Mother’s Day | కుటుంబం ఓ దేశమైతే.. ఇల్లు పార్లమెంట్ అయితే.. అమ్మ ప్రధానమంత్రి. నాన్న రాచముద్రలు వేసే రాష్ట్రపతి. బాబాయి సర్వసైన్యాధ్యక్షుడు. తాతయ్యలు-నానమ్మ, అమ్మమ్మ గౌరవ సలహాదారులు. చిన్నమ్మలు, అత్తయ్యలు ఆంతరంగిక బృందంలో సభ్యులు. పుట్టింటి బంధువులంతా మిత్రదేశాలు. పిల్లాపాపలు.. సమస్త ప్రజానీకం.
నాయకత్వం అంటేనే కత్తిమీద సాము. పరివారంలోని ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తూ, చిన్నాపెద్దా సమస్యలను పరిష్కరిస్తూ.. అసమ్మతిని అధిగమించుకుంటూ, అసంతృప్తిని నియంత్రించుకుంటూ, ఆర్థిక పరిమితులు దాటుకుంటూ.. తన బలగమే బలంగా అమ్మ సాగించే కుటుంబ పాలన దాదాపుగా ఓ ప్రజాస్వామ్యదేశాన్ని ఏలినంత కష్టమైన పని. తనదైన శైలిలో, తనకే సొంతమైన వ్యూహ రచనతో ఆమె అలవోకగా ఆలన-పాలన సాగిస్తుంది. వ్యూహ తంత్రంలో ఆమె చాణక్యుడి చెల్లి. ప్రణాళిక రచనలో ప్లానింగ్ కమిషన్‌కూ పాఠాలు చెప్పగల ప్రజ్ఞాశాలి. పొదుపు-మదుపు మీద అదుపు కలిగిన ఆర్థిక నిపుణురాలు. సైకాలజీలో సిగ్మండ్ ఫ్రాయిడ్ సైతం సిగ్గుపడేంత మనోవిశ్లేషణా శక్తి ఆమె సొంతం. ఈ బలాలకు.. బంధు బలం తోడైంది. ఇక తిరుగేముంది? అమ్మ శకం ఆరంభమైంది. ఆ ఇంటికి స్వర్ణయుగం మొదలైంది.
నాన్న కుటుంబానికి పెద్ద. ముఖ్యమైన నిర్ణయాలు ఆయనవే. కీలకమైన ప్రకటనలన్నీ ఆయన నోటి నుంచే. ఆయన కండ్లెర్రజేస్తే భూకంపమే. పెద్దాయన ఇంట్లో ఉన్నంతసేపూ చీమ చిటుక్కుమనదు. బీరువా తాళాలు నాన్నవే అయినా, నాన్న గుండె తాళాలు మాత్రం అమ్మ దగ్గర ఉంటాయి. నాన్నను డీల్ చేయడం అమ్మకు వెన్నతో పెట్టిన విద్య. అవును మరి! ఆ బంధం ఇప్పటిదా? ఆమె సగం, అతను సగం.. కలిస్తే ఓ జగం. అతను పరమేశ్వరుడు అయితే, ఆమె అన్నపూర్ణ. అతను మహావిష్ణువు అయితే, ఆమె లక్ష్మీదేవి. అతనికి ఆమె తోడు. ఆమెకు అతను నీడ. ఇంకేమీ మిగలనంతగా ఒకర్నొకరు అర్థం చేసుకున్నారు. ఆ అవగాహనలో నాన్నకు తొంభై మార్కులు పడితే, అమ్మకు నూటికి నూరు. తన మాటను కాదనడని ఆమె ధైర్యం.
తన ఆలోచన ఆమెకు తెలుసని అతని విశ్వాసం. కాబట్టే, ముఖ్య నిర్ణయాలన్నీ తానే తీసేసుకుని.. సమయం-సందర్భం చూసుకుని కంచంలో కూర వడ్డిస్తూ.. నాన్నతో తల ఊపించేస్తుంది. పండక్కి బట్టలు, పెద్దోడికి కాలేజీ ఫీజు, చిన్నోడికి కొత్త సైకిలు, కూతురికి పెళ్లి సంబంధాలు.. పంతం పట్టి అయినా ముఖ్య నిర్ణయాల మీద ఆమోదముద్ర వేయిస్తుంది. అంతిమంగా మంచే జరిగేలా చూస్తుంది. ఆ సంగతి నాన్నకూ తెలుసు. కాబట్టే, అప్పుడప్పుడూ బెట్టు చేసినట్టు నటించినా అంతిమంగా అమ్మ నాయకత్వాన్ని ఆమోదిస్తాడు. ‘ఫలానా సరోజమ్మ మొగుడు’ తరహా బిరుదుల్ని సంతోషంగా స్వీకరిస్తాడు. పంట పైసలొచ్చినా, కౌలు డబ్బులొచ్చినా.. నేరుగా తీసుకొచ్చి ఆమె చేతికే ఇస్తాడు. ఇక బ్యాంకు లాకర్లో ఉన్నంత నిశ్చింత. మళ్లీ అవసరం వచ్చినప్పుడు.. తనే తెచ్చి ఇస్తుంది. అమ్మకు ఆకలి తెలుసు, అవసరాలూ తెలుసు.
