ప్రాథమిక విద్యలో రెండుసార్లు, హైస్కూల్ చదువులో రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు. డిగ్రీలో ప్రవేశానికి మూడుసార్లు ప్రవేశ పరీక్ష రాసినా పాస్ కాలేక పోయాడు. ‘కుర్రాడు మంచోడు. అవకాశం ఇవ్వండి!’ అని కోరితే ఏమంటారు? చీదరించుకుంటారు కదూ? ‘జీవితంలో ఎందుకూ పనికిరాడు. కూలిపని చేసుకొని బతకాల్సిందే!’ అని ముద్ర వేస్తారు. ఇలా ముద్ర వేయడం అరుదుగా జరిగేదేమీ కాదు. చాలామంది చేసేదే.. మాయున్ను కూడా అందరూ ఇలానే.. ‘ఎందుకూ పనికిరాడు!’ అనే తిరస్కార భావంతోనే చూశారు. కానీ, ఆ ఫెయిల్యూర్ విద్యార్థే.. ప్రపంచం మెచ్చిన వ్యాపారవేత్తగా ఎదిగాడు.
ఇంతకూ.. ఈ మాయున్ అంటే అంతగా తెలియక పోవచ్చు. ‘జాక్ మా’ అంటే.. అందరికీ గుర్తుకువస్తాడు. అమెజాన్, ఈ బే వంటి ఈ కామర్స్ కంపెనీలను తలదన్ని.. ప్రపంచంలోనే మేటి ఈ కామర్స్ కంపెనీగా నిలిచిన ‘అలీబాబా’ను స్థాపించింది.. ఈ ఫెయిల్యూర్ విద్యార్థే! అతని అసలు పేరు జాక్ మా కాదు. మాయున్. జాక్ మా అనేది.. తన అమెరికా ప్రయాణానికి సహకరించి, అతని ఎదుగుదలకు దోహదం చేసిన కుటుంబం పెట్టిన ముద్దుపేరు. వారిమీద గౌరవంతో తనపేరు ‘జాక్ మా’ అనే చెప్పుకొంటాడు. జాక్ మా చదువులో పెద్ద చురుకుగా ఉండేవాడేమీ కాదు. కానీ, చిన్నప్పటినుంచి ఇంగ్లిష్ నేర్చుకోవాలని ఆసక్తి ఉండేది. అదే ఆయన్ని చైనాలోనే అతి సంపన్నుడిగా, ప్రపంచం గుర్తించే స్థాయికి తీసుకువచ్చింది.
చీకటి శాశ్వతం కాదు
తిరస్కారం, అవహేళన, అవమానాలకు తలొగ్గకుండా.. తనపై తాను విశ్వాసం కోల్పోకుండా.. పరిస్థితులకు ఎదురొడ్డి నిలవడమే జాక్ మా విజయ రహస్యం. జాక్ మా చైనాలో ఒక సంప్రదాయ నిరుపేద కుటుంబంలో 1964 సెప్టెంబర్ 10న పుట్టాడు. చిన్న ఇల్లు. పౌష్టికాహారం లేక.. పీలగా, బలహీనంగా ఉండేవాడు. చదువులోనూ అంతంత మాత్రమే! ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చినవాళ్లు.. ‘జీవితంలో ఎందుకు ఎదగలేదు?’ అని అడిగితే.. చెప్పుకోవడానికి బలమైన కారణాలు ఎన్నో ఉంటాయి. కానీ, జాక్ మా అందరిలా సాకులు చెప్పుకోలేదు. అలా చెప్పుకొని ఉంటే.. ప్రపంచం ఈరోజు అతని గురించి మాట్లాడుకునేదే కాదు.
సాకులు వెతుక్కోడానికి బదులుగా.. తనకు ఎదురైన సవాళ్లు, వైఫల్యాలనే విజయానికి మెట్లుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం జాక్ మా సంపద 27. 2 బిలియన్ అమెరికా డాలర్లు. మన రూపాయల్లో .. 2.37 లక్షల కోట్లు. కానీ, ఇప్పటికీ అతను సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతాడు. సింపుల్‌గా ఉంటాడు. సంపాదించడమే కాదు.. యువతకు జీవితం గురించి ఉపన్యాసాలు ఇవ్వడానికి ఇష్టపడతాడు. నిరుపేద కుటుంబం నుంచి లక్షల కోట్ల సంపన్నుడిగా మార్చింది అతని ఆత్మవిశ్వాసమే. తిరస్కారాన్ని స్వీకరించే గుణం. ‘ఈరోజు చీకటి ఉండొచ్చు. రేపు చీకటి ఉండొచ్చు. కానీ, ఆ మరుసటి రోజు వెలుగు ఉంటుందని గుర్తించాలి’ అని జాక్ మా బలంగా చెబుతాడు.
ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే మొత్తం 30సార్లు అతణ్ని తిరస్కరించారు. ఒకసారి కేఎఫ్సీలో ఓ చిన్న ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. 24 మంది ఇంటర్వ్యూకు వెళ్తే.. 23 మందిని ఎంపిక చేసుకున్నారు. తిరస్కరణకు గురైంది జాక్ మా ఒక్కడే. అయినా నిరాశ చెందలేదు. జీవితంలో ఒక అవకాశం తప్పిపోయిందంటే.. అంతకన్నా మంచి అవకాశం ఎదురు చూస్తుంది అని గట్టిగా నమ్మడం వల్లే.. ఎన్ని తిరస్కారాలు ఎదురైనా నిరాశను దరి చేరనివ్వలేదు.
అమెరికాకు ఆహ్వానం
‘జీవితంలో ఎదగాలి అంటే 20 ఏళ్లలోపు పరాజయాలు ఎదురుకావాలి, తప్పులు చేయాలి. ఏదైనా చేస్తే విఫలం అవుతామనే భయంతో బతకడం కన్నా.. విఫలం కావడం వల్ల వచ్చే అనుభవం బాగుంటుంది’ అంటాడు జాక్ మా. తనకు బాల్యం నుంచే జీవితం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిదీ తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండేది. చైనాలో ఇప్పటికీ ఇంగ్లిష్ వాడకం తక్కువ. ఐదు దశాబ్దాల క్రితం ఇంకా తక్కువగా ఉండేది. జాక్ మా 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రోజూ సైకిల్ మీద తమ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక హోటల్‌కు వెళ్లేవాడు. అక్కడికి విదేశీ పర్యాటకులు వచ్చేవారు. వాళ్లతో మాట్లాడి ఇంగ్లిష్ నేర్చుకోవాలనేది అతని ప్రయత్నం. ఎందుకంటే.. ఇంగ్లిష్ నేర్పించే టీచర్‌కు ఫీజు చెల్లించాలి.
అంత స్తోమత అతనికి లేదు. దాంతో విదేశీ పర్యాటకులతో మాట్లాడుతూ ఇంగ్లిష్ నేర్చుకొనేవాడు. చాలామంది విదేశీ పర్యాటకులు అతని ప్రయత్నానికి ముచ్చటపడ్డారు. ఒకవైపు చదువుకుంటూనే హోటల్‌కు వచ్చి.. విదేశీ పర్యాటకులకు సహాయం చేసేవాడు. డబ్బులిస్తే తీసుకోకుండా.. తనతో ఇంగ్లిష్‌లో మాట్లాడాలని కోరేవాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. తొమ్మిదేళ్లపాటు జాక్ మా ఇలాగే పనిచేసి.. ఇంగ్లిష్‌పై పట్టు సాధించాడు. ఓసారి అమెరికాకు చెందిన దంపతులు ఆ కుర్రాడి ఉత్సాహాన్ని చూసి ముచ్చటపడ్డారు. వాళ్లే మయూన్‌కు ‘జాక్ మా’ అని ముద్దుపేరు పెట్టి పిలిచారు.
అమెరికాకు వస్తే ఎదగడానికి అవకాశం ఉంటుందని ఆ దంపతులు ఆహ్వానించారు. జాక్ మా అమెరికా వెళ్లి.. అక్కడినుంచే హార్వర్డ్ యూనివర్సిటీలో చదువు కోసం దరఖాస్తు చేశాడు. ఒకసారి కాదు.. పదిసార్లు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి జాక్ మాకు తిరస్కారం తప్పలేదు. కానీ, జాక్ మా ఎదిగిన తర్వాత తమ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాలని పిలిస్తే.. ఆయన ఉత్సాహంగా వెళ్లాడు. ‘హార్వర్డ్ యూనివర్సిటీకి నేను అవసరం లేకపోవచ్చు. కానీ ఈ ప్రపంచానికి నేను అవసరమని భావించి, పదిసార్లు తిరస్కరించినా నిరాశ పడలేదు’ అని చెప్పాడు.
