలాంటి వెసులుబాటు ఉండదు కాబట్టి, మార్కెట్లో దొరికే మట్టి వినాయక మూర్తిని తీసుకోవడం మంచిది.
గజాననం పంచభూతాత్మకం
ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. భూమి జడపదార్థం. నీరు ప్రాణాధార శక్తి. ఈ రెండు పదార్థాలు కలవటం వల్ల అంటే జడపదార్థమైన భూమి చైతన్యం కలిగిన నీళ్లతో చేరినప్పుడు ప్రాణశక్తి కలుగుతుంది. తద్వారా ఆహార పదార్థాలు, ఓషధులను మనకు అందిస్తుంది. ఈ విధంగా ప్రాణాధార, జడశక్తుల కలయికతో సృష్టి సాగుతున్నదని చెప్పడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారుచేసి, ఆ మృణ్మయ మూర్తిని పూజించే విధానం ఏర్పడింది. మట్టి గణపతిని పూజించటంలో యోగశాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయి. మానవ శరీరంలో ఉండే షట్చక్రాల్లో మొదటిది మూలాధార చక్రం. యోగశాస్త్రం ప్రకారం మూలాధార చక్రానికి అధిష్ఠాన దేవత గణపతి. మూలాధారం భూ తత్వం కలిగి ఉంటుంది. కాబట్టి, భూమికి సంకేతంగా మట్టితో విగ్రహం చేసి, మూలాధార అధిదేవత అయిన గణపతిని అర్చించాలి. దీనివల్ల ఆ దేవర అనుగ్రహం కలుగుతుంది.
Ganesha
భక్తి విత్తులు నాటుదాం..
ప్రకృతి మూర్తిని.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, హానికారక రసాయనాలతో తయారుచేయడం పర్యావరణానికి గొడ్డలిపెట్టు. ఈ సంప్రదాయానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నో సేవా సంస్థలు, ఎందరో సామాజిక కార్యకర్తలు ఏండ్లుగా మట్టి గణపతి ప్రాశస్త్యాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమానికి మరింత శక్తిని జోడిస్తూ కొన్నేండ్లుగా విత్తన గణపతి ఆచారం అమల్లోకి తెస్తున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు. ఒకే ఒక్క విత్తనానికి ఈ సృష్టిని మళ్లీ ఆరంభించగల సత్తా ఉంది. సృష్టి ఆత్మ విత్తనంలోనే ఉంది. అందుకే విత్తనాలను వెదజల్లేందుకు ప్రకృతి ఎన్నో ఉపాయాలను కనిపెట్టింది. గాలిలో తేలుతూ వెళ్లే జిల్లేడు విత్తనాల దగ్గర నుంచీ, పక్షుల విసర్జితాల నుంచి మొలిచే రావి చెట్ల వరకు.. రకరకాలుగా వృక్షజాతికి సాయం చేస్తున్నది. మరి వాటి మీద ఆధారపడుతున్న మనిషి తనవంతు సాయం చేయాలి కదా! అందుకే ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటూ తనకు తాను గుర్తుచేసుకుంటూ మొక్కలను పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. అందులోనూ పర్యావరణహితంగా ఉండే పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నాడు. ఈ మహాక్రతువుకు అగ్ర పూజలు అందుకునే వినాయకుణ్ని వేదికగా చేసుకోవడం కన్నా విశేషం మరేం ఉంటుంది? అందుకే విత్తన గణపతి నినాదం ఓ విధానంగా ఇప్పుడు జోరందుకుంది. మంటపాల్లో విగ్రహాల మాట పక్కనపెడితే.. ఇంటింటా కొలువుదీరే గణపతుల విషయంలో సామాజికంగా చాలా చైతన్యం వచ్చింది. ఈ మహాయజ్ఞంలో నేను సైతం అని ఎందరో భాగస్వాములు అవుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌తో దేశవ్యాప్తంగా పచ్చదనం పెంచే బృహత్కార్యాన్ని నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ విత్తన వినాయకుడి ప్రతిమలు వేలాదిగా పంపిణీ చేస్తున్నారు.
భావితరాల కోసం
వినాయకుడిని నవగ్రహాలకు అధినాయకుడిగా చెబుతారు. నవధాన్యాలు పొదిగి గ్రహరాజు ప్రతిమను చేయడం కన్నా పుణ్యం ఏముంటుంది చెప్పండి? రావి ఆకులో కరివీరుడి ముఖారవిందం గోచరిస్తుంది. రావి విత్తును ప్రతిష్ఠించి నవరాత్రులూ పూజించి, ఏ చెరువు గట్టునో, పొలంలోనో విత్తు గణపతిని మట్టిలోనే నిమజ్జనం చేయండి. అశ్వత్థ వృక్షమై కొమ్మకొమ్మలో, రెమ్మరెమ్మలో సురపతి గణపతి ప్రణవమూర్తిగా దర్శనమిస్తాడు. చిత్తం ముఖ్యం కానీ, ఏ విత్తుతో వినాయకుణ్ని ప్రతిష్ఠిస్తేనేం? తులసి విత్తనాలను కూడా గణపయ్య బొజ్జలో దాచి.. ఇంటి ప్రాంగణాన్ని బృందావనంగా మార్చుకోవచ్చు. ఈ ప్రకృతికి కావాల్సింది పచ్చదనం. దానిని పెంపొందించుకునే ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకోవడం మన కర్తవ్యం. పూజాదికాల్లో లోటుపాట్ల దోషం తొలగి పోవడానికి ‘మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం..’ అంటూ క్షమాప్రార్థన చదివే వెసులుబాటు కల్పించారు. కానీ, పండుగ లక్ష్యాన్ని మరచి చేస్తున్న ఈ వికృత వేడుకల కారణంగా ముందుతరాలు మనల్ని క్షమించవు. ఆ దోషం పట్టి పీడించకుండా ఉండాలంటే.. మట్టి వినాయకుడే మహా వినాయకుడన్న స్పృహ అందరిలో రావాలి. విత్తన గణపతి విశేష గణపతి అనే నిశ్చయానికి రావాలి. అప్పుడు తొమ్మిది రోజులు పూజ లందుకున్న వినాయకుడు మరో పదిరోజుల్లో మొక్కగా మొలుస్తాడు. చెట్టుగా పెరుగుతాడు. వృక్షమై శతాబ్దాలు నిలిచి ఉంటాడు. చల్లని గాలితో నిత్యం ఆశీర్వదిస్తుంటాడు. భావితరాలకు తియ్యని పండ్లను ప్రసాదంగా అనుగ్రహిస్తాడు.
