అందాన్ని కాపాడుకునేందుకు ఆడవాళ్లు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖం కాంతిమంతంగా, మచ్చలు లేకుండా కనిపించాలని రకరకాల పరిష్కారాలను వెతుక్కుంటారు. తెలిసినవాళ్లు.. తెలియనివాళ్లూ చెప్పిన టిప్స్ పాటిస్తుంటారు. అయితే.. ఇలా చర్మానికి ఏదిపడితే అది అప్లయి చేయడం వల్ల దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉంటుంది. అలాంటివాటిలో నిమ్మకాయ ఒకటి. ఆరోగ్యానికి భరోసా ఇచ్చే నిమ్మకాయ.. కొన్ని సందర్భాల్లో అందానికి శత్రువుగా మారుతుంది. కాబట్టి.. ముఖ వర్చస్సు కోసం నిమ్మకాయను వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిమ్మకాయలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. చర్మ సమస్యలను నయంచేసే సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గానూ ఇది పనిచేస్తుంది. కానీ, అధిక ఆమ్ల లక్షణాలు కలిగిన నిమ్మకాయను ముఖానికి నేరుగా అప్లయి చేయకూడదు. ఇలా చేస్తే చర్మం పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఆమ్లత్వం అధికంగా ఉండే నిమ్మకాయను చర్మంపై నేరుగా రుద్దితే.. చర్మం పీహెచ్ బ్యాలెన్స్ చెదిరిపోతుంది. దీనివల్ల రకరకాల సమస్యలు తలెత్తుతాయి. చిన్న వయసులోనే చర్మంపై ముడతలకు వచ్చే ప్రమాదం ఉంటుంది. మొటిమల సమస్యను పెంచి, ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడవచ్చు కూడా!
నిమ్మకాయను రాసుకుంటే.. చర్మం మరింత సున్నితంగా మారుతుంది. దీంతో ఎండలోకి వెళ్లినప్పుడు.. ఇట్టే వడదెబ్బకు గురవుతుంది. హైపర్పిగ్మెంటేషన్కూ దారి తీస్తుంది.
నిమ్మకాయను ముఖానికి నేరుగా రుద్దితే.. చర్మంపై పొక్కులు ఏర్పడతాయి. చర్మంపై వాపు, దురద, మంట, ఎర్రబడటం వంటి సమస్యలూ కనిపిస్తాయి. వీటిని తేలికగా తీసుకుంటే.. సమస్య మరింత తీవ్రమవుతుంది. ముఖ్యంగా.. సున్నితమైన చర్మం ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. నిమ్మకాయకు సున్నిపిండి, ముల్తానీమట్టి, గ్లిజరిన్, కొబ్బరినూనె, అలోవెరా జెల్ మొదలైనవి కలిపి అప్లయి చేసుకుంటే మంచిది.