జాక్ మా 1990 ప్రాంతంలో ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాడు. 31 ఏళ్ల వయసులో ఏదో ఆసక్తి కొద్దీ సెర్చ్ ఇంజిన్‌లో బీర్ గురించి వెతికాడు. ఆన్లైన్లో జర్మనీ, అమెరికా తదితర దేశాల కంపెనీలకు చెందిన బీర్లు కనిపించాయి. కానీ, చైనా కంపెనీ కనిపించక పోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ‘ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనా కంపెనీ.. ఆన్లైన్లో కనిపించకపోవడం ఏమిటీ?’ అనుకున్నాడు.
కుల్జా సిమ్ సిమ్
అప్పటికీ జాక్ మాకు టెక్నాలజీ గురించి పెద్దగా తెలియదు. కానీ ఆసక్తి మాత్రం ఉంది. ‘చైనా వస్తువులు కూడా ఆన్లైన్లో లభించే ఏర్పాటుచేయాలి’ అనుకున్నాడు. రెండువేల డాలర్లతో ‘చైనా పేజెస్’ పేరుతో వెబ్సైట్ ఏర్పాటుచేశాడు. చైనాలోని చిన్న చిన్న దుకాణదారులను కలిసి.. ఆన్లైన్ అమ్మకాల గురించి ప్రయత్నించాడు. అందరూ.. ‘నీకేమన్నా పిచ్చా! తెరమీద వస్తువులను చూసి ఎవరైనా కొంటారా?’ అని నవ్వారు. ఈ ప్రయత్నం విఫలమైంది. అతని జీవితంలో ఇది అతిపెద్ద వైఫల్యం. అయినా నిరాశ పడకుండా 1999లో 35 ఏళ్ల వయసులో గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేయడం మొదలుపెట్టాడు.
అదే సమయంలో తన అపార్ట్‌మెంట్‌కు ఓ 17 మంది మిత్రులను పిలిచి.. తన ఆలోచన పంచుకున్నాడు. కార్పొరేట్ ఆఫీస్ లేదు, కూర్చోవడానికి కుర్చీలు లేవు. ఇంట్లోనే తానూ, 17 మంది మిత్రులు. ‘అలీబాబా’ పేరుతో ఆన్లైన్లో చైనా ఉత్పత్తులను అమ్మాలని నిర్ణయించారు. ‘అలీబాబా’ పేరు ఎందుకు? అని మిత్రులు ప్రశ్నిస్తే.. ‘అలీబాబా 40 దొంగలు కథ ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు. అందుకే, ఈ బ్రాండ్ ఈజీగా జనంలోకి వెళ్తుంది. కుల్జా సిమ్‌సిమ్ అనే కోడ్ చెప్పగానే దొంగల గుహ తెరుచుకున్నట్టు.. ఇది మన పాస్వర్డ్!’ అని చెప్పుకొచ్చాడు. మిత్రులకు జీతాలు లేవు. ఆఫీస్ లేదు. అంతా భాగస్వాములే! అలా మొదలైంది.. అలీబాబా ప్రస్థానం.
ఆ సమయంలో అమెరికాలో అమెజాన్, ఈ బే దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో అలీబాబా ఈ కామర్స్ వ్యాపారాన్ని విస్తరించడానికి జాక్ మా చైనాలోని పది బ్యాంకులను సంప్రదిస్తే.. అందరికి అందరూ ‘పోవయ్యా పో!’ అని తిప్పి పంపించారు. అమెరికాకు చెందిన సాఫ్ట్ బ్యాంక్ మాత్రం.. జాక్ మాతో ఓ ఐదు నిముషాలు మాట్లాడి, 20 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ఆమోదం తెలిపింది. జాక్ మా ఆశ్చర్య పోయాడు. అది చాలా పెద్ద మొత్తం. ‘మా ప్లాన్ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఇంత పెద్దమొత్తం ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు?’ అని అడిగితే.. ‘మీ ప్లాన్‌ను చూసి కాదు. వ్యక్తిని చూసి, వ్యక్తి ఆలోచనను చూసి..’ అని బదులిచ్చారు బ్యాంక్ ప్రతినిధులు. ‘మీ ప్లాన్ మీద కాదు.. మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం!’అని చెప్పేసరికి.. తమ బాధ్యత మరింత పెరిగిందని అనుకున్నాడు జాక్.
