సాంకేతికత పుణ్యమా అని సంస్కృతులు, సంప్రదాయాలతోపాటు ఆభరణాలూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. కొన్ని దేశాల సంప్రదాయ ఆభరణాలు అతివలను మరింత ఆకట్టుకుంటున్నాయి. వాటిలో ఒకటే ఇటాలియన్ జువెలరీ. తక్కువ బంగారంతో ఎక్కువ మెరుపునిచ్చే ఇవి స్ప్రింగ్ జువెలరీగా ఆధునిక మగువల మనసు దోచేస్తున్నాయి.
బంగారు ఆభరణాలను ఎంచుకునే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పరిశీలించేది వాటి బరువు. ఎంత బరువు నగలైతే అంత ఎక్కువ ధర. కాబట్టి, భారీ ఆభరణాలను ధరించాలని ఉన్నా వాటి ధరను బట్టి కొనేందుకు సాహసించరు. కానీ తక్కువ బంగారంతో పెద్దగా కనిపించే నగల్ని తీసుకోవాలంటే మాత్రం ఇటాలియన్ జువెలరీ సరైన ఎంపిక. ఈ ఆభరణాలు సన్నని తీగలాంటి డిజైన్లలో అందుబాటులో ఉంటాయి. నాజూకుగానే కాదు, అందంగా, ఆకర్షణీయంగానూ ఉండటంతో మహిళలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయివి.
ముఖ్యంగా ఆధునిక మహిళల ఫ్యాషన్ దుస్తులపైకి చక్కగా నప్పుతున్నాయి. ఆకులు, తీగలు, పువ్వుల డిజైన్లతో కూడిన చెవికమ్మలు, గాజులు, కంఠాభరణాలు, ఉంగరాలు, బ్రేస్లెట్లు వీటిలో అందుబాటులో ఉన్నాయి. ఇక, ఇటాలియన్ నగలకి భారతీయ నగిషీలు అద్దినవే ఇండో ఇటాలియన్ ఆభరణాలు. ఇటాలియన్ డిజైన్లకి నల్లపూసలు, మీనాకారీ, ఎనామిల్ మెరుపుల్ని జతచేసి వీటిని తయారు చేస్తారు. ఇవి సంప్రదాయ దుస్తులపైకి కూడా చక్కగా నప్పుతాయి. అందరికీ అందుబాటులో ఉండేలా వెండితోనూ ఈ తరహా నగల్ని తయారు చేస్తున్నారు. రంగురంగుల రాళ్లు, వజ్రాలు పొదిగిన ఇటాలియన్ సిల్వర్ జువెలరీ కూడా భలే ఆకట్టుకుంటున్నది. మీరూ ట్రై చేస్తారా మరి!