వేసవిలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. దాంతో మామూలు నీటికి బదులుగా ఫ్రిజ్‌లోని చల్లని నీటిని తాగడానికే ఆసక్తి చూపుతారు. ఇందుకోసం ఒకేసారి రెండుమూడు రోజులకు సరిపడా నీళ్లను బాటిళ్లలో నింపి.. ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. మరికొందరు బద్ధకస్తులైతే.. వారానికి సరిపడా స్టాక్‌ను ఒక్కసారే ఫ్రిజ్‌లో లోడ్ చేసేస్తారు. అయితే, తాగునీటిని ఇలా రోజుల తరబడి ఫ్రిజ్‌లో స్టోర్ చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాగునీటిని రిఫ్రిజిరేటర్లో 24 గంటలు మాత్రమే ఉంచాలని చెబుతున్నారు. అంతకుమించి నిల్వ చేస్తే.. ఆ నీటిలో బ్యాక్టీరియా పెరుగుతుందట.
ఈ నీరు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాబట్టి, ఫ్రిజ్‌లో ఉంచే తాగునీటిని ప్రతి 24 గంటలకు మార్చడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని నిల్వ చేయడం కూడా ఏమాత్రం మంచిదికాదని అంటున్నారు. అలాగే, ఫ్రిజ్ నీటిని తాగడంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఫ్రిజ్‌లో ఉంచిన ఐస్ వాటర్‌ను అలాగే తాగకూడదు. చల్లదనం తగ్గిన తర్వాతే తీసుకోవాలి. ఎందుకంటే.. ఐస్‌వాటర్ నాడీ వ్యవస్థను చల్లబరుస్తుంది. దాంతో హార్ట్‌రేట్ తగ్గుతుంది. కొందరిలో ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీస్తుంది. అదేవిధంగా భోజనం చేసిన వెంటనే చల్లని నీరు తాగితే..
శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక నిత్యం చల్లటి నీళ్లు తాగడం కూడా జీవక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రోగ నిరోధక శక్తినీ తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా చల్లని నీరు తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్, కడుపునొప్పి సమస్యలూ చుట్టుముడతాయి. చల్లటి నీళ్లు నోటి ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తాయి. వీటివల్ల చిగుళ్ల నొప్పితోపాటు దంతాలు వదులుగా మారుతాయి. గొంతు ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా ఉంది. ఇక మైగ్రేన్, సైనస్ సమస్యలు ఉన్నవారు.. వేసవిలోనైనా చల్లని నీటికి దూరంగా ఉండటమే మంచిది. ఒకవేళ వేసవిలో చల్లని నీరు తాగాలనిపిస్తే.. కుండ నీటిని తాగడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది.