వంటింట్లో చేసే చిన్నచిన్న తప్పులే.. ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తాయి. ఎంత శుభ్రత పాటించినా.. బ్యాక్టీరియా, వైరస్లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా.. పచ్చి చికెన్, మటన్, చేపలు మరింత హానికరంగా మారుతాయి. జాగ్రత్తగా లేకుంటే.. ఇ కొలి, సాల్మొనెల్లా, లిస్టెరియా లాంటివి వ్యాపిస్తాయి. అనారోగ్యాన్ని కలిగిస్తాయి.
మాంసాహారంపై హానికర బ్యాక్టీరియాలు తిష్టవేసి ఉంటాయి. చికెన్, మటన్, చేపలు కడిగే సమయంలో.. మన చేతులకు అంటుకుంటాయి. అవే చేతులతో వేరే పనులు చేసేటప్పుడు.. కిచెన్ ప్లాట్ఫాం, వంట పాత్రలు, పోపు డబ్బాలు, ఫ్రిజ్పైకి చేరిపోతాయి. ఆయా ప్రదేశాలు వాటికి సంతానోత్పత్తి కేంద్రాలుగా మారుతాయి. అక్కడ మరింత వృద్ధిచెంది.. ఇతర ఆహార పదార్థాలపైకి వ్యాపిస్తాయి. ఆహారం తినేటప్పుడు మన శరీరంలోకి ప్రవేశించి.. మర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీనిని నివారించడానికి.. వంటశాలలో పూర్తి అప్రమత్తంగా ఉండాలి. మాంసాహారం వండే సమయంలో చేతులను ఒకటికి రెండుసార్లు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. మాంసాహారం కోసం.. ప్రత్యేకమైన కటింగ్ బోర్డు, వంట పాత్రలను వాడుకోవాలి. కిచెన్ ప్లాట్ఫాం, వంటగది గాడ్జెట్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.