బాక్స్‌లోని రెడ్ కలర్ లెటర్‌ను చదివిన ఇన్స్పెక్టర్ రుద్ర, అతని కజిన్ స్నేహిల్, ఫోరెన్సిక్ ఇంచార్జి జయ నిశ్చేష్టులయ్యారు. ఆ లెటర్లో ఏముందంటే.. ‘హలో రుద్రా.. చచ్చాక కూడా వీడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడేంటి? అని అనుకొంటున్నావా?? చెప్పాను కదా.. నీకు చుక్కలు చూపించాలని డిసైడ్ అయ్యా’ అని చదువుతూ రుద్ర భృకుటి ముడివేశాడు.
మళ్లీలేఖ చదవడం మొదలుపెట్టాడు ఇన్స్పెక్టర్. ‘రుద్రా! నేను చనిపోయేకంటే ముందే సిటీలో మూడు ప్రాంతాల్లో బాంబులు ఫిక్స్ చేశా. నేను చనిపోయిన 24 గంటల్లో తొలి బాంబు పేలుతుంది. ఇప్పుడు నీ టాస్క్ ఏమిటంటే.. ముందు ఆ తొలి బాంబు ఎక్కడ ఉందో కనిపెట్టి.. దాన్ని డిఫ్యూజ్ చెయ్యాలి. అప్పుడే రెండో బాంబు వివరాలు తెలుస్తాయి. ఒకవేళ.. మొదటి బాంబును నువ్వు డిఫ్యూజ్ చెయ్యలేకపోయావో సిటీకి నైరుతిలో ఉన్న 33 శాతం భాగమంతా బూడిదైపోతుంది.
అంతేకాదు.. రెండో బాంబు క్లూ స్టిక్కర్ కూడా నాశనమవుతుంది. అంటే ఫస్ట్ బ్లాస్ట్ అయిన అరగంటలో రెండో బ్లాస్ట్ కూడా జరుగుతుంది. రెండో బ్లాస్ట్ కారణంగా సౌత్ సిటీ మొత్తం నాశనమవుతుంది. ఆ తర్వాత మరో అరగంటలో మూడోది పేలుతుంది. అదే చివరి బ్లాస్ట్. ముందు చెప్పిన రెండు బాంబులను డిఫ్యూజ్ చేసినప్పటికీ.. మూడో బాంబును కనిపెట్టలేకపోయావో.. సిటీ మొత్తం శ్మశానంగా మారిపోతుంది. ఎందుకంటే ఇది మహా పవర్ఫుల్ బ్లాస్ట్.. కారణం ఏంటంటే ఏకంగా 101 బాంబులను ఒకే దగ్గర పెట్టా మరి. కాబట్టి, నువ్వు వెంటనే మేల్కొనాలి. అన్నట్టు తొలి బాంబును కనిపెట్టాలంటే నీకు క్లూ ఇవ్వాలి కదూ. ఇస్తున్నా.. జాగ్రత్తగా చదువు.. ‘కిలోమీటరు దూరంలో ఉన్నప్పటికీ.. గోడల గుసగుసలు వినిపిస్తాయి’.. ఇదే క్లూ. త్వరగా వెళ్లు.. హరియప్ మై బాయ్’ అని ఆ లెటర్లో రాసి ఉంది. అప్పటికే సైకో మరణించి 23 గంటలు కావొస్తున్నది. దీంతో రుద్రకు ఏంచేయాలో అర్థం కాలేదు.
‘జయా ఆంటీ, అరె అన్నయ్యా.. ఎలాగైనా ఈ పజిల్‌ను సాల్వ్ చేసి బాంబు ఎక్కడ ఉందో కనిపెట్టాలి. లేకపోతే ఘోరం జరిగిపోతుంది’ ముఖంపై పట్టిన చెమటను తుడుచుకొంటూ కంగారుగా అన్నాడు రుద్ర. ‘ఆ సైకోగాడు తొలి బ్లాస్టింగ్‌లో సిటీకి నైరుతిలో ఉన్న భాగం నాశనమవుతుంది అన్నాడు. అంటే, బాంబు నైరుతి ప్రాంతంలో ఏదైనా బహిరంగ ప్రదేశంలో’ తన ఆలోచనను వ్యక్తం చేసింది జయ. “కిలోమీటరు దూరంలో ఉన్నప్పటికీ.. గోడల గుసగుసలు వినిపిస్తాయి’ అని సైకో క్లూ ఇచ్చాడు. అంటే నాకు అదే అనిపిస్తుందిరా’ అని స్నేహిల్ తన ఆలోచనను చెప్పాడు.
వెంటనే అందుకొన్న రుద్ర… ‘నాకు కూడా అదే అనిపిస్తుంది అన్నయ్య. మనం ఇప్పుడే అక్కడికి వెళ్లాలి’ అంటున్న రుద్ర.. జయ వైపు చూశాడు. బాంబు పెట్టింది అదే ప్లేస్ అయ్యుంటుందన్నట్టు జయ కూడా తలూపింది. ‘ఒరేయ్ రుద్రా! మనకు అరగంట టైమ్ మాత్రమే ఉంది. ఆలోపు బాంబు స్కాడ్‌తో ఆ ప్రాంతాన్ని వెతికించు’ అంటూ సలహా ఇచ్చింది జయ. సరేనని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం ఇచ్చి.. అప్పటికప్పుడు రప్పించిన హెలికాప్టర్లో తొలి ప్లేస్‌కు వెళ్లారు రుద్ర అండ్ టీమ్.
అప్పటికే జాగిలాలు, బాంబు స్కాడ్ టీమ్ మొత్తం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నది. అందరిలోనూ టెన్షన్. మరో 10 నిమిషాలు ఉందనగా, తొలి బాంబు దొరికినట్టు బాంబు స్కాడ్ టీమ్ మెంబర్ సమాచారమిచ్చాడు. రుద్ర, జయ, స్నేహిల్ ముఖంపై కొంచెం చిరునవ్వు. ఆ వెంటనే ముగ్గురు బాంబు దగ్గరికి వెళ్లి దానిమీద ఉన్న రెండో క్లూ లెటర్ చదివారు. ‘రుద్రా.. మొత్తానికి తొలి బాంబును కనిపెట్టావన్న మాట. ఇక రెండో బాంబుకు క్లూ ఏంటంటే.. హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది అదే. దాన్ని ఒక్కరోజులోనే కట్టారని కొందరు అంటారు. అది నిజమో కాదో నాకు తెలియదు గానీ ఆ భారీ నిర్మాణం కిందనే రెండో బాంబు పెట్టా.
అన్నట్టు నువ్వు ఉన్నచోట నుంచి అక్కడికి ఓ రహస్య సొరంగం కూడా ఉందట. ట్రై చేస్తావా? ఏంటి??’ అని రాసి ఉంది. క్లూ చదివిన వెంటనే.. సిబ్బందితో తొలి బాంబును డిప్యూజ్ చేయమన్నాడు రుద్ర. బాంబు డిఫ్యూజ్ అవ్వగానే రెండో బాంబు బ్లాస్టింగ్‌కు 30 నిమిషాల కౌంట్‌డౌన్ మొదలైంది. ఇప్పుడు ఆ రెండో బాంబును కనిపెట్టడం ఎలా? అని రుద్ర ఆలోచనలో పడ్డాడు. ఇంతలో హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి అక్కడికి వచ్చాడు. ‘సార్..ఒక్కరోజులో నిర్మాణం అనే పుకారు కేవలం ఆ నిర్మాణానికే ఉంది. పైగా.. మనం ఉన్నదగ్గర నుంచి అక్కడికి ఓ రహస్య సొరంగం కూడా ఉందని అంటారు. అక్కడికి వెళ్దాం పదండి’ అంటూ ఏమాత్రం డౌట్ లేకుండా చెప్పాడు రామస్వామి. అక్కణ్నుంచి హెలికాప్టర్లో 15 నిమిషాల్లో రెండో ప్లేస్‌కు వెళ్లారు రుద్ర అండ్ కో. అక్కడున్న జనాన్ని ఖాళీ చేయించి.. బాంబు కోసం వెదికారు.
ఆశ్చర్యం.. రామస్వామి చెప్పినట్టే అక్కడ రెండో బాంబు దొరికింది. దాన్ని డిఫ్యూజ్ చేశారు. బాంబు మీద ఉన్న క్లూ లెటర్‌ను తెరిచి చదివారు. ‘గుడ్ రుద్రా! ఇది నువ్వు చదువుతున్నావంటే రెండో బాంబును కూడా కనిపెట్టావన్న మాట. ఇక మూడవది.. ఇదే ఆఖరుది. దాన్ని డిఫ్యూజ్ చేస్తే.. సిటీ మొత్తాన్ని ప్రస్తుతానికి కాపాడిన వాడివి అవుతావు. మూడో బాంబుకు సంబంధించిన క్లూ ఏంటంటే.. ప్రపంచంలోనే అతి పొడవైన డైనింగ్ టేబుల్ అది. 101 కుర్చీలు ఉంటాయి. అక్కడే బాంబును పెట్టా. ఆ ఊడలమర్రి రహస్యం తెలుసుకో’ అని ఉంది. ఈ క్లూ చదవగానే.. సైకో మూడో బాంబు ఎక్కడ పెట్టాడో రుద్రకు ఇట్టే అర్థమయ్యింది. హెలికాప్టర్లో నేరుగా అక్కడికే వెళ్లి ఆ డైనింగ్ టేబుల్ ఉన్న రూమ్‌లో ప్రవేశించాడు.
అయితే, సైకో రవి చెప్పినట్టు అక్కడి కుర్చీల మీద ఎలాంటి బాంబులు కనిపించలేదు. డెడ్‌లైన్‌కు ఇంకా పది నిమిషాలే ఉంది. దీంతో ఏం చేయాలో అర్థంకావట్లేదు. అందరిలోనూ టెన్షన్. ‘ఇన్ని విషయాలను కరెక్ట్‌గా చెప్పిన సైకో రవి.. ఇదొక్కటే ఎలా తప్పు చెప్తాడు?’ రుద్ర మదిలో ఇదే ఆలోచన. ఇంతలో అక్కడే ఉన్న బాంబు స్కాడ్ సూపరిండెంట్‌ను కలిసిన రుద్ర.. కుర్చీలను జాగ్రత్తగా పరిశీలించాలన్నాడు. ఎంత వెదికినా బాంబు జాడ దొరకలేదు. ఇంతలో ఆ డైనింగ్ టేబుల్ ఉన్న రూమ్ కిటికీలోంచి బయటకు చూశాడు రుద్ర. నిర్మానుష్యంగా జుట్టు విరబోసుకొన్నట్టు ఓ మర్రిచెట్టు బయట కనిపిస్తుంది.
ఇంతలో ‘ఊడలమర్రి రహస్యం తెలుసుకో’ అన్న సైకో మాటలు గుర్తొచ్చాయ్. వెంటనే అక్కడికి పరిగెత్తిన రుద్ర.. అక్కడ వెతకమని సిబ్బందిని పురమాయించాడు. చెట్టుతొర్రలో ఓ పెద్ద మూట ఉంది. అందులో 101 బాంబులు ఉన్నాయి. అలాగే ఓ లెటర్ కూడా రాసి ఉంది. రుద్ర ముందుగా ఆ బాంబులను డిఫ్యూజ్ చేయించాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. అనంతరం.. రుద్ర లెటర్ ఓపెన్ చేసి చదివాడు. ‘ఓ మై డియర్ రుద్రా.. ఊరంతా తిరిగి బాంబులను కనిపెట్టిన నువ్వు.. నేను చంపిన అమ్మాయి ఎవరు? 24 గంటలు గడిచాక ఆమె బాడీ నుంచి ఏం వస్తుంది? అనేది తెలుసుకోలేదా? హహ్హహ్హ’ అంటూ అసలైన బాంబు పేల్చాడు. మరో ఉత్పాతం జరుగబోతోందని రుద్రకు అర్థంకావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అది పక్కనపెడితే.. సైకో మూడు బాంబులను ఏయే ప్రాంతాల్లో పెట్టాడో కనిపెట్టారా?
…? రాజశేఖర్ కడవేర్గు