జేబులో పర్సులు ఉండటం లేదు.. నోట్లు పెట్టుకోవడం ఎప్పుడో మానేశాం. అంతా ఫోన్‌తోనే.. డిజిటల్ వాలెట్లు దున్నేస్తున్నాయ్. యూపీఐ చెల్లింపులు పరిపాటిగా మారిపోయాయ్. స్కాన్ చేయడం.. ఖుషీగా సాగిపోవడం!! అంతా బాగానే ఉందిగానీ.. ఈ స్మార్ట్ పేమెంట్ల వెనుక జరుగుతున్న మోసాల సంగతేంటి?
మహేశ్‌ది వరంగల్. తను చేసిన హస్తకళాకృతులను ఆన్లైన్ ద్వారా అమ్ముతుంటాడు. ఓ వ్యక్తి పెద్ద ఆర్డర్ ఇస్తూ, UPI స్క్రీన్షాట్లు పంపాడు. కోరిన వస్తువులు డెలివరీ చేశాడు మహేశ్. ఆ తర్వాత ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి చేసిన చెల్లింపులు నకిలీవని తెలిసింది. అప్పటికే, రమేశ్ లక్ష రూపాయల నష్టం చవిచూశాడు. చెప్తూ వెళ్తే ఇలా చోటు చేసుకుంటున్న నకిలీ పేమెంట్లనే ‘జంప్ పేమెంట్ స్కామ్’ అంటున్నారు. ఇప్పుడిదో ట్రెండింగ్ మోసం. డిజిటల్ చెల్లింపులు ఇబ్బడిముబ్బడిగా పెరగడమే దీనికి ప్రధాన కారణం.
ఇలాంటి స్కామ్‌లు తెలివిగా సాగుతున్నాయి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. మోసానికి గురవ్వడం ఖాయం. స్కామర్లు తాము పెద్ద కస్టమర్లుగా పరిచయం చేసుకుంటారు. భారీ ఆర్డర్ ఇస్తారు. పేమెంట్ చేశామని నకిలీ స్క్రీన్షాట్లు, రసీదులు పంపుతారు. ‘పొరపాటున ఎక్కువ డబ్బు పంపించాం, దయచేసి ఆ డబ్బు వెనక్కి పంపండి’ అని మర్యాదగా అడుగుతారు. బాధితులు వారి మాటలు నమ్మి డబ్బు వెనక్కి పంపేస్తారు. వాళ్లు పంపామని చెప్పిన డబ్బు కేవలం స్క్రీన్షాట్పైనే ఉంటుంది కానీ, ఆ మొత్తం మీ ఖాతాలో జమ కాదు. ఈ విషయం తెలియక వాళ్లు ఎక్కువగా పంపామని చెప్పిన మొత్తం తిరిగి చెల్లించేసి చేతులు కాల్చుకుంటాం అన్నమాట. అకౌంట్ వెరిఫై చేస్తే వాళ్ల తాలూకు ఎలాంటి లావాదేవీలూ కనిపించవు. ఎలాంటి రుజువులూ ఉండవు. మీరు పోగొట్టుకున్న డబ్బు వివరాలు మాత్రమే కనిపిస్తాయి. అప్పుడుగానీ మీరు మోసపోయారని అర్థం కాదు.
ఈ జంప్ డిపాజిట్ మోసాలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. అందుకు సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుకోవాలి. ఫోన్‌కి వచ్చే మెసేజ్‌లు.. వాట్సాప్‌కి వచ్చే స్క్రీన్షాట్లను నిజం అని నమ్మొద్దు. వాటిని ఎవరైనా పంపేందుకు ఆస్కారం ఉంటుంది అనే లాజిక్‌ని డెవలప్ చేసుకోవాలి. అప్పుడు ఎవరైనా స్క్రీన్‌షాట్, మెసేజ్ పంపి మీకు డబ్బులు వచ్చేశాయని చెబితే నమ్మరు. మీ ఖాతాలో నిజంగా డబ్బు క్రెడిట్ అయిందో, లేదో బ్యాంకు స్టేట్మెంట్ ద్వారా చెక్ చేసుకోవాలి. మీకు వచ్చిన మెసేజ్ బ్యాంకు అధికారిక సందేశమో కాదో చూసుకోవాలి. అప్పుడే.. ఇలాంటి జంప్ స్కామర్ల బారినపడకుండా ఉండగలం.
వాస్తవాలు ధ్రువీకరించాలి: స్క్రీన్షాట్లు లేదా మెసేజ్‌లపై నమ్మకం పెట్టుకోవద్దు. బ్యాంకు యాప్‌లో గానీ, వెబ్సైట్లో గానీ.. మీ ఖాతా చూశాకే ఆ పేమెంట్‌ను నమ్మండి. స్క్రీన్షాట్లు, మెసేజ్‌లు జనరేట్ చేయడం ఈ డిజిటల్ జమానాలో తేలిక అని గ్రహించాలి. అంతేకాదు, బ్యాంకు అఫీషియల్ ట్రాన్సాక్షన్ స్క్రీన్‌షాట్ తీయడం సాధ్యం కాదనే విషయాన్ని గుర్తెరగాలి.
పదేపదే అడిగారా..: స్కామర్లు సాధారణంగా ఎక్కువగా ఒత్తిడి చేస్తారు. ‘త్వరగా డబ్బు పంపించాలి’ అని అడుగుతుంటారు. ఇలా పదేపదే కాల్స్ చేస్తున్నారంటే.. కచ్చితంగా వాళ్లు స్కామర్లే అని గుర్తించాలి.
తస్మాత్ జాగ్రత్త: మీరేదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే.. చెక్కులు గానీ, పెద్దమొత్తంలో లావాదేవీ గానీ బ్యాంకు నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు వేచి ఉండటం చాలా అవసరం. బ్యాంకు అప్లికేషన్ల ద్వారా అధికారిక నోటిఫికేషన్లను మాత్రమే నిజం అని నమ్మండి. గిఫ్ట్‌కార్డులు లేదా ఇతర అనుమానాస్పద పద్ధతుల ద్వారా డబ్బు తిరిగి పంపాలని అడిగితే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే.. డబ్బు పోగొట్టుకున్న బాధితులు ఆయా ప్లాట్‌ఫామ్‌లలో పంపినవాటిని ఆధారాలుగా చూపలేరు.
అవగాహన లేక మోసపోయాం అని చింతిస్తూ కూర్చోవద్దు. ఆర్థిక నష్టం జరిగిన వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వండి. ఒకవేళ మీరు అఫీషియల్‌గానే బ్యాంకుల నుంచి డబ్బు పంపి ఉంటే స్టేట్మెంట్స్ని రుజువులా చూపొచ్చు. అలా కాకుండా మీరేదైనా గిఫ్ట్కార్డుల్ని పంపితే.. వాటికి బ్యాంకులు బాధ్యత వహించవు. తర్వాత సైబర్ క్రైమ్ సెల్లో ఫిర్యాదు చేయడం అవసరం. అందుకు https://www.cybercrime.gov.in సైట్‌ని చూడండి. టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు. UPI పేమెంట్ సమస్యల కోసం NPCI పోర్టల్ ద్వారా కూడా కంప్లయింట్ చేయొచ్చు. అయితే మీరు ఎలాంటి ఫిర్యాదు చేయడానికైనా రుజువులు అవసరం. అందుకే.. మీరే చేసిన చెల్లింపులకు సంబంధించిన స్క్రీన్షాట్లు, ఇతర మెసేజ్‌లను భద్రపరుచుకోండి.
– అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్