పృథ్వీ తత్వం..
వినాయకుడు ప్రకృతికి ప్రతిరూపం. గణపతి వ్యవసాయానికి రక్షకుడు. ఆయన రూపంలోని దీర్ఘమైన తొండం పంట పొలాల కాలువలకు నీళ్లు ఇచ్చే తూముకు, చిన్నకండ్లు సూక్ష్మమైన ఆలోచనకు, పెద్ద పొట్ట సకల సంపదలను దాచుకునే గాదెకు ప్రతీకలుగా చెబుతారు. దంతం ఆత్మవిశ్వాసానికి సంకేతం. ప్రకృతి సిద్ధమైన పూలు, పండ్లు అన్నీ గణపతికి ఇష్టమైనవే. గణపతి చేతిలోని పాశం కార్యసాధనకు గుర్తు. వినాయకుని వాహనం ఎలుక. దాని పేరు అనింద్యుడు. మరొక కోణంలో ఆలోచిస్తే వ్యవసాయదారులకు, పంటలకు ఇబ్బంది కలిగించే ఎలుకలను ఆయన అదుపులో ఉంచుతాడని అంతరార్థం. ప్రకృతి బాంధవుడైన గణపతిని పృథ్వీతత్త్వానికి ప్రతీకగా చెరువులోంచి, పుట్టలోంచి మట్టిని తీసుకొచ్చి వినాయక విగ్రహాన్ని తయారుచేస్తుంటారు. ప్రకృతి సంబంధంగా దొరికే లతలు, పత్రి, పుష్పాలతో, రకరకాల పండ్లతో పూజించి మృణ్మయ మూర్తిని తిరిగి చెరువులో నిమజ్జనం చేస్తారు. ప్రకృతి సమతుల్యతను, పర్యావరణాన్ని కాపాడటానికి పెద్దలు ఈ ఏర్పాట్లుచేశారు.
-టి.వి.ఫణీంద్ర కుమార్
-సంస్కృత అధ్యాపకుడు
ఆంతర్యం గ్రహిద్దాం..
వరసిద్ధి వినాయకుడి ఆరాధన మనకే కాదు, ప్రకృతికీ వరం కావాలి. మన పూర్వికులు ఏ విధానాన్ని అనుసరించారో దాన్ని కొనసాగించడమే భవిష్యత్ తరాలకు శ్రేయస్కరం.
మన పండుగల ఆంతర్యం గ్రహిస్తే అందులో మన మహర్షులు నిక్షిప్తం చేసిన సామాజిక హితం కనిపిస్తుంది. వినాయక చవితి సంబురంలోనూ అంబరాన్నంటే వేడుకలు తాత్కాలిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కానీ, మంటపంలో కొలువుదీర్చే మూర్తి మట్టిదైతేనే మన సంకల్పం గట్టిది అనిపించుకుంటుంది. చవితి పూజలో కరిరాజ ముఖుడికి సమర్పించే కానుకలన్నీ పత్రహారాలే! ఔషధీ లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఈ ‘పచ్చ’లపతకాలు నిమజ్జనోత్సవం నాడు నిజమూర్తితో కదిలి, తటాకంలో మునిగి.. జల సంపదను ప్రక్షాళన చేస్తాయి.
-దేవదత్ పట్నాయక్,ఆధ్యాత్మిక రచయిత
హాని తలపెట్టొద్దు
రంగురంగుల హంగుల కోసం వినాయకుడి రూపాన్ని మార్చేస్తున్నాం. హెచ్చులకుపోయి హేరంబుడి ఆకారాన్ని పెంచేస్తున్నాం. విశ్వమంతా నిండి ఉన్న భగవంతుడిని అడుగుల్లో కొలిచే సాహసం చేస్తున్నాం. వీటన్నిటికీ మించి పర్యావరణానికి హాని చేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వీధివీధిలో ప్రతిష్ఠిస్తున్నాం. ఆ విగ్రహాలు త్వరగా నీటిలో కలిసిపోవు. పైగా వాటి నిర్మాణానికి వాడే రసాయన రంగుల్లో ఆర్సెనిక్, సీసం, కాడ్మియం, క్రోమియం వంటి ప్రమాదకరమైన భారలోహాలు ఉంటాయి. నీటిలో పెరిగే మొక్కలకు ఈ రసాయనాలు కీడు చేస్తాయి. జల కాలుష్యానికి కారణం అవుతాయి. ఈ సత్యాన్ని గ్రహించి పర్యావరణానికి కీడు తలపెట్టకుండా మట్టి గణపతినే మహా వినాయకుడిగా కొలుచుకుందాం.
– కావేరి సత్యదేవ్,ఫౌండర్, మై పూజా బాక్స్