మాయం- ప్రత్యక్షం
‘ఇంకా నేనే అలీబాబా బాధ్యతలు నిర్వహిస్తే నేను క్రమంగా బాస్‌గా మారుతాను. అది నాకు ఇష్టం లేదు’ అంటూ జాక్ మా బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. 60 వేల మంది సిబ్బంది అతనికి ఘనంగా వీడ్కోలు పలికారు. మొత్తం చైనాలో అదో భావోద్వేగ సన్నివేశం. ప్రస్తుతం యూనివర్సిటీలు, కాలేజీలను సందర్శిస్తూ.. విద్యార్థులు, యువతకు ప్రపంచం గురించి, పోటీ గురించి ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఆమధ్య జాక్ మా ఒక ఉపన్యాసంలో మాట్లాడుతూ.. ‘చైనాలో బ్యాంకింగ్ వ్యవస్థ బాగా లేదు’ అంటూ ప్రభుత్వం తీరును విమర్శించాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు.. హఠాత్తుగా జాక్ మా మాయమయ్యాడు.
యూట్యూబ్‌లో వీడియోలు లేవు, సామాజిక మాధ్యమాల్లో అడ్రస్ లేదు. అమెరికా వార్తా సంస్థలు కూడా జాక్ మా ఏమయ్యాడని వార్తలు ప్రసారం చేశాయి. కొంతకాలం తర్వాత జాక్ మా తిరిగి ప్రత్యక్షమయ్యాడు. ఎప్పటి మాదిరిగానే ఉపన్యాసాలు ఇస్తున్నాడు. కనిపించకుండా పోయినప్పుడు ఏం జరిగిందో చెప్పడు. ప్రభుత్వం బెదిరించింది అనే ఆరోపణలను ఖండించడు.
అలా, సంకల్పం ఉంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనైనా.. విజయం సాధించవచ్చు అని జాక్ మా జీవితం చెబుతున్న పాఠం.
తోకముడిచిన ఈ బే
‘నేను చాలా తెలివైన వాడినని ఎప్పుడూ అనుకోను. మా సంస్థలో నా కన్నా చాలా తెలివైనవాళ్లు ఉన్నారు. మా కంపెనీ కోసం తెలివైన వాళ్లను ఎంపిక చేసుకొనే సామర్థ్యం నాకుంది అని మాత్రమే అనుకుంటాను’ అంటాడు. జాక్ మా కంపెనీ పనితీరు మిగిలిన కంపెనీలకు భిన్నంగా ఉంటుంది. కంపెనీలో ఉద్యోగుల్లా కాకుండా ఒక కుటుంబంలా వ్యవహరిస్తారు. కిందిస్థాయి ఉద్యోగి మొదలుకొని జాక్ మా వరకు అంతా ఒక కుటుంబంలా ఉంటారు. అందరూ ఆడుతారు.. పాటలు పాడతారు. ‘నేను బాగా పాడలేనని నాకు తెలుసు. కానీ, అందరితోపాటు నేనూ పాడాలి అనుకుంటాను’ అని నవ్వుతూ చెబుతాడు.
చైనాలో అలీబాబా చొచ్చుకువెళ్లిన సమయంలో ఈ బే కూడా దూకుడుగా ప్రవేశించింది. ఆ పెద్ద కంపెనీ ప్రచారానికి విపరీతంగా ఖర్చు చేసింది. ఒక దశలో ఆ దాటికి జాక్ మా బృందం భయపడింది. అలీబాబా పని అయిపోయినట్టే అనుకున్నారు. జాక్ మాత్రం భయపడకుండా.. ‘టెక్నాలజీ, డబ్బు విషయంలో మనం ఈ బేతో పోటీ పడకపోవచ్చు. కానీ మనం మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తాం. ఈ పోటీలో నిలబడతాం!’ అని చెప్పి లోకల్ ఫ్లేవర్ చూపించాడు. కొంతకాలానికి పోటీ తట్టుకోలేక ఈ బెనే చైనా నుంచి వెళ్లిపోయింది.
…? బుద్దా మురళి
98499 98087