అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ‘మేకప్’ను ఆశ్రయిస్తుంటారు. రకరకాల క్రీములు, పౌడర్లతో ముఖానికి మెరుగులు దిద్దుకుంటారు. పెద్దల మాటేమో గానీ, ఇప్పుడు చిన్నారులు కూడా ‘మేకప్’ రాగం ఎత్తుకుంటున్నారు. అయితే, ఇందుకోసం వాడే ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు.. పిల్లలకు ఇబ్బందులు తెచ్చిపెడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, పిల్లలకు మేకప్ వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
సాధ్యమైనంత వరకూ పిల్లలకు మేకప్ వేయకపోవడమే మంచిది. ఒకవేళ పిల్లల నృత్య ప్రదర్శనలు, స్కూల్‌డే లాంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా మేకప్ వేయాల్సి వచ్చినప్పడు.. పూర్తిగా సహజసిద్ధమైన ఉత్పత్తులనే ఎంచుకోవాలి. వాటిని కూడా తక్కువ మోతాదులోనే వాడుకోవాలి. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్‌ను గుర్తిస్తే.. వెంటనే మేకప్ తొలగించాలి.
పిల్లలు అడుగుతున్నారని ఫౌండేషన్ దగ్గర్నుంచీ మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. ఏదో పైపైన వేస్తే చాలు.
మేకప్ వేయడంతోనే కాదు.. దాన్ని సరైన సమయంలో తుడిచేయడంపైనా శ్రద్ధపెట్టాలి. పిల్లలు పడుకున్నారనో.. బిజీగా ఉన్నారనో అశ్రద్ధ చేయొద్దు.
‘ఒకటి – రెండు సార్లే కదా!’ అని.. పిల్లల కోసం నాసిరకం ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దు. పేరున్న బ్రాండ్లకే ప్రాధాన్యం ఇవ్వాలి.
వాడాలనుకున్న ఉత్పత్తులను ముందుగా వారి చేతులు, కాళ్ల చర్మంపై పరీక్షించాలి. క్రీములు, పౌడర్లు అప్లయి చేసినప్పుడు దద్దుర్లు రావడం, చర్మం ఎర్రబడటం గమనిస్తే.. వెంటనే కడిగేయాలి.
ఇక పిల్లలకు ఐలైనర్, మస్కారా, లిప్స్టిక్స్ లాంటివి అస్సలు పెట్టొద్దు.
గడువు తీరిన ఉత్పత్తులపైనా ఓ కన్నేసి ఉంచాలి. రెండుమూడు నెలల సమయం ఉన్నా.. వాటిని వాడకపోవడమే మంచిది.
కొందరు పిల్లల చర్మం మరీ సెన్సిటివ్‌గా ఉంటుంది. అలాంటివారికి మేకప్ వేసేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.