తొడగొట్టిన కట్టబొమ్మన్.. విల్లంబులు ఎక్కుపెట్టిన అల్లూరి..మీసం మెలేసిన భగత్‌సింగ్.. ఇలా.. వందేమాతరం అన్న మొన్నటి తరంలో మేరునగ మగధీరులు ఎందరో! స్వాతంత్య్రోద్యమ చరిత్రను పరికిస్తే..నడుం బిగించి.. పగవాడికి మగవాడి కన్నా ప్రమాదకరం అని నిరూపించిన వీరనాయికలూ కనిపిస్తారు. ఆంగ్లేయుల కుత్తికలు కోసిన వీరమంగై.. నేతాజీ పిలుపు అందుకున్న శివగామి.. బాపూజీకి అండగా నిలిచిన బీ అమ్మ.. ఇలా మరెందరో! భారత స్వతంత్ర దినోత్సవ వేళ… వారి చరిత్రను తలుచుకుందాం.. త్యాగాలను స్మరించుకుందాం…
తెల్లదొరలను ఓడించిన వీరమంగై
బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా రాజులు, సైనికుల పోరాటం అంటే మనకు 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటే గుర్తుకువస్తుంది. నానాసాహెబ్, రాణి లక్ష్మీబాయి లాంటివారి పేర్లే స్ఫురిస్తాయి. కానీ, అంతకంటే చాలా ఏండ్ల ముందే స్వదేశీ రాజ్యాల పాలకులు బ్రిటిష్‌వారిపై పోరాటం చేశారు. రాణి కిత్తూరు చెన్నమ్మ, వీరపాండ్య కట్టబొమ్మన్ లాంటివారు ప్రసిద్ధి చెందారు. రాణి వేలు నాచ్చియార్ కూడా ఈ కోవలోకే వస్తారు.
ఆమె 1730 జనవరి 3న తమిళనాడు రాష్ట్రం రామనాథపురంలో జన్మించారు. బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తొలి భారతీయ పాలకురాలు వేలు నాచ్చియార్. అందుకే ఆమెను తమిళులు ‘వీరమంగై’ అని పిలుచుకుంటారు. బ్రిటిష్‌వారిపై పోరాటం కోసం ఆమె ఆయుధాలు పట్టడం, తమిళ పోరాట కళలైన వలరి, శీలంబం, గుర్రపు స్వారీ, విలువిద్యలను నేర్చుకున్నారు. అంతేకాదు ఆమె తన మాతృభాష తమిళంతోపాటు ఇంగ్లిష్, ఉర్దూ, ఫ్రెంచి కూడా మాట్లాడగలరు.
వేలు నాచ్చియార్ వివాహం శివగంగై పాలకుడు ముత్తువడుగనాథపెరియ ఉడైయదేవర్తో జరిగింది. భర్త బ్రిటిష్‌వారి చేతుల్లో మరణించడంతో ఆమె స్వయంగా యుద్ధరంగంలో అడుగుపెట్టారు. మైసూరు పాలకుడు హైదర్ అలీ, గోపాల నాయకర్‌తో కలిసి ఆంగ్లేయులతో పోరాడారు. హోరాహోరీ పోరులో బ్రిటిష్ సైన్యంపై రాణి విజయం సాధించారు. అలా శివగంగై సంస్థానాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. 1780 నుంచి మరుదు సోదరుల సహకారంతో పరిపాలన కొనసాగించారు. దశాబ్దం తర్వాత వేలు నాచ్చియార్ కూతురు వెల్లాచ్చి సంస్థానాధీశురాలు అయింది. 1796 డిసెంబర్ 25న నాచ్చియార్ మరణించారు.
వయసులో చిన్న..పోరాటంలో మిన్న
భారత స్వరాజ్య సమరంలో నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ ఆధ్వర్యంలో నడిచిన భారత జాతీయ సైన్యం పోరాటం ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించింది. సింగపూర్ నుంచి ప్రారంభమైన బోస్ పోరాటం బర్మా మీదుగా భారత దేశ సరిహద్దుల వరకు సాగింది. ఈ నేపథ్యంలో నేతాజీ ఉపన్యాసాలు ఎంతోమందిలో పోరాట స్ఫూర్తిని నూరిపోశాయి. ఆయన మాటలకు తూటాల్లా దూసుకెళ్లిన యోధుల్లో ఒకరు శివగామి అమ్మయ్యార్.
