కొత్త దుస్తుల్ని ఒక్కసారి ఉతుక్కొని వేసుకోవాలనేది పెద్దలు చెప్పేమాట. అది సంప్రదాయమని వారు అంటున్నా.. దాని వెనక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దుస్తుల తయారీలో రంగులు నిలవడానికి, ముడతలు పడకుండా ఉండటానికి ఫార్మాల్డిహైడ్ వంటి హానికర రసాయనాలను ఉపయోగిస్తారు. ఆ దుస్తులను అలాగే వేసుకుంటే.. చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, కొత్త దుస్తులకు ఉండే రంగులు.. చెమటకు తడిసి మన చర్మానికి, ఇతర దుస్తులకూ అంటుకొని చికాకు తెప్పిస్తాయి. ఇక దుస్తుల రవాణా, గోడౌన్లు, దుకాణంలో కొన్ని రోజులపాటు నిల్వ ఉండటం వల్ల వాటిపై క్రిమికీటకాలు, బ్యాక్టీరియా చేరే అవకాశం కూడా ఉంటుంది. వాటితో అలర్జీ సమస్యలు వస్తాయి.
వస్త్ర దుకాణాల్లో సైజు కోసం చాలామంది ట్రయల్స్ వేస్తుంటారు. వారికి ఏవైనా అంటు వ్యాధులు, చర్మ సమస్యలు ఉన్నా.. ఒకరినుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంది. సున్నితమైన చర్మతత్వం ఉన్నవారికి, చిన్నపిల్లలకు కొత్త దుస్తులు ఉతకకుండా వేస్తే.. కాంటాక్ట్ డెర్మటైటిస్ వంటి చర్మ సమస్యలు వస్తాయట. ఈ వ్యాధి సోకితే చర్మం పొలుసులుగా మారి దురద పెడుతుంది. ఎర్రగా కందిపోయి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇన్ని సమస్యలు తెచ్చిపెట్టే కొత్త దుస్తుల్ని.. కొన్నప్పుడు కనీసం ఒక్కసారైనా ఉతికి నీరెండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత వేసుకోవడం ఆరోగ్యానికి, చర్మానికీ మంచిది.