షష్ఠి కన్రాడ్ (38).. వాషింగ్టన్ స్టేట్ డెమోక్రటిక్ పార్టీలో అత్యున్నత పదవిని సొంతం చేసుకున్నారు. ఆ స్థానాన్ని ‘చెయిర్ ఆఫ్ ది పార్టీగా’ వ్యవహరిస్తారు. షష్ఠి ఈ పదవిని అలంకరించిన పిన్నవయస్కురాలే కాదు.. ఓ అమెరికన్ రాజకీయ పార్టీలో కీలక పదవిని సొంతం చేసుకున్న తొలి ఇండియన్-అమెరికన్ కూడా. కన్రాడ్ వృత్తిరీత్యా పొలిటికల్ కన్సల్టెంట్. అప్పటి సెనేటర్ ఒబామా క్యాంపులో ఫీల్డ్ ఆర్గనైజర్‌గా కెరీర్ ప్రారంభించారు. డెమోక్రటిక్ పార్టీ పొలిటికల్ క్యాంపెయిన్‌లో కీలకపాత్ర పోషించారు. ఆమె సమర్థతపై నమ్మకంతో పార్టీ సెనేటర్లు, యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెకు మద్దతిచ్చి గెలిపించారు. ‘ఈ పదవిని గొప్ప అవకాశంగా భావిస్తున్నా. పార్టీ ద్వారా ఓటర్లకు నా వంతు మేలు చేయగలననే నమ్మకం ఉంది. మా పార్టీకి మరింత మద్దతు కూడగడతాను’ అంటారు షష్ఠి కన్రాడ్.