ఆమె 1933లో తమిళనాడులోని ధర్మపురి జిల్లా అణ్నాసాగరం గ్రామంలో జన్మించారు. మారిముత్తు ముదలియార్, చిన్నతాయి ఆమె తల్లిదండ్రులు. తన కుటుంబంతోపాటు శివగామి మలేసియాకు వలసవెళ్లారు. అక్కడ మారిముత్తు ఓ తేయాకు తోటలో పనిచేసేవారు. శివగామి మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఉన్న జై హింద్ హిందూ పాఠశాలలో చదువుకున్నారు. అదే సమయంలో భారత జాతీయ సైన్యం పోరాటం మొదలైంది.
అప్పుడు సుభాష్‌చంద్ర బోస్ ఉపన్యాసంతో స్ఫూర్తిపొందిన శివగామి, పదకొండేండ్ల వయసులోనే భారత జాతీయ సైన్యంలో భాగమైన ‘బాలక్ సేన’లో చేరారు. అలా 1942 1945 మధ్యకాలంలో శివగామి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో కేర్‌టేకర్‌గా సేవలందించారు. ఆ సమయంలో ఆమె తన సోదరుడు పరంధామ్తో కలిసి ‘వీరవనిత’ అనే వీధి నాటకం ప్రదర్శించారు. వీధుల్లో ప్రదర్శనలు ఇస్తూ భారత జాతీయ సైన్యం కోసం నిధుల సేకరణ చేపట్టారు. స్థానిక ప్రజల్లో భారత స్వాతంత్య్ర పోరాటం గురించి ప్రచారం చేశారు.
ఆమె గురించి తెలుసుకున్న నేతాజీ బర్మా రావాలని శివగామిని అడిగారు. కానీ, ఆమె అందుకు ఒప్పుకోలేదు. కాగా, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బాంబు దాడుల్లో గాయపడ్డవారిని తన సోదరుడితో కలిసి శివగామి కాపాడింది. అయితే, శివగామి ఆధ్వర్యంలో నడుస్తున్న వసతిగృహాన్ని 1943లో బ్రిటిష్ వాళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను బ్రిటిష్ అధికారుల ముందు డ్యాన్స్ చేయాలని సైనికులు ఒత్తిడిచేశారు. కానీ, ఆమె ధైర్యంగా అందుకు నిరాకరించారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో అతిపిన్న వయసులోనే దేశమాత స్వాతంత్య్రం కోసం ఆరాటపడిన శివగామిని తమిళనాడు ప్రభుత్వం 1973లో ‘త్యాగ చెమ్మాళ్’ పురస్కారంతో గౌరవించింది.
స్వరాజ్య సాధనలో అమ్మ పాత్ర
ఇప్పుడు ఎక్కువమందికి ఆబాదీ బానో బేగం పేరు అంతగా తెలియకపోవచ్చు. ఆమె స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీతో కలిసి పోరాడిన అలీ సోదరుల (మౌలానా మహమ్మద్ అలీ, మౌలానా షౌకత్ అలీ) తల్లి. జాతీయోద్యమ చరిత్రలో ఆమె ‘బీ అమ్మ’గా ప్రసిద్ది చెందారు. అంతేకాదు, స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్న తొలి ముస్లిం మహిళగా పేరుగాంచారు. ఆమె 1850లో ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జన్మించారు.
రామ్‌పుర్ రాజ్యానికి చెందిన అబ్దుల్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె భర్త చిన్న వయసులోనే కలరాతో మరణించారు. తర్వాత బేగం తన నగలను పిల్లలు చదువుకోవడానికిగాను ఓ ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు విరాళంగా ఇచ్చేశారు. తర్వాత కాలంలో ఆమె తన కొడుకులతో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన ఘట్టాలైన ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో లాహోర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆబాదీ బానో బేగం స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం ఇచ్చారు. దేశం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లడానికి భారతీయులు చేసిన పొరపాట్లను అందులో వివరించారు.
అనీబిసెంట్, తన కొడుకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు… దానికి నిరసనగా జరిగిన ఓ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఖద్దరు ప్రాధాన్యం గురించి ప్రచారం చేశారు. హిందువులు ముస్లింల మధ్య ఐక్యతకు కృషిచేశారు. స్వరాజ్య సాధన కోసం భారతీయులంతా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆధ్వర్యంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమంలో బేగం పాట్నా, భగల్పుర్ మధ్య పర్యటించారు. అదే సమయంలో జరిగిన ఖిలాఫత్ ఉద్యమం కోసం ఆమె అరవైవేల రూపాయలు సేకరించారు. అలా 1924లో తాను మరణించేవరకు ఆబాదీ బానో బేగం దేశ స్వాతంత్య్రం కోసం కృషిచేశారు. ఆమె స్మారకంగా దిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోని మహిళల వసతి గృహానికి ‘బీ అమ్మ’ పేరుపెట్టారు.