ఏ ఇంటికైనా అల్లుళ్ల మేనేజ్మెంట్ ఓ సవాలు. వచ్చిన మరుక్షణం నుంచీ సపర్యలు చేయాలి. సకల మర్యాదలూ అందించాలి. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ గవర్నర్ బంగ్లా స్థాయిలో ఉండాలి. ఎక్కడా లోటు తెలియకూడదు. ఏ చిన్న పొరపాటూ జరగకూడదు. బామ్మర్దులకు ఇదొక సవాలు. ఈ రెండురోజులూ బయటి పనులు బంద్. దోస్తులతో ముచ్చట్లు బంద్. ఈ ప్రొటోకాల్ వ్యవహారాలన్నీ ఒక ఎత్తు. అమ్మ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఒక ఎత్తు. అంత గొప్ప ఇంటల్లుడిని కూడా ‘తమ్ముడూ..’ అంటూ తన బలగంలో కలిపేసుకుంటుంది. నెలాఖరు ఇబ్బందుల వల్ల చికెన్ చేయడం కుదరనప్పుడు ‘బయట వాతావరణం బాగాలేదు తమ్ముడూ! ఒకటే అంటురోగాలు. పాడు చికెన్ తినకపోతే.. చచ్చిపోతామా? అందుకే నేనే తేవద్దని చెప్పాను. నీకు మునక్కాడల రసం ఇష్టమని మా మరదలు చెప్పిందిలే.. అందుకే వేడివేడిగా చారు కాచాను. ఇంకొంచెం వడ్డించనా..’ అంటూ వెజ్జితో సర్దుబాటు చేసేస్తుంది.
‘బయట అప్పులు చేయడం ఎందుకూ? అయినవాళ్ల దగ్గర మొహమాటాలెందుకు? మా తమ్ముడు బంగారం. ఆ యాభైవేలూ తనకో లెక్కే కాదు’ అంటూ మొగుడి కుటుంబానికి కొత్త ఆర్థిక వనరును సృష్టిస్తుంది. తనదైన లౌక్యంతో వ్యవహారం నడిపిస్తుంది. పంతాలు పట్టింపులు వచ్చినప్పుడు.. ఒడుపుగా సర్దుబాటు చేస్తుంది. అల్లుడి మర్యాదకు భంగం కలగకుండానే.. ఇంటి గౌరవం నిలబెడుతుంది. ఇన్ని సాఫ్ట్ స్కిల్స్ అమ్మకెలా అబ్బాయబ్బా!
మరిది.. కొడుకు తర్వాత కొడుకు. అత్తిల్లు అందించిన తమ్ముడు కాని తమ్ముడు. ఆమె పెండ్లినాటికి పొట్టి నిక్కరు పిల్లగాడు. నూనూగు మీసాల పోరగాడు. కొంచెం అమ్మలా, కొంచెం అక్కలా కనిపిస్తున్న ఆమెను కళ్లింతలు చేసుకుని చూసేవాడు. పలకరించాలంటే బెరుకు. ఎదురుపడితే సిగ్గు. ఆ కౌమారుడి పరిస్థితిని అర్థం చేసుకుని కుమారుడిలా దగ్గర తీసుకుంటుంది. అప్పటినుంచీ అతనికి.. అమ్మ తర్వాత అమ్మ వదినమ్మ. మరిది మాణిక్యమే. ఇంటి పనులకు సాయంగా ఉంటాడు. బయటి పనుల్లో తోడుగా నిలుస్తాడు. కాకపోతే, మరీ నోరులేని మనిషి. కాబట్టే, పంపకాల్లో పట్టుబట్టి ఓ పావు ఎకరం ఎక్కువ వేయిస్తుంది. పాతిల్లు తన పేరు మీద రాసేలా చేస్తుంది. ఉన్నదాంట్లోనే పిల్లల చదువులకు, పెండ్లిళ్లకు నాలుగు రాళ్లు వెనకేసుకోమని చెబుతూనే ఉంటుంది. అందులో ప్రేమ ఉంటుంది, హెచ్చరికా ఉంటుంది. అంతర్లీనంగా అధికారమూ ఉంటుంది.
అమ్మ ఆశలన్నీ పిల్లలమీదే. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా బాగా చదువుకోవాలని అమ్మ ఆరాటం. పట్టుబట్టి పిల్లల్ని పట్నం స్కూల్లో చేర్పించింది. ఉదయం, సాయంత్రం.. బస్సు కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే చదువుసాగదు కాబట్టి, పట్టుబట్టి సైకిళ్లు కొనిచ్చింది. సమాజం నుంచి ‘ఆడపిల్లలు సైకిలు తొక్కడం ఏమిటి?’ అన్న ప్రశ్న ఎదురైన ప్రతిసారి, ‘ చూస్తూ ఉండండి.. అమ్మాయిలు విమానాలు నడిపే రోజూ వస్తుంది’ అని జవాబిచ్చి నోళ్లు మూయించింది. ‘ఈ ఊరికంటే నరకమే నయం. ఒక దవాఖాన లేదు. ఒక డాక్టరు లేడు’ అంటూ జనమంతా సొంతూరికే శాపనార్థాలు పెడుతున్న సమయంలో.. ‘అలా మాట్లాడొద్దు. మనకూ మంచిరోజులొస్తాయ్’ అని వారించింది. అంతలోనే పిల్లలు కాలేజీలకు వచ్చేశారు. అత్తింటివారు పెట్టిన నగలను, పుట్టింటివాళ్లు ఇచ్చిన సొత్తును కుప్పగా పోసి అమ్మింది. ఆ సొమ్ముతో పిల్లలకు ఇష్టమైన చదువులు చదివించింది. అమ్మ వెనకాలే తథాస్తు దేవతలు ఉంటారేమో! కూతురు పైలట్ ఉద్యోగం తెచ్చుకుంది. కొడుకు మెడిసిన్ చదివి ఊళ్లోనే ప్రాక్టిస్ పెట్టాడు. యాభై పడకల నర్సింగ్హోమ్గా విస్తరించాడు. పేరు ‘అమ్మ దవాఖాన’.
ఏ ముహూర్తాన చూశారో. ఇలాంటి పిల్ల దొరకదనే నిర్ణయానికొచ్చారు. కట్నం అడగలేదు. లాంఛనాలు కోరుకోలేదు. ఘనంగా పెండ్లి చేసి.. మహాలక్ష్మిలాంటి కోడల్ని తమతో పంపితే చాలన్నారు. ఆ క్షణం నుంచీ అమ్మకు.. ఇద్దరమ్మలు, ఇద్దరు నాన్నలు. కోడలు పుట్టింటికి ప్రయాణమైన ప్రతిసారీ, ఆ ముసలి మొహాలు చిన్నబోతాయి. ‘పండగైపోగానే వచ్చేయ్ బిడ్డా! తెల్లావు నువ్వు పిండితేనే పాలిస్తుంది. నువ్వు పోస్తేనే నల్లపిల్లి పాలు తాగుతుంది’ అంటూ భారంగా సాగనంపుతారు. రోజులు లెక్కబెట్టుకుంటూ కూర్చుంటారు. ఆమె పరిస్థితీ అంతే. అత్తింట్లో ఉన్నప్పుడు అమ్మానాన్నల చింత. పుట్టింటికి వెళ్లినప్పుడు అత్తామామల బెంగ. మందులేసుకున్నారో లేదో, పత్యం పాటిస్తున్నారో లేదో, చక్కెరలేని కాఫీ తాగుతున్నారో లేదో.. తన ఆలోచనలన్నీ పెద్దల చుట్టే. ఆ అపేక్షను చూసే.. ఏ పెండ్లికో వెళ్లినప్పుడు కొత్త చుట్టాలు.. ‘మీ అమ్మానాన్నలా?’ అని అడిగిన సందర్భాలూ ఉంటాయి.
పొలం పంచాయతీలు. కోర్టు గొడవలు. ఊరి రాజకీయాలు. అత్తింటి గౌరవానికి భంగం కలుతున్నట్టు అనిపించగానే.. కనిపించని ఓ వ్యూహకర్త ఆమెలోంచి బయటికి వస్తుంది. మెట్టినింటికి ఆమె అండ అయితే, ఆమెకు పుట్టిల్లు అండ. అవసరమైతే అన్న పరపతిని ఉపయోగించుకుంటుంది. తమ్ముడి నెట్వర్క్ వాడుకుంటుంది. ఇదంతా అత్తింటి మేలుకోసమే. మొగుడి వ్యవసాయం సమస్యల్లో ఉన్నప్పుడు.. తానే బాధ్యత తీసుకుంటుంది. సేద్యంలో తలపండిన బాబాయిని తీసుకొచ్చి నేల పరీక్షలు చేయిస్తుంది. దూరపుచుట్టాన్ని బతిమిలాడి బోరు వేయిస్తుంది. తమ్ముడిని పట్టణమంతా తిప్పి నాణ్యమైన విత్తనాలు తెప్పిస్తుంది. పెట్టుబడి డబ్బులకు అవసరమైతే నగలు తాకట్టు పెడుతుంది. చివరగా విరగపండిన పంటను చూసుకుని లోలోపలే మురిసిపోతుంది.తానున్న చోట వైఫల్యం కనిపించకూడదు. దారిద్య్రం తారట్లాడకూడదు. లక్ష్మీకళ ఉట్టిపడాలి. అతిథి అభ్యాగతులతో ఇల్లు కళకళలాడాలి. అవసరమైతే ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది. పుట్టింటి పలుకుబడిని ఓట్లుగానూ మలుచుకుంటుంది. పల్లెను అద్దంలా తీర్చిదిద్దుతుంది. ఉత్తమ పంచాయతీల వరుసలో నిలబెడుతుంది. పుట్టింటివాళ్లు సైతం సిఫారసుల కోసం వచ్చేంత ఎత్తుకు ఎదుగుతుంది.
Family3
బతుకమ్మకో, బోనాలకో వచ్చిపోయే ఆడబిడ్డలు.. రోజూ మొహాలు చూసుకునే తోడికోడళ్లు. అమ్మకు స్పీడ్ బ్రేకర్లు. ఆమె నాయకత్వానికి మొదటి సవాళ్లు. ఆ వ్యూహాత్మక పోరులోనూ, అంతిమంగా అమ్మదే పైచేయి. అమ్మ మంచితనానిదే విజయం. ఇల్లు నింపి.. కుడికాలు పెట్టిన మరుక్షణం నుంచీ అమ్మ ఆ ఇంటిమనిషి అయిపోతుంది. ఆ కుటుంబ సంప్రదాయాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతుంది. ఇంటిదేవుడికి పూజలు, ఆడబిడ్డలకు ఒడిబియ్యాలు, కులదేవతలకు ముడుపులు.. ఎక్కడా లోటు రానివ్వదు. అదంతా చూసి ముచ్చటపడే.. ఆడబిడ్డ వీరాభిమానిగా మారిపోతుంది. తన పుట్టిల్లు సురక్షితమైన చేతిలో ఉందని సంతోషిస్తుంది. కొత్తవంట, కొత్తపంట.. ఏ సందేహం కలిగినా ‘వదినా.. వదినా’ అంటూ పరిగెత్తుకొస్తుంది.
చెల్లె కాని ఆ చెల్లెని అమ్మ ప్రేమగా అక్కున చేర్చుకుంటుంది. అసిస్టెంట్ కమాండర్ హోదాలో తన బలగంలో భాగం చేసుకుంటుంది. ఇక మిగిలింది తోడికోడలు. అప్పటికే అత్తింటి మీద ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్న తోడికోడలు.. కొత్తకోడలి ఆధిపత్యాన్ని ఆమోదించదు. ధిక్కార స్వరం వినిపిస్తుంది. అధికార దర్పం ప్రదర్శిస్తుంది. అప్పుడప్పుడూ పరిధులు దాటి పెత్తనం చేస్తుంది. అయినా అమ్మ ఓర్పుతో భరిస్తుంది. సాక్షాత్తు క్షమయా ధరిత్రి కాబట్టి, ఆ సవాలును చిరునవ్వుతో స్వీకరిస్తుంది. తోడికోడలిని స్నేహితురాలిగా మార్చుకుంటుంది. కొత్త సీరియల్స్ ముచ్చట్లు చెబుతుంది. అడిగినప్పుడు సలహాలు అందిస్తుంది. అడక్కపోయినా చీరలు పెడుతుంది. ఓ సుముహూర్తాన డిప్యూటీ కమాండర్ హోదా ఖరారుచేసి తన సైన్యంలోకి ఆహ్వానిస్తుంది.