భారతీయ పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కాదు, అవి పిల్లల మానసిక, భావోద్వేగ ఎదుగుదలకు బలమైన పునాదులు వేస్తాయి. మన సంస్కృతిలో భాగమైన ఈ పండుగలు పిల్లలలో సానుకూల దృక్పథాన్ని, సామాజిక స్పృహను పెంపొందిస్తాయి. రంగుల హోలీ నుంచి వెలుగుల దీపావళి వరకు, ప్రతి పండుగ ఒక ప్రత్యేక సందేశాన్ని అందిస్తుంది. ఆధునిక కాలంలో ఒత్తిడికి లోనవుతున్న పిల్లలకు ఈ పండుగలు ఒక గొప్ప ఎమోషనల్ బూస్టర్లా పనిచేస్తాయి.
ప్రతి పండుగకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. బతుకమ్మ సంబురం ఊరంతటినీ ఒక్కటి చేస్తుంది. దసరా వేడుక అలాయ్-బలాయ్తో ఆత్మీయతలను పంచుతుంది. దీపావళి వచ్చిందంటే అనుబంధాలు మతాబుల్లా వెలుగులీనుతాయి. ఇలా ప్రతి పండుగ ఆంతర్యం మానవ సంబంధాలను ద్విగుణీకృతం చేసేందుకు దోహదం చేసేదే అయి ఉంటుంది. సంక్రాంతి విషయానికి వస్తే.. ఇంటిల్లిపాదినీ ఒక్కతాటిపైకి తీసుకొస్తుంది. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఆనందాన్ని పంచుతుంది. పండుగలు మన పిల్లల ఎదుగుదలకు ఎలా దోహదం చేస్తాయో తెలుసుకుందాం.
1. కుటుంబ అనుబంధాలు-భద్రతా భావం
పండుగ సమయంలో బంధుమిత్రులందరూ ఒకచోట చేరడం వల్ల పిల్లలలో ఒంటరితనం పోయి, భద్రతా భావం పెరుగుతుంది. ఉమ్మడి కుటుంబ వాతావరణం, పెద్దల ఆశీస్సులు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. తాము ఒక పెద్ద కుటుంబంలో భాగమనే భావన వారిని మానసికంగా దృఢంగా చేస్తుంది.
2. సామాజిక నైపుణ్యాలు
పండుగ పనుల్లో పాలుపంచుకోవడం, అతిథులకు మర్యాద చేయడం, ఇతరులతో కలిసి ఆడుకోవడం వంటివి పిల్లలలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుతాయి. ఉదాహరణకు సంక్రాంతి ముగ్గులు వేయడం లేదా వినాయక చవితి పందిరి పనుల్లో సహాయం చేయడం వల్ల వారిలో టీమ్ వర్క్ పెరుగుతుంది.
3. జీవిత పాఠాలు
మన పండుగలలో దాగి ఉన్న లోతైన అర్థాలు పిల్లలకు జీవితం పట్ల అవగాహన కల్పిస్తాయి. తీపి, వగరు, చేదుల కలయిక అయిన ఉగాది పచ్చడి ద్వారా జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని పిల్లలు నేర్చుకుంటారు. ఇది వారిలో భావోద్వేగ నియంత్రణ కలిగిస్తుంది.
4. నైతిక విలువలు, క్రమశిక్షణ
పండుగల వెనుక ఉన్న పురాణ గాథలు పిల్లలకు ధర్మం, సత్యం, విజయం పట్ల స్పష్టతనిస్తాయి. చెడుపై మంచి సాధించిన విజయంగా జరుపుకొనే దసరా పిల్లలలో ధైర్యాన్ని, నీతిని పెంపొందిస్తుంది.
మేధో వికాసం..
పండుగలు కేవలం సరదా కోసం చేసుకునే వేడుకలు మాత్రమే కాదు, పిల్లల ఆలోచనా విధానాన్ని, మేధో వికాసాన్ని మలిచే శక్తిమంతమైన సాధనాలు. అదెలాగో చూద్దాం.
దీపావళికి ఆకాశ దీపాలు తయారు చేయడం, వినాయక చవితికి మట్టి ప్రతిమలను చేయడం లాంటి సందర్భంలో ‘ఏ రంగు వేస్తే బాగుంటుంది?‘, ‘ఇది పడిపోకుండా ఎలా నిలబెట్టాలి?’ లాంటి ప్రశ్నలు పిల్లల్లో తార్కిక ఆలోచన, సృజనాత్మకతను పెంచుతాయి.
పండుగ పనులు ఒక క్రమపద్ధతిలో జరుగుతాయి. ఇల్లు శుభ్రం చేయడం నుంచి పూజా సామగ్రిని అమర్చడం వరకు ప్రతి దానిలో ఒక వరుస క్రమం ఉంటుంది. పిల్లలు ఈ పనులను గమనిస్తూ, పెద్దలకు సహాయం చేయడం ద్వారా టైమ్ మేనేజ్మెంట్, ముందుచూపు నేర్చుకుంటారు.
ప్రతి పండుగలోనూ కొన్ని చిహ్నాలు ఉంటాయి. దీపం వెలిగించడం జ్ఞానానికి గుర్తు, రంగులు చల్లుకోవడం సంతోషానికి గుర్తు. ఈ చిహ్నాల వెనుక ఉన్న అర్థాలను గ్రహించడం ద్వారా పిల్లలలో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ మెరుగుపడుతుంది. కంటికి కనిపించని భావాలను కూడా అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
పండుగల వెనుక ఉన్న కథలు, పాటలు, శ్లోకాలు పిల్లలు పదేపదే వింటారు. పెద్ద కథలను గుర్తుంచుకోవడం ద్వారా వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శ్లోకాలు, మంత్రాల ఉచ్చారణ వల్ల వారి భాషా పరిజ్ఞానం, స్పష్టత మెరుగుపడతాయి.
పండుగలు అంటే కేవలం కొత్త దుస్తులు, పిండి వంటలు మాత్రమే కాదు. అవి పిల్లల మనసులను సంస్కరించే పాఠశాలలు. తల్లిదండ్రులు పిల్లలను కేవలం ప్రేక్షకులుగా కాకుండా వేడుకల్లో భాగస్వాములను చేసినప్పుడే వారిలో సంపూర్ణ మానసిక వికాసం కలుగుతుంది. పిల్లలు పండుగలు ద్వారా సంప్రదాయాలే కాదు, ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడటం కూడా నేర్చుకుంటారు.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261