ఆమిర్‌ఖాన్, రీనాదత్తాల కూతురు.. ఇరా ఖాన్ త్వరలో పెండ్లి చేసుకోబోతున్నది. డిప్రెషన్ నుంచి తనను దూరం చేసిన కోచ్.. శిఖరేనే మనువాడబోతున్నది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలన్నీ పంచుకుంది.
చిన్నప్పుడు అమ్మానాన్న నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని ‘రోజూ శుభ్రంగా పళ్లు తోముకోవాలి. లేకపోతే పుచ్చుపట్టిపోతాయి. డాక్టర్లు పీకేస్తారు జాగ్రత్త!’ అని చెప్పారే కానీ, మనసును శుభ్రంగా ఉంచుకోవడం ఎలాగో చెప్పలేదు. కాబట్టే, నేను ఓ దశలో డిప్రెషన్‌కు గురయ్యాను. బాల్యం నుంచీ అంతే. మనసులోని భావాలు ఎవరితోనూ పంచుకునేదాన్ని కాదు. ఏడుపు వచ్చినా.. తలుపులు బిగించుకుని ఒంటరిగా ఏడ్చేదాన్ని. ఈ స్వభావమే నన్ను డిప్రెషన్ వైపు నడిపించిందేమో. నిజానికి ప్రతి సమస్యనూ డిప్రెషన్‌తో ముడిపెట్టలేం. డిప్రెషన్ అనేది జన్యుపరమైన కారణాలతో రావచ్చు, మానసికమైన ఇబ్బందుల వల్ల రావచ్చు, సామాజిక పరిస్థితుల వల్ల కూడా రావచ్చు. నా విషయంలో ఈ మూడూ కలగలిసి దాడి చేసినట్టు అనిపిస్తున్నది.
అమ్మానాన్న విడిపోవడం నా జీవితంలో ఓ దురదృష్టకరమైన సంఘటన. ఆ ఘట్టం కూడా ప్రశాంతంగా జరగలేదు. మీడియాలో అనేక కథనాలు. ఇంట్లో ఓ మోస్తరు యుద్ధాలు. అన్నీ చూస్తూ పెరిగాన్నేను. విడాకులు తీసుకోవడం తప్పేం కాదు. కానీ తీసుకునే తీరులోనే ఉంది సమస్య. మనం బాధలలో ఉన్నప్పుడే నలుగురూ పలకరిస్తారని, ప్రేమ కురిపిస్తారనీ.. నాకు అనిపించేది. దీంతో లేని కష్టాలను కూడా ఊహించుకుని బాధపడేదాన్ని. ప్రతి మనిషికీ ఒక సపోర్ట్ సిస్టమ్ అవసరం. కాస్త ఆలస్యంగా అయినా నన్ను ప్రేమించే ముగ్గురు వ్యక్తులతో.. అమ్మ (ఆమిర్ మాజీ భార్య), నాన్న (ఆమిర్), కిరణ్ ఆంటీ (ఆమిర్‌ఖాన్ ఇంకో మాజీ భార్య) ఓ గ్రూప్ ఏర్పాటు చేశాను. వాళ్లతో చాలా విషయాలు చర్చించుకుంటాను. దీంతో మనసు తేలిక పడుతుంది. గుండె బరువు దిగిపోతుంది. నాలాంటి ఎంతోమంది కోసం ఓ ఫౌండేషన్ స్థాపించాను. ఆ సంస్థ మానసిక ఆరోగ్యం గురించి ప్రచారం చేస్